సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోకవర్గానికి చోటు దక్కింది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పినపాక నుంచి పోటీ చేసేందుకు మొత్తం 17 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి పేర్లను వడబోసి, వివిధ రాజకీయ సమీకరణాలను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు చివరకు పాయం వైపు మొగ్గు చూపారు.
దీంతో టికెట్ కోసం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించిన పోలెబోయిన శ్రీవాణి, విజయ్‌గాంధీలకు చివరకు నిరాశే మిగిలింది. పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొన్నేళ్లుగా పాయం రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. పొంగులేటితో పాటుగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మలిజాబితాలో పాయంతోపాటు పాలేరు టికెట్‌ను పొంగులేటికి కేటాయించారు.
పేట కోసం ముగ్గురి ప్రయత్నం..
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉండగా ఇప్పటికే 100 చోట్ల అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో జిల్లాకు సంబంధించి ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాలు ఉన్నాయి. ఇల్లెందు, అశ్వారావుపేటలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
అశ్వారావుపేట నుంచి పది మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు జారె ఆదినారాయణ, సున్నం నాగమణిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో జాబితాలోనూ ఈ నియోజకవర్గానికి చోటు దక్కకపోవడంతో ఇక్కడి నేతలు లాబీయింగ్‌ను మరింత పదునెక్కించనున్నారు.
ఇల్లెందుపై ఉత్కంఠ..
ఇల్లెందు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య కాంగ్రెస్ సీటును ఆశిస్తున్నారు. కాగా ఇక్కడ బంజారాలకు అవకాశం ఇవ్వాలంటూ మరోవర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇల్లెందు సీటు ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తాజాగా ఇల్లెందును పెండింగ్‌లో పెట్టడంతో ఇక్కడ హస్తం పార్టీలో రాజకీయం మరింత ముదురు పాకన పడుతోంది. ఇల్లెందు టికెట్ కోసం చీమల వెంకటేశ్వర్లు, ప్రవీణ్ నాయక్, శంకర్‌నాయక్, గుగులోత్ రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల పొత్తు కారణంగా కమ్యూనిస్టులకు కొత్తగూడెం సీటు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment