ఈసారైనా.. నవమికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చేనా..? | - | Sakshi
Sakshi News home page

ఈసారైనా.. నవమికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చేనా..?

Published Tue, Mar 28 2023 12:37 PM | Last Updated on Wed, Mar 29 2023 12:38 PM

2016లో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు - Sakshi

2016లో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు

భద్రాచలం: ముఖ్యమంత్రి హోదాలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించక ఏడేళ్లు గడుస్తున్నాయి. తానీషా ప్రభువు కాలం నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుండగా, ప్రభుత్వం తరఫున భద్రాచలం రామయ్యకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సీఎం కేసీఆర్‌ ఈసారైనా సమర్పిస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాగా కల్యాణం మరుసటి రోజు నిర్వహించే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ పర్యటన ఇప్పటికే ఖరారైంది. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సైతం వేడుకలకు వస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ పర్యటనపై సస్పెన్స్‌..
సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది ఇప్పటికే జిల్లాకు రెండుసార్లు వచ్చారు. గోదావరి వరద ముంపు బాధితుల పరామర్శకు ఒకసారి, కొద్ది రోజుల క్రితం నవభారత్‌ ఏరియాలో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభానికి మరోసారి వచ్చి వెళ్లారు. నవమి వేడుకలకు కూడా వస్తే జిల్లాకు ముచ్చటగా మూడుమార్లు వచ్చినట్లుగా ఉంటుంది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం వస్తారని, కల్యాణ వేడుకలకు హాజరవుతారని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల భారీగా ఆశలు పెట్టుకున్నారు. భద్రాచలం అభివృద్ధి, నవమికి సీఎం గైర్హాజరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్‌ రాకనే గట్టి సమాధానమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్‌ పర్యటనపై తీవ్ర సస్పెన్స్‌ నెలకొన్నది.

ఏడేళ్లుగాశ్రీరామనవమికి రాని సీఎం
తహసీల్దార్‌గా ఉన్న కంచర్ల గోపన్న భక్త రామదాసుగా మారి గుడిని నిర్మించటం, ఆ తర్వాత ప్రభుత్వ నిధులను వ్యయం చేసినందుకు తానీషా ప్రభువు ఆయన్ను జైల్లో పెట్టించటం, మళ్లీ విడుదల చేయటం, అనంతరం మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి శ్రీరామనవమికి ప్రభుత్వం తరఫున తానీషా ప్రభువు పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించటం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో కేసీఆర్‌ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లను అందచేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు కేసీఆర్‌ గైర్హాజరవుతానే ఉన్నారు. 2017లో సీఎం మనుమడు పట్టువస్త్రాలను అందచేయగా, అనంతరం దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలను అందచేస్తూ వస్తున్నారు.

గవర్నర్‌ రాక..
భద్రాచలంలో 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై రాక ఇప్పటికే ఖరారైంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటనకు రాగా, వారితోపాటు గవర్నర్‌ కూడా వచ్చారు. గోదావరి వరదల సమయంలో వరద బాధితుల పరామర్శకు అశ్వాపురం మండలానికి వచ్చారు. మళ్లీ ఈ ఏడాది మూడోసారి పుష్కర పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు. హర్యాన రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు రానున్న దేవాదాయశాఖ మంత్రి..
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి బుధవారం ఉదయం భద్రాచలం చేరుకోనున్నారు. రంగనాయకుల గుట్టపై దాతల సహాయంతో నిర్మించిన సీతానిలయాన్ని ప్రారంభించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ మంగళవారం భద్రాచలం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు చినజీయర్‌ స్వామి రానున్నట్లు జీయర్‌ మఠం నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. కాగా కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఆధ్వర్యంలో సీఎం, గవర్నర్‌ పర్యటనకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement