
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఎన్నికల అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ నెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఏపీఓలకు శనివారం కలెక్టరేట్‌లో రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ముందురోజే చేరుకుని ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ సామగ్రిని పరిశీలించుకోవాలని అన్నారు. 26న ఉదయం కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సామగ్రి అందజేస్తామని అన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్లు దారా ప్రసాద్, రంగాప్రసాద్, జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనీ పూసపాటి సాయికృష్ణ, కిరణ్‌కుమార్, అశోక్, నవీన్ పాల్గొన్నారు.
రంజాన్ మాసంలో ఇబ్బందులు రావొద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): మార్చి రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రార్థనా సమయాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలలన్నారు. వేసవిలో ఎండ ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలోని మసీదులు, మతపెద్దల వివరాలను అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు, డీపీఓ చంద్రమౌళి, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment