
14 రోజులు చికిత్స పొంది మృతి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్‌ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు.
పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్‌ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment