తొలిరోజు ‘గేట్’ ప్రశాంతం
సుజాతనగర్ : స్థానిక అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో ఐఐటీ రూర్కీ ఆధ్వర్వంలో తొలిరోజు శనివారం జరిగిన గేట్–2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన మొదటి సెషన్‌లో 98 మందికి గాను 92 మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన రెండో సెషన్‌లో 109 మందికి గాను 98 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు సెషన్లలో కలిపి 17 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
క్షయ రహిత జిల్లాగా మార్చాలి
● డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్
భద్రాచలంఅర్బన్ : భద్రాద్రిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్‌నాయక్ అన్నారు. దేశంలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ముమ్మర కృషి కార్యక్రమం ’నిక్షయ్ శివర్‘ లో భాగంగా శనివారం భద్రాచలంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సి న చర్యల గురించి వివరించారు. సమావేశంలో క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో
కేంద్ర బృందం పరిశీలన
ఇల్లెందురూరల్ : మండలంలోని రొంపేడు, కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాపులేషన్ రీసర్చ్ సెంటర్‌కు చెందిన కేంద్ర బృందం సభ్యులు శనివారం సందర్శించారు. పీహెచ్‌సీల్లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, రోజువారీ ఓపీ, ఇన్‌పేషెంట్ల వివరాలు, ఆస్పత్రుల పరిస్థితులు, అందుబాటులో ఉన్న సామగ్రి, మందులు, సిబ్బంది వంటి వివరాలపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో సాధారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయని అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన సౌకర్యాలు, వసతులపై వైద్యుల నుంచి నివేదికలు తీసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ కవిత, డాక్టర్ లోహిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు
పటిష్ట ఏర్పాట్లు
కొత్తగూడెంఅర్బన్: శాసనమండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,949 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు 1,038 మంది, మహిళలు 911 మంది ఉన్నారని వివరించారు. ఎన్నికల కమిషన్ తుది జాబితా అనంతరం ఉపాధ్యాయ ఓటరు నమోదు దరఖాస్తులు 108 ఉన్నాయని, అందులో 47 ఆమోదించగా, 27 తిరస్కరణకు గురయ్యాయని, మరో 34 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని పరిశీలించి సకాలంలో పంపిస్తామని చెప్పారు. వీసీలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు, సీపీఓ సంజీవరావు, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment