గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా తదితరులు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు తెలంగాణ ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా వేడుకలు వచ్చాయి. దీంతో నిత్యం జనాల్లో ఉండే రాజకీయ నాయకులు ఈ సారి పండగలో తమ ప్రచారంతో సందడి చేస్తారనే భావన ఉండేది. కానీ చిత్రంగా ఈసారి దసరాలో రాజకీయ జోష్ తగ్గిపోయింది. ముఖ్యంగా బతుకమ్మ సందడిలో వారి ఊసే లేకుండా పోయింది. సద్దుల బతుకమ్మతో పండుగ ముగింపు దశకు చేరి నా ఎక్కడా రాజకీయ హడావిడి కనిపించడం లేదు.
ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు..
దసరా పండుగ వచ్చిందంటే వివిధ ప్రాంతాల్లో పని చేసే వారంతా సొంతూళ్లకు వస్తారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో బంధువులు, పిల్లాపాపలతో సందడి నెలకొంటుంది. ముఖ్యంగా ఈ తొమ్మిది రోజుల పాటు సాయంత్రం వేళల్లో ప్రతీ ఊరిలో, ప్రతీ గల్లీలో ఆడపడుచులు బతుకమ్మలు ఆడుతూ పండగకు మరింత శోభ తీసుకొస్తారు. యువకులు పూల సేకరణలో నిమగ్నమవుతారు. ఇలా కుటుంబమంతా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా తమ ఉనికి చాటుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం వారి జాడే కనిపించడం లేదు.
సందడి సందడిగా..
బతుకమ్మ పండగ అంటే ఆడపడుచుల ఆటపాటలే ముఖ్యం. కానీ రాజకీయ నేతలు ఈ పండుగకు తమదైన టచ్‌ను ఇవ్వడం మొదలెట్టారు. గల్లీ స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు తమ పరిధిలోని ప్రాంతాల్లో కొంతకాలంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళల పండుగైనా సరే.. అందులో వారు కూడా దూరిపోయి బతకుమ్మ పాటలు రాకపోయినా, నృత్యం తెలియకపోయినా తమదైన శైలిలో పాటలు పాడుతూ నాట్యా లు చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు తమ నాయకుడే ఆడి, పాడుతుంటే తామేందుకు వెనుకబడి పోవాలంటూ సదరు నేతల అనుచరులు సైతం బతుకుమ్మల్లో కాలు కదిపేవారు. ఆఖరికి బందోబస్తులో ఉన్న ఖాకీలు సైతం బతుకమ్మలో భాగమయ్యేవారు. కొన్నాళ్లుగా మహిళలను మించి పురుష రాజకీయ నేతలు బతుకమ్మ ఆటల్లో సందడి చేసిన ఘటనలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి.
విమర్శలు వచ్చినా తగ్గలే..
మహిళల పండుగలో రాజకీయ నాయకుల రంగప్రవేశంపై అనేక విమర్శలు వచ్చాయి. పండుగను రాజకీయం చేయడమేంటనే వాదనలు వినిపించా యి. పాదరక్షలతో ఆడటం, పండుగలో సినిమా పాటలు, డీజే సౌండ్స్ చేయడం పైనా అభ్యంతరా లు వెల్లువెత్తాయి. అయినా రాజకీయ నాయకులు వెనక్కు తగ్గలేదు. పైగా బతుకమ్మ అలంకరణపై ప్రత్యేకంగా పోటీలు నిర్వహించడం, విజేతలకు పట్టు చీరలు, వంటింటి సామగ్రి బహుమతులుగా ఇవ్వడం వంటి కార్యక్రమాలను తెరపైకి తెచ్చారు.
ఇప్పుడు సీన్ మారింది..
ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బతుకమ్మ వేడుకల్లో రాజకీయ నేతల హల్‌చల్ ఎక్కువగా ఉంటుందని అంతా భావించారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. అందరికంటే ముందుగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఎన్నికలకు రెండు నెలల ముందుగానే జాబితా రావడంతో ప్రచారం చేసుకునేందుకు అభ్యర్థులకు కావాల్సినంత సమయం లభించింది. మరోవైపు సదరు అభ్యర్థిపై అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈసారి బతుకమ్మలో ‘గులాబీ’ సందడి తగ్గిపోయింది.
టెన్షన్ టెన్షన్
కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ బతుకమ్మ జోష్ లేకుండా పోయింది. అభ్యర్థుల ఎంపికకు కమిటీలు, సమీక్షలతో ఆ పార్టీ వడపోతలు ముమ్మరం చేస్తోంది. దీంతో పార్టీ తరఫున పోటీ చేసే భాగ్యం తమకు దక్కుతుందో లేదో అనే టెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో నెలకొంది. టికెట్ కోసం హైదరాబాద్, ఢిల్లీలకు చక్కర్లు కొట్టడంలోనే ఎక్కువ మంది బిజీగా ఉన్నారు. టికెట్ దక్కించుకునేందుకు పైరవీల్లో మునిగి తేలుతూ బతుకమ్మ వైపు రావడం లేదు. ఈ వేడుకలపై రాజకీయ పార్టీల ప్రభావం తగ్గడంతో వాటికి అనుబంధంగా ఉండే ఉద్యోగ, కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు సైతం ఈసారి బతుకమ్మకు దూరంగా ఉండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment