
రామదాసుకు స్వరాంజలి..
భద్రాచలం: ‘తక్కువేమి మనకు.. రాముండొక్కడుండు వరకు.. అదిగో భద్రాద్రి.. గౌతమి ఇదిగో చూడండి.. పలుకే బంగారమాయెనా.. కోదండ పాణి’ అంటూ భక్త రామదాసు కీర్తనల స్వరార్చనలతో భద్రగిరి పులకించిపోయింది. వివిధ రాష్ట్రాలు, పట్టణాల నుంచి వచ్చిన పలువురు సంగీత కళాకారులు భక్తి పారవశ్యంతో రామయ్యతో పాటు రామదాసుకు స్వరాంజలి సమర్పించారు. దీంతో భద్రాచలంలో సంగీత, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరాముడి పరమ భక్తాగ్రేసరుడు, వాగ్గేయకారుడు, భద్రాచలం రామాలయ నిర్మాత రామదాసు 392వ జయంతి ఉత్సవాలు శనివారం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. రామాలయం, చక్ర సిమెంట్స్ వారి నేండ్రగంటి అలివేలుమంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి రోజు సంగీత మధురిమలు వీనులవిందుగా సాగాయి.
నగర సంకీర్తనతో ప్రారంభం..
భక్త రామదాసు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రామదాసు ప్రతిమతో ఆలయ ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో నగర సంకీర్తన చేశారు. ఉత్తర ద్వారం వద్ద గల రామదాసు విగ్రహానికి పూలమాలలు వేశారు. భద్రగిరి ప్రదక్షిణ అనంతరం పవిత్ర గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని రామదాసు విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి, పట్టు వస్త్రాలు అలంకరించారు. నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా తీసుకొచ్చి చిత్రకూట మండపంలో కొలువుదీర్చారు.
సంగీత కళాకారుల స్వరార్చన..
హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు ‘నవరత్న ఘోష్టి’తో స్వర నీరాజనం ప్రారంభించారు. అనంతరం ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మల్లాది సోదరులు, పలువురు గాయనీ గాయకులు ఆలపించిన కీర్తనలు, భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ఆలయ ఏఈఓలు శ్రవణ్‌కుమార్, భవానీ రామకృష్ణ, ప్రధానార్చకులు పొడిచేటి విజయరాఘవన్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు.
వైభవంగా ప్రారంభమైన జయంత్యుత్సవాలు

రామదాసుకు స్వరాంజలి..
Comments
Please login to add a commentAdd a comment