సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో సందడి నెలకొంది. పార్టీలోకి కొత్త నేతల చేరికలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మంలోని ఆయన నివాసంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఇరువురు నేతలు కొద్ది సేపు రాష్ట్ర రాజకీయాలపై ముచ్చటించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఇటీవల తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలవగా ఇప్పుడు పొంగులేటి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే కానుంది.
బీఆర్‌ఎస్ టు కాంగ్రెస్
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. సత్తుపల్లి నుంచి తుమ్మల రాజకీయ అరంగేట్రం చేశారు. పొంగులేటి ఇదే నియోజవకర్గంలోని తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇద్దరూ రాజకీయాల పరంగా చూస్తే ఎత్తుపల్లాలు చవిచూశారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు సీఎంలుగా ఉన్నప్పుడు తుమ్మల పార్టీ పరంగా ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించారు. బీఆర్‌ఎస్‌లో చేరాక కూడా ఇదే స్థాయిలో వ్యవహరించారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన ఆధిపత్యానికి గండి పడుతూ వచ్చింది.
ఒకప్పుడు అనుచరులకు టికెట్లు ఇప్పించిన ఆయనకు ఈసారి బీఆర్‌ఎస్ మొండి చేయి చూపించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలవడంతో తుమ్మల పయనం హస్తం గూటికేనని తేలింది. ఇక వైఎస్సార్‌సీపీ నుంచి పొంగులేటి రాజకీయ ప్రస్థానం మొదలు కాగా.. బీఆర్‌ఎస్‌లో చేరాక అనుచరులను అంటిపెట్టుకుని ఉన్న ఆయనకు గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. అనంతర పరిణామాలతో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరి ఇప్పటికే కీలక పదవిలో ఉండగా... తుమ్మల కూడా చేరితే తగిన గౌరవం దక్కుతుందనే అభిప్రాయం ముఖ్య అనుచరుల్లో వ్యక్తమవుతోంది.
పాలేరు, ఖమ్మంపై ఫోకస్
మారుతున్న రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పాలేరు నుంచే బరిలోకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే, శ్రీనివాసరెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ఎవరికి టికెట్ ఖాయమవుతుందనే అంశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని జనరల్ స్థానాలైన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో అధికార పార్టీకి దీటుగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది.
ఈనేపథ్యాన శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావుల్లో పాలేరులో ఒకరిని, ఖమ్మంలో మరొకరిని పోటీకి దింపాలని భావనతో ఎవరికి ఏ స్థానం కేటాయిస్తే సమీకరణలు ఎలా ఉంటాయనే అంశంపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరోపక్క పాలేరు నుంచి ఆ పార్టీ నేతలు రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్ల శ్రీరాంయాదవ్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, కొత్తగూడెం టికెట్ కోసం కూడా దరఖాస్తులు అందిన నేపథ్యాన వీరి బలాబలాలను గుర్తించేందుకు పార్టీ ఇప్పటికే చేయించిన సర్వే నివేదికలతో అంచనా వేస్తోంది.
హైదరాబాద్ లేదా ఢిల్లీ
పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులతో తుమ్మల చర్చలు జరుపుతున్నారు. అనుచర గణం, కేడర్ అభిప్రాయం మేరకు పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయనను శనివారం కూడా పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కలిశారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే సమాచారంతో హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో తుమ్మల చేరిక ఉండొచ్చన్నది సమాచారం. ఇక ఉమ్మడి ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న తన సామాజికవర్గ నేతలు కొందరితోనూ ఆయన పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ సభలో కుదరదని భావిస్తే అంతకన్నా ముందే ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతల సమక్షానలో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
చేరికలతో మళ్లీ రేసులోకి...
సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరాక పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కానీ తాజా పరిణామాలు ఆ పార్టీని వచ్చే ఎన్నికల రేసులో నిలబెట్టాయనే విశ్లేషణ మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటితోపాటు పలు నియోజకవర్గాల్లోని ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇక తుమ్మల సైతం హస్తం గూటికి చేరనుండడంతో ఉమ్మడి జిల్లాలోని ఆయన అనుచరులు అదే దారిలో నడుస్తారు. తద్వారా మొన్నటి వరకు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్‌లోని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు బలాన్ని ఇచ్చినట్లవుతుందనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment