విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
సుజాతనగర్/జూలూరుపాడు: విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి అన్నారు. సుజాతనగర్ మండలం వేపలగడ్డ, జూలూరుపాడు మండలం పడమటనర్సాపురంలోని హాస్టళ్లు, పాఠశాలలను శనివారం ఆమె సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతోందా అని ఆరా తీశారు. హాస్టల్, పాఠశాల ఆవరణల్లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాథమిక హక్కులైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య వంటివి సరిగా అందేలా చూడాలని సూచించారు. కాలం ఎంతో విలువైనదని, విద్యార్థులు పట్టుదల, సమయస్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ఆత్మస్థైర్యం అందరిలోనూ ఉంటుందన్నారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది మెండు రాజమల్లు, ప్రిన్సిపాల్ బ్యూలారాణి, ఏజీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సుభద్ర, పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ వార్డెన్ తార తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి భానుమతి
Comments
Please login to add a commentAdd a comment