సిట్టింగ్‌ చేజారకుండా.. | - | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ చేజారకుండా..

Published Sun, Apr 14 2024 1:00 AM | Last Updated on Sun, Apr 14 2024 1:37 PM

- - Sakshi

ఖమ్మం లోక్‌సభ స్థానంపై బీఆర్‌ఎస్‌ నజర్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సిట్టింగ్‌ స్థానమైన ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ సర్వశక్తులొడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి.. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేలా కేడర్‌కు నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ నామ నాగేశ్వరరావును ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌.. ఆయన గెలుపు బాధ్యతలను జిల్లా నాయకత్వానికి అప్పగించారు. దీంతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల నిర్వహణలో నిమగ్నమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీసారి నిరాశే
తెలంగాణ ఏర్పడ్డాక మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు నిరాశే ఎదురవుతోంది. 2014 ఎన్నికల్లో పది స్థానాలకు గాను కొత్తగూడెంలో జలగం వెంకట్రావు మాత్రమే గెలిచారు. 2018లో ఖమ్మం నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలవగా.. ఇటీవల ఎన్నికల్లో భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలిచినా ఆయన సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్‌ఎస్‌, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలో ఫలితాలు నిరాశపరిచినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో పార్టీపరంగా నష్టం జరగలేదు.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా
అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఓట్లు కొల్లగొట్టింది. 2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగడంతో రెండింటిలోనూ బీఆర్‌ఎస్‌ అపజయం మూటగట్టుకుంది. ఇక 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా, ఉమ్మడి జిల్లాలో ఒకే సీటుకు పరిమితమైంది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ బలం పుంజుకుంది. ఈసారి కూడా వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు.

ప్రస్తుతం భిన్న పరిస్థితులు..
గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో పరాజయం పాలైనా.. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ క్షణంలో ఎవరు బీఆర్‌ఎస్‌ను వీడతారో తెలియకుండా ఉంది. ఉమ్మడి జిల్లాలో భద్రాచలం నుంచి మాత్రమే బీఆర్‌ఎస్‌కు విజయం దక్కగా.. ఎమ్మెల్యేగా ఎన్నికై న వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరడంతో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. ఈ నేపథ్యాన నామ విజయం సాధించడాన్ని బీఆర్‌ఎస్‌ తప్పనిసరిగా భావిస్తోంది.

ఏకతాటిపైకి..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయం కోసం ఆ పార్టీ నేతలు ఏకమయ్యారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌తో మమేకమవుతున్నారు. అభ్యర్థి నామాతో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృతంగా పర్యటిస్తూ కేడర్‌లో స్థైర్యాన్ని నింపేలా సన్నాహక భేటీలను ఉపయోగించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఏకతాటిపైకి..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయం కోసం ఆ పార్టీ నేతలు ఏకమయ్యారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌తో మమేకమవుతున్నారు. అభ్యర్థి నామాతో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృతంగా పర్యటిస్తూ కేడర్‌లో స్థైర్యాన్ని నింపేలా సన్నాహక భేటీలను ఉపయోగించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement