నేను చేరే పార్టీనే అధికారంలోకి వస్తుంది.. | - | Sakshi
Sakshi News home page

నేను చేరే పార్టీనే అధికారంలోకి వస్తుంది..

Published Sun, Apr 30 2023 1:37 AM | Last Updated on Sun, Apr 30 2023 3:29 PM

- - Sakshi

ఖమ్మం: త్వరలో మేము చేరబోయే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఎవరినీ వదిలేది లేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పొంగులేటి శ్రీనన్న, కోరం కనకయ్యల క్యాంపు కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. అనంతరం విలేకరులతోనూ మాట్లాడారు.

తనను నమ్ముకున్న కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులు పెడుతున్నవారికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అరాచకాలకు భయపడేది లేదని, గుండా రాజ్యాన్ని నడవనీయబోమని, అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తుగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఐదారు నెలల్లో తమ సత్తా ఏమిటో తెలుస్తుందని చెప్పారు. మీ పార్టీలో లేమని చెప్పి సెక్యూరిటీ తగ్గించారని, తనకు, తన అనచరులకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్‌, డీజీపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎస్పీలు బాధ్యత వహించాలని అన్నారు.

పరిహారం ఇవ్వకుండా జాప్యం..
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. పింక్‌ కలర్‌ కప్పుకున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్నే ఉద్దరించలేదని సీఎం పార్టీ పేరు మార్చి దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. తొలుత నాయకులు, ప్రజాప్రతినిధులు పొంగులేటికి ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. అనంతరం మండలంలోని టేకులపల్లి, శాంతినగర్‌, చుక్కాలబోడు, కుంటల్ల, రామచంద్రునిపేట, బోడు, బోడుకొత్తగూడెం, కొప్పురాయి, ఒడ్డుగూడెం, బర్లగూడెం, జంగాలపల్లి తదితర గ్రామాల్లో పొంగులేటి పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఆర్థికసాయం అందించారు. పలు శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. టేకులపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్‌, తెల్లం వెంకట్రావు, ఝాన్సీ, పూనెం సురేందర్‌, పూనెం ఉమ, నిరోషా, సరోజిని, మంగీలాల్‌, మల్లిబాబు, చందర్‌సింగ్‌, ప్రసాద్‌, పోశాలు, భద్రు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement