సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నేత గుమ్మడి నర్సయ్యకు ప్రాధాన్యత లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గుమ్మడికి గాలం వేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జోరందుకుంది. ఈ ఏడాది జనవరి 12న ఐడీఓసీ ప్రారంభోత్సవం సందర్భంగా పోడు పట్టాల సమస్యపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య సభా వేదిక వద్దకు రాగా, ఆయనకు ఆ అవకాశం కల్పించేందుకు ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు బీఆర్‌ఎస్ పెద్దలు నిరాకరించారు.
దీంతో ఆయన వినతిపత్రం ఇవ్వకుండానే వెనుదిరిగారు. కాగా, గత శుక్రవారం.. పోడు సాగు చేస్తున్న రైతులందరికీ పట్టా లు జారీ చేయాలని మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య వచ్చారు. ఈసారి వినతిపత్రం తీసుకోవడమే కాక అనూహ్యంగా ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ప్రొటోకాల్ లేకపోయినా మాజీ శాసన సభ్యుడిని గౌరవిస్తూ అధికారిక కార్యక్రమ వేదిక పంచుకునే అవకాశం కల్పించారు. మంత్రులు హరీశ్‌రావు మొదలు జిల్లా కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు గుమ్మడి నర్సయ్య పేరును తమ ప్రసంగాల్లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో గులాబీ పార్టీలో కొత్త చేరికలు ఏమైనా ఉంటాయా అనే ప్రచారం మొదలైంది.
మచ్చలేని నేతగా..
ఇల్లెందు నుంచి గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగినా ఎక్కడా అవినీతి మరకలు ఆయనకు అంటుకోలేదు. ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు కూడా ఆటోల్లో తిరుగుతూ.. వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితమే గడిపారు. గుమ్మడి రాజకీయ ప్రస్థానం, జీవన విధానంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కూతురు కవిత టీచర్‌గా, చిన్న కూతురు అనురాధ లా కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ స్థాయికి చేరుకున్న తొలి ఆదివాసీ మహిళగా అనురాధ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. మొత్తంగా గుమ్మడి నర్సయ్య కుటుంబానికి రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉంది.
పలు పార్టీల నుంచి ఆహ్వానం..
రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉన్న గుమ్మడి నర్సయ్యను తమ పార్టీలోకి రావాలంటూ అనేక సార్లు వివిధ పార్టీలు ఆఫర్లు ఇచ్చాయి. కానీ సానుకూల ఫలితం రాబట్టలేకపోయాయి. దీంతో గత కొన్నేళ్లుగా గుమ్మడి నర్సయ్య కుమార్తెలకు టికెట్లు ఇస్తామంటూ పలు పార్టీలు రాయబారాలు నడుపుతున్నాయనేది బహిరంగ రహస్యం. అందులో భాగంగానే తమ వంతు ప్రయత్నాలను గులాబీ పార్టీ నేతలు మరింత ముమ్మరం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా గుమ్మడి కుటుంబసభ్యులను ‘కారు’ ఎక్కించి, ఎంపిక చేసిన నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా ఫోకస్ చేయాలనే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై గుమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. రాజకీయంగా జరుగుతున్న ప్రచారాలపై వారు మౌనంగానే ఉన్నారు.
గౌరవించి గొంతు నొక్కేశారు
జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న వారిలో అనేక మందికి పట్టాలు రాలేదు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వాలని సభాస్థలికి వెళ్లాను. ఈ క్రమంలో తనను మాజీ ఎమ్మెల్యేగా గుర్తించి వేదిక మీదకు పిలిచి కూర్చోబెట్టి గౌరవించారు, అయితే పోడు రైతుల పక్షాన వారి సమస్యను వినిపించే అవకాశం కల్పించకుండా గొంతు నొక్కేశారు. మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు వేదిక పైకి పిలిచి గౌరవించడంలో అర్థం లేదు. దీని వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యం.
– గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment