ఇల్లెందురూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. సమాజ గతిని మార్చే ఓటును ప్రతి ఒక్కరూ నిజాయితీగా వినియోగించుకోవాలి. సమర్థులను ఎన్నుకుంటేనే ప్రజా సమస్యలపై చట్టసభల్లో పోరాడుతారు. మంచి పాలన అందాలంటే ప్రతినిధులు ఉత్తములై ఉండాలి. ‘నేనున్నా’ అనే భరోసా కలిగించేలా పనిచేసే వారినే ఎన్నుకోవాలి తప్ప ఆయా పార్టీల వారు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఓటు అమ్ముకుంటే ఇక ఐదేళ్ల పాటు ప్రజలకు సమస్యలు తప్పవు. ఆ తర్వాత ప్రశ్నించే అవకాశం కూడా ఉండదు.
డబ్బుంటేనే రంగంలోకి..?
ప్రస్తుతం ఎన్నికలను డబ్బులు శాసిస్తున్నాయి. ఎన్నికల పోరు మొదలు కాగానే డబ్బున్నోళ్లే రంగంలోకి దిగుతున్నారు. కార్యకర్తలు, ప్రజలకు మందు, విందు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. చివరకు ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. తీరా గెలిచాక ఇక ప్రజల గురించి పట్టించుకునే నాథులే ఉండరు. అందుకే ఎన్నికల్లో నోటుకు ఓటు వేయొద్దంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
అంతకంటే హీనమా..
ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను యాచకుడి కంటే హీనంగా లెక్కకడుతున్నారు. ఓ అభ్యర్థి ఓటుకు రూ.1000 ఇచ్చినా.. గెలిస్తే ఐదేళ్లు.. 1,825 రోజులు అధికారంలో ఉంటారు. అంటే రోజుకు 54 పైసల చొప్పున ఇస్తారు. ప్రస్తుత రోజుల్లో యాచకుడు సైతం రూ.1 ఇస్తే తీసుకోవడం లేదు. ఇక ఓటర్లను యాచకుడి కంటే హీనంగా అభ్యర్థులు చూస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళా ఓటర్లు 51శాతం..
ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓట్లు 21,83,235 ఉంటే అందులో 51 శాతం మంది మహిళలు ఉన్నారు. గెలుపోటములను శాసించే సత్తా వారికే ఉంది. ఓట్లు వచ్చాయంటే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తారు. మహిళా సంఘాలకు ఇంత మొత్తం అని బేరాలు చేస్తారు. ఇంకా చీరలు, ఇతర వస్తువులు పంచుతారు. ఆయా పార్టీలు ఇచ్చే కానుకలకు ఆశ పడకుండా మంచి వారిని ఎన్నుకుంటే ఆ తర్వాత మన జీవితాలు బాగుంటాయని గ్రహించాలి. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరల గురించి రాజకీయ నాయకులను నిలదీయాలి. జిల్లాలో ఒకే ఒక్క మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రశ్నించండి.
Comments
Please login to add a commentAdd a comment