వేతనజీవులకు ఊరట..
మారిన శ్లాబుతో..
గతంలో వార్షిక వేతనం రూ.5 లక్షలు దాటితే 20 శాతం వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి వచ్చేది. సింగరేణిలో ఒక కార్మికుడు ఉద్యోగంలో చేరినప్పు డు ప్రారంభ వేతనం సగటున రూ.40 వేల వరకు ఉంటుంది. 10 నుంచి 14 ఏళ్ల సర్వీసు పూర్తయ్యే సరికి వార్షిక వేతనం రూ.5 లక్షలు దాటి ఆదా యపు పన్ను పరిధిలోకి వెళ్లేవారు. సంస్థలో పని చేసే ఉద్యోగులు, కార్మికుల్లో సుమారు 60 శాతం మంది ఐటీ చెల్లించేవారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను నుంచి రాయితీ పొందేందుకు హోం లోన్, ఆరోగ్య బీమా వంటివి చేయిస్తుంటారు. అయితే సింగరేణిలో కార్మికులకు క్వార్టర్లు, ఆస్పత్రి సౌకర్యం, రిఫరల్ కార్పొరేట్ హాస్పిటల్ ఫెసిలిటీ ఉండడంతో హోంలోన్లు, ఇన్సూరెన్స్ చేయించేవారు సాధారణంగా తక్కువగా ఉంటారు. దీంతో వారికి ఆదాయపు పన్ను అంశం ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది.
వేల మందికి మేలు..
ప్రస్తుతం ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్‌ను రూ.12 లక్షల వరకు పెంచడంతో అనేక మంది కార్మికులు, ఉద్యోగులకు ఐటీ నుంచి మినహాయింపు లభించనుంది. లేదంటే గతంతో పోల్చితే తక్కువ పన్ను పడనుంది. జిల్లాలో ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, కార్పొరేట్ ఏరియాల్లో కలిసి 6,800 మంది వరకు సింగరేణి కార్మికులు ఉన్నారు. గతంలో ఐదు వేల మందికి పైగా కార్మికులు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు. కానీ ప్రస్తుతం మారిన శ్లాబ్‌తో 2,500 మంది వరకు మాత్రమే ఐటీ చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇతర ఉద్యోగులకూ ఉపశమనం
జిల్లాలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 7,350 మంది ఉండగా ఇందులో సీనియర్లు అంతా ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారే. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌తో వీరిలో చాలా మందికి ఐటీ నుంచి ఊరట లభించనుంది. అలాగే చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసే వారు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.
టూరిజంపై ‘ముద్ర’..
ఎకో, టెంపుల్ టూరిజంలో జిల్లాకు అపార అవకాశాలున్నాయి. ఇప్పటికే భద్రాచలం పట్టణానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలో పర్యాటకులు బస చేసేందుకు హోటళ్లు, లాడ్జీలే ప్రధాన దిక్కుగా ఉన్నాయి. ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఇక్కడ హోం స్టే విధానం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే తమ ఇంటిని హోం స్టేగా మార్చేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తులకు ముద్ర లోన్లు అందజేస్తామని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ముద్ర రుణాలు తీసుకుని తమ ఇంటిలోనే యాత్రీకులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో వసతి సౌకర్యం మెరుగై ఆ మేరకు పర్యాటక రంగం పుంజుకునే అవకాశం ఉంటుంది.
కార్మికులకు మేలు
కేంద్ర బడ్జెట్‌తో రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి ఐటీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో సింగరేణి కార్మికులకు మేలు జరుగుతుంది. అయితే కొత్త గనులు, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం నిధులు కేటాయించకపోవడం బాధాకరం. తెలంగాణలోని అతి పెద్ద మైనింగ్ కాలేజీలో పాత కాలపు సాంకేతిక కోర్సులే ఉన్నాయి. వాటిని అప్‌గ్రేడ్ చేసేలా మైనింగ్ యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది.
– ఎండీ రజాక్, ఐఎన్‌టీయూసీ
కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు
సంపన్నులకే లబ్ధి
కొత్తగూడెంలో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయ నిర్మాణానికి, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసింది. వ్యవసాయ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలను పూర్తిగా విస్మరించారు. నిరుద్యోగులకూ నిరాశే ఎదురైంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించే నిధుల్లో కోత విధించడం దారుణం. ఇది సంపన్నులు, కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాసే బడ్జెట్ మాత్రమే.
– ఎస్‌కే సాబిర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి
ఉసూరుమనిపించారు..
కేంద్ర బడ్జెట్‌తో దేశ ప్రజలను అంకెల గారడీతో మాయ చేశారు. ఆశల పల్లకీలో ఊరేగించి చివరకు ఉసూరుమనిపించారు. బడ్జెట్ పెంచినప్పటికీ రూ.లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే చూపడం దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనం. పేదరికం నుంచి 25 కోట్ల మందిని బయట తీసుకొస్తే ఆకలి సూచికలో ప్రపంచంలో 102వ స్థానం నుండి 107వ స్థానానికి దేశం ఎలా వెళ్లిందో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పాలి.
– నాగా సీతారాములు, టీపీసీసీ సభ్యుడు
విద్యా రంగానికి నిధుల్లో కోత
కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 10 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా 2.53 శాతం మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు రాబట్టంలో పూర్తిగా విఫలమయ్యారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల ప్రస్తావన లేదు. గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్‌లో నిధులు శూన్యం. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు.
– యెర్రా కామేష్,
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సింగరేణి కార్మికులకు
కలిసొచ్చిన కేంద్ర బడ్జెట్
బొమ్మల తయారీ రంగానికీ ఊతం
ముద్ర రుణాలతో పర్యాటకానికి
మెరుగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 – 26 బడ్జెట్ సింగరేణి ఉద్యోగులకు కలిసొచ్చింది. తమకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సింగరేణి కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే ఈ అంశంపై ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నుంచి హామీలే తప్ప అమలు జరగలేదు. కానీ తాజాగా మార్చిన ఇన్‌కం ట్యాక్స్ శ్లాబులతో సింగరేణి ఉద్యోగులు/కార్మికుల్లో చాలా మందికి ఆదాయపు పన్ను నుంచి ఊరట కలగనుంది.
మార్కెట్‌లోకి ‘భద్రాద్రి’ బ్రాండ్..
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విభాగంలో ఎస్సీ, ఎస్టీ, మహిళల్లో మొదటితరం ఔత్సాహికులకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ. దమ్మపేట మండలం పూసుగూడెం, చండ్రుగొండ మండలం బెండాలపాడుతో పాటు భద్రాచలంలో వెదురుతో చేసిన బొమ్మలు, అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ తయారీపై ఇటీవల దృష్టి సారించారు. ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన రుణాలు కూడా మంజూరైతే కొయ్య, వెదురు బొమ్మల తయారీలో ‘భద్రాద్రి’ బ్రాండ్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment