భద్ర గిరిలో జోరు తగ్గిన కారు! | - | Sakshi
Sakshi News home page

భద్ర గిరిలో జోరు తగ్గిన కారు!

Nov 23 2023 12:10 AM | Updated on Nov 23 2023 2:04 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. భద్రాచలం అభివృద్ధి కోసం స్థానికుడైన తెల్లం వెంకట్రావును గెలిపిద్దామనే నినాదంతో టాప్‌ గేర్‌లో పరుగెత్తిన ‘కారు’ పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ హైవేను వీడి గతుకుల రోడ్డు మీదకు వచ్చినట్టుగా తయారైంది.

తెల్లం ఇమేజ్‌ పనిచేసేనా..?
భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నేతలందరికీ తెల్లం వెంకట్రావు వ్యవహారశైలిపై ఒక అంచనా ఉంది. వైద్యుడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆపదలో ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తారని, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే బాధితులు అడగకుండానే ఫీజులో రాయితీ ఇస్తారనే ఇమేజ్‌ ఆయన సొంతం. అందుకే రాజకీయంగా పెద్దగా చొరవ చూపించకపోయినా, అంచనాలను అందుకోలేని వ్యూహాలు అమలు చేయకున్నా, తెల్లానికి ఉన్న మంచి పేరు తమకు ఓట్లు తెస్తాయనే నమ్మకం బీఆర్‌ఎస్‌ నేతలు, కేడర్‌లో ఉంది. ఆ నమ్మకంతోనే పార్టీ అధిష్టానం కూడా టికెట్‌ కేటాయించింది.

తలకుమించిన భారంగా..
భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం తలకు మించిన భారంగా మారుతోందని ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గతంగా మథనపడుతున్నారు. ప్రచార షెడ్యూల్‌ వివరాలు తమకు తెలపడమే తప్ప అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం నయా పైసా ఇవ్వకుండా నియోజకవర్గంలోని పార్టీ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని కిందిస్థాయి నాయకులు వాపోతున్నారు. తమ సమస్యను అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు చెబితే..‘అన్ని విషయాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాతా మధు చూస్తారు’ అంటూ బదులిస్తున్నారని, మధు దగ్గరకు వెళితే వెంకట్రావునే అడగాలంటూ బంతిని తన కోర్టులో నుంచి బయటకు నెటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య తాము ఇబ్బంది పడుతున్నామని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

కొత్త వారికే ప్రాధాన్యం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి వెంకట్రావు ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో ఉంటూనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో కొనసాగారు. అనంతరం పార్టీని సైతం వీడారు. దీంతో భద్రాచలం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేందుకు బోదబోయిన బుచ్చయ్య, మానె రామకృష్ణ వంటి నేతలు ఆసక్తి చూపించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య తిరిగి వెంకట్రావుకే టికెట్‌ దక్కింది. తమ ఆశలు ఆడియాసలు అయినప్పటికీ బుచ్చయ్య, రామకృష్ణతో పాటు వారి మద్దతుదారులంతా పార్టీ కోసం శ్రమిస్తున్నారు. అయితే వీరితో పాటు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న పాతవారికి ప్రస్తుతం తగు రీతిలో ప్రాధాన్యత లభించడం లేదనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి కొత్తగా బీఆర్‌ఎస్‌లో చేరిన వారికే పెద్ద పీట వేస్తున్నారనే చర్చ భద్రాచలం గులాబీ వనంలో జరుగుతోంది.

ఇద్దరూ ఇద్దరే..
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రావుతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సైతం పార్టీ కార్యక్రమాల పట్ల చొరవ చూపించకుండా, కింది స్థాయి నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల అవగాహన లేకుండా వ్యవహరించడం మొదటికే మోసం తెస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం నోటిమాటగా ఆదేశాలు జారీ చేస్తేనే క్షేత్రస్థాయిలో పనులన్నీ చక్కబడిపోతాయి అన్నట్టుగా ఉన్న వారి వైఖరి చివరకు పార్టీకే చేటు తెస్తోంది. దీంతో ‘కారు’కు నామినేషన్‌ వేసిన రోజున్న సానుకూల వాతావరణం క్రమంగా బలహీనపడుతోందనే భయాందోళన పార్టీ అభిమానుల్లో కనిపిస్తోంది.

గెలుపే లక్ష్యంగా
తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీకి రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. రెండుసార్లూ పది సీట్లలో ఒక్కో స్థానంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా గులాబీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలు, అంతర్గత కుమ్ములాటలు ఉన్న నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట స్థానానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాచలానికి ఎమ్మెల్సీ తాతా మధు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరి నియామకం తర్వాత ఇల్లెందు, కొత్తగూడెంలో సానుకూల ఫలితాలు కనిపిస్తుండగా భద్రాచలంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయనే భావన ఆ పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement