సుజాతనగర్: తెలంగాణ ఏర్పడ్డాక ఎవరు గెలుస్తారోనని దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆసక్తి కనబరిచారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుండడం.. కొన్నిచోట్ల ఇతర పార్టీల అభ్యర్థులు కూడా దీటైన పోటీ ఇస్తుండడంతో ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడి తమ బంధువులు, స్నేహితులకు తరచుగా ఫోన్ చేస్తున్నారు. అభ్యర్థి ఎవరు, ప్రచారం ఎలా జరుగుతోంది, బలాబలాలు ఎలా ఉన్నాయి.. విజయం ఎవరి వైపు ఉందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా సుజాతనగర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇతర దేశాల్లో స్థిరపడిన పలువురితో మాట్లాడగా వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
ఎవరు గెలుస్తారోనని ఆసక్తి
సుజాతనగర్‌కు చెందిన చెందిన నేను వర్జీనియాలో ఉంటున్నా. పుట్టి, పెరిగిన ప్రాంతం కావడంతో ప్రతీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఆసక్తి ఉంటుంది. అందుకే మీడియాను ఫాలో అవుతూనే స్నేహితులకు తరచూ ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నా.
– మల్లెల అనూష, వర్జీనియా
ప్రతీ ఎన్నికనూ పరిశీలిస్తాం
సుజాతనగర్‌కు చెందిన నేను ప్రతీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల శైలిని నిశితంగా పరిశీలిస్తా. అమ్మానాన్నల ద్వారా ఎవరు గెలుస్తారు, ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటందనేది తెలుసుకుంటా. విజయావకాశాలు ఎటు ఉన్నాయో స్నేహితులతో చర్చిస్తా.
–పోటు ఫణిభూషణ్, అమెరికా
ఎన్నికలపైనే చర్చ
ఈసారి ఎన్నికలపై అంతటా ఆసక్తి ఉంది. ప్రధానంగా మూడు పార్టీలు విజయం కోసం పోటీ పడుతుండటంతో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైనే మా దగ్గర కూడా చర్చ జరుగుతోంది. కొత్తగూడెంలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.
–నర్రా సాయికిరణ్, ఆస్ట్రేలియా
ఓటుహక్కు వినియోగించుకోవాలి
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి. తెలంగాణలో ఎన్నికల సంబంధించిన అంశాలను ప్రతిరోజూ టీవీ ద్వారా తెలుసుకుంటున్నా. కొత్తగూడెంలో ఏ పార్టీ గెలుస్తుంది, ప్రచారం ఎలా జరుగుతుందో కుటుంబీకులద్వారా తెలుసుకుంటున్నా.
–చింతలపూడి కార్తీక్, కెనడా
Comments
Please login to add a commentAdd a comment