
కొందరికే భరోసా..!
● గందరగోళంగా పెట్టుబడిసాయం అందజేత ● మూడెకరాలున్న రైతులకూ జమకాని నగదు ● రైతు భరోసాపై స్పష్టతనివ్వని వ్యవసాయాధికారులు
80 సెంట్ల భూమి ఉన్నా రాలె..
నాకు 80 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. అయినా రైతు భరోసా అందలేదు. బ్యాంకుల దగ్గరకు వెళితే నగదు జమకాలేదన్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే జమవుతాయని చెబుతున్నారు. ఏమీ అర్థం కావట్లే. –జంగిలి వెంకన్న, రైతు, గొమ్మూరు
భరోసా అందించాలి
గత ప్రభత్వం లాగా పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా అందించాలి. వ్యవసాయశాఖ అధికా రులకు రైతు భరోసా చెల్లింపులకు సంబంధించిన సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలి.
–గోపిరెడ్డి రమణారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు
అందరికీ అందుతుంది
సాగు భూములన్నింటికీ రైతు భరోసా అందుతుంది. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు 96వేల మంది రైతుల ఖాతాల్లో నగదు జమైంది. అందనివారు బ్యాంకు ఖాతాలను సరిచూసుకోవాలి.
–బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
బూర్గంపాడు: రైతు భరోసా గందరగోళంగా మారింది. మూడెకరాల లోపు సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమచేశామని ప్రభుత్వం చెబుతుండగా.. తమకు రైతు భరోసా అందలేదని మూడెకరాల లోపు భూమి ఉన్న పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఎకరంలోపు ఉన్నవారికీ అందలేదని పలువురు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే జమవుతుందని దాటవేస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడంలేదు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు పెట్టుబడుల కోసం జనవరి 26 నుంచి రైతు భరోసా నగదు జమ ప్రారంభించింది. గతంలో ఎకరాకు రూ. 5 వేలు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం రూ. 6 వేలకు పెంచింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం అందలేదు. యాసంగి పంటల సాగుకు రైతు భరోసా అందిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలుత మండలానికో గ్రామంలో పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసింది. ఆ తర్వాత మిగతా గ్రామాల్లో విడతల వారీగా ఎకరంలోపు రైతులకు, అనంతరం రెండెకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎకరం, రెండెకరాలు, మూడు ఎకరాల సాగు భూములు ఉన్న కొందరు రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా అందలేదు. నగదు సాయం అందనివారు బ్యాంకులు చుట్టూ, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వెనుకాముందో అందరికీ వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారుకానీ స్పష్టమైన సమాధానం చెప్పడంలేదు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు జమైంది..కానిది మండల వ్యవసాయశాఖ అధికారులు రైతులకు వివరించారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ ఆప్షన్‌లో చెక్ చేసి నగదు ట్రెజరీలో ఉందా, సెండ్ టు బ్యాంకు చూపిస్తుందా? బ్యాంకు ఖాతా తప్పుగా ఉందా? అని స్పష్టంగా చెప్పారు. తప్పు, ఒప్పులుంటే సరిచేసి రైతుబంధు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రైతు భరోసా జమకాని రైతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం సెర్చ్ ఆప్షన్ తొలగించినట్లు తెలుస్తోంది.
93,670 మంది రైతులకు జమ..
ఇప్పటివరకు జిల్లాలో 93,670 మంది రైతులకు రూ.100.29 కోట్ల రైతు భరోసా వారి ఖాతాల్లో జమైంది. వీరందరూ మూడు ఎకరాలలోపు సాగు భూమి ఉన్న రైతులే. వీరుకాక మూడు ఎకరాలలోపు సాగు భూమి ఉన్న మరో 20 వేల మందికి రైతుభరోసా అందలేదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా, జమైన వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులకు సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలని, రైతు భరోసా స్టేటస్‌ను తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

కొందరికే భరోసా..!

కొందరికే భరోసా..!

కొందరికే భరోసా..!
Comments
Please login to add a commentAdd a comment