మళ్లీ తెరపైకి కొత్త జిల్లా | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి కొత్త జిల్లా

Published Tue, Oct 3 2023 12:10 AM | Last Updated on Tue, Oct 3 2023 9:56 AM

- - Sakshi

భద్రాద్రి: రాష్ట్రంలోని మరెక్కడా లేనంతగా ఆయిల్‌పామ్‌ తోటలు.. రెండు పామాయిల్‌ ఫ్యాక్టరీలు.. కొబ్బరి తదితర ఉద్యాన పంటలు.. వందల ఎకరాల్లో మామిడి నర్సరీలు.. అపారమైన బొగ్గు నిక్షేపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో ఒకే నియోజకవర్గంగా ఉన్న ఇవి పునర్విభజన అనంతరం రెండుగా విడిపోయాయి.

అశ్వారావుపేట నుంచి కొత్తగూడేనికి, సత్తుపల్లి నుంచి ఖమ్మంకు రావాలంటే దూరాభారమని ప్రజలు భావిస్తారు. ఈ నేపథ్యాన రెండు నియోజకవర్గాలను కలుపుతూ సత్తుపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ ఏళ్లుగా ఉంది. కానీ ప్రభుత్వం 33 జిల్లాల ఏర్పాటు తర్వాత మళ్లీ ఊసెత్తకపోవడంతో అంతా సద్దుమణిగింది. అయితే, ఇటీవల సత్తుపల్లి సభకు వచ్చిన మంత్రి కేటీఆర్‌.. వెంకటవీరయ్యను 60వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే జిల్లా డిమాండ్‌ను నెరవేర్చుకునేలా సీఎం కేసీఆర్‌ మనసు గెలుచుకోవచ్చని చెప్పడంతో మళ్లీ సత్తుపల్లి జిల్లా అంశం తెరపైకి వచ్చింది.

గత ఉద్యమంలో కీలకంగా ‘సండ్ర’
రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల సత్తుపల్లి పర్యటనలో ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్యను 60 వేల నుంచి 70వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే సత్తుపల్లి జిల్లా అంశాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని చెప్పడంతో చర్చ మొదలైంది. గతంలో జిల్లా సాధనకు ఉవ్వెత్తున ఉద్యమం సాగగా.. అందులో కీలకంగా పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటవీరయ్య ఇప్పుడు మంత్రి కేటీఆర్‌తో ప్రకటన చేయించడం విశేషం. కాగా, కాంగ్రెస్‌ నేతలు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌, కొండూరు సుధాకర్‌, కోటూరి మానవతారాయ్‌ తదితరులు సైతం జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా తాజాగా సత్తుపల్లికి చెందిన న్యాయవాదులు జిల్లా ఏర్పాటుకు డిమాండ్‌ చేయటం.. ఇటీవల పర్యటనలో కేటీఆర్‌ ప్రస్తావించడంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ములుగు జిల్లా చేయడంతో..
జిల్లాల పునర్విభజన సమయాన సత్తుపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం చేపట్టారు. అయితే, 32 జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రక్రియ ముగిసిందని, మళ్లీ ఎక్కడైనా జిల్లా ఏర్పాటు చేస్తే సత్తుపల్లి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని జిల్లా పునర్విభజన కమిటీ అప్పట్లో హామీ ఇచ్చింది. ఇక, అప్పటి అధికార పార్టీ నేతలు సత్తుపల్లి జిల్లా ప్రాధాన్యత, స్థానికుల డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌కు వివరించడంలో వెనుకబడడంతో ఫలితం దక్కలేదు. కానీ 2018 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ ములుగు సభలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే ములుగు జిల్లా చేస్తామని హామీ ఇవ్వగా, సత్తుపల్లి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు కేసీఆర్‌ దృష్టికి జిల్లా అంశాన్ని తీసుకురావాలని యత్నించినా సాధ్యం కాలేదు. దీంతో సీఎం ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ములుగుతో పాటు నారాయణపేటను కూడా జిల్లాలుగా చేసినప్పటికీ సత్తుపల్లి జిల్లాను సాధించడంలో నేతలు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.

129 రోజుల పాటు దీక్షలు
సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి సత్తుపల్లి జిల్లా చేయాలని రాజకీయ జేఏసీ ఆధ్వర్యాన 2016 అక్టోబర్‌ 29 నుంచి 129 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. రెండుసార్లు సత్తుపల్లి బంద్‌ కూడా చేపట్టగా వంటావార్పు, రాస్తారోకో తదితర ఆందోళనలు జరిగాయి. అలాగే, 175 గ్రామపంచాయతీల్లో తీర్మానాలు కూడా చేశారు. రెండు నియోజకవర్గాల్లోని పది మండలాలను కలిపి సత్తుపల్లి కేంద్రంగా జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఉధృతంగా ఆందోళనలు చేపట్టారు. రెండు నియోజకవర్గాల్లోని పది మండలాలను విడదీసి గంగారం, లంకపల్లి, మొద్దులగూడెం, చెన్నూరు, కుర్నవల్లి, పట్వారిగూడెం, వినాయకపురం కేంద్రాలుగా కొత్త మండలాలు ఏర్పాటుచేసి 17 మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

విస్తీర్ణం 5.47 లక్షల చదరపు మీటర్ల పైచిలుకు ఉండడం, అశ్వారావుపేట నుంచి కొత్తగూడెంకు.. సత్తుపల్లి నుంచి ఖమ్మంకు వెళ్లాలంటే 80 కి.మీ. నుంచి 120 కి.మీ. ఉండడంతో దూరాభారం తగ్గడానికి జిల్లా ఏర్పాటే మార్గమని ప్రతిపాదించారు. కాగా, జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్రను తల్లాడలో అడ్డుకుని నమోదు చేసిన కేసును గత నెల 13న జిల్లా కోర్టు కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement