
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తెల్లవారుజామునే గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశాక స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
బంగారు గాజులు బహూకరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం రామాలయానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన భక్తులు డి.మహీందర్‌రెడ్డి – మంజుల దంపతులు సుమారు రూ.3.70 లక్షల విలువైన నాలుగు బంగారు గాజులను శనివారం బహూకరించారు. ఈ సందర్భంగా వారు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను దాత కుటుంబానికి అందజేశారు.
క్రీడల్లో రాణించాలి
కొత్తగూడెంటౌన్: క్రీడా పోటీల్లో రాణించాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి పి.పరంధామరెడ్డి సూచించారు. కొత్తగూడెం త్రీఇంక్లైన్‌లోని తెలంగాణ క్రీడా మైదానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించాలని చెప్పారు. పోటీల్లో 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, విజేతలకు టీపీసీసీ సభ్యుడు, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగ సీతారాములు, తూము చౌదరి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు పెద్దన్నబా బు, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు యుగేందర్‌రెడ్డి, కాశీహుస్సేన్, పి. నిహారిక, ఐ. ఆది నారాయణ, ఆంగోతి మోతి, బోడ శారద, వెంకటప్రసాద్, బి.తరుణ్, టీ.మానస, మోతిలాల్, రవి, రజిని, రాకేష్, మానస పాల్గొన్నారు.
విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వరకు నడిచే ప్యాసింజర్ రైలు శనివారం నుంచి ప్రారంభమైంది. కాజీపేట–విజయవాడ రైలు మార్గంలో మూడో లైన్ పనులు జరుగుతున్న కారణంగా ఈ రైలును కొన్ని రోజులపాటు రద్దు చేశారు. రైల్వే అధికారులు తిరిగి ప్రారంభించడంతో భద్రాలచం రోడ్డు నుంచి విజయవాడ వరకు వివిధ అవసరాల నిమిత్తం, దైవ దర్శనానికి వెళ్లే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెల్గావి రైలును కూడా ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
Comments
Please login to add a commentAdd a comment