
బీఎస్‌ఎన్‌ఎల్.. ఏది సిగ్నల్..?
● దురదపాడులో నెలరోజులుగా పని చేయని వైనం ● టవర్ వద్ద గిరిజనుల నిరసన
అశ్వారావుపేటరూరల్: అటవీ ప్రాంతాల్లోని గిరిజన పల్లెలకు సెల్‌ఫోన్ సేవలు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మవోయిస్టు ప్రభావిత నిధులతో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు నిరూపయోగంగా మారాయి. దీంతో స్థానికులు టవర్ వద్ద సెల్‌ఫోన్లతో నిరసన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దురదపాడు గిరిజన గ్రామంలో కొన్నేళ్ల కిందట మావోయిస్టు ప్రభావిత నిధులతో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో నెల రోజులుగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ రావడం లేదు. ఒకపక్క ప్రైవేట్ సెల్ కంపెనీలు పోటీలు పడి రోజురోజుకూ టెక్నాలజీ సాయంతో ఉత్తమ సేవలు అందిస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆదరణ తగ్గిపోతోందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కాగా, నెల రోజులుగా ఈ టవర్ పరిధిలో సిగ్నల్స్ అందకపోవడంతో ఫోన్, ఇంటర్నెట్ వినియోగదారులంతా అవస్థ పడుతున్నారు. టవర్ ఉండటంతో స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లనే వాడుతున్నారు. సిగ్నల్స్ అందక గ్రామంలో ఉన్న టవర్ నిరుపయోగంగా మారందని వినియోగదారులు చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే (108 వాహనం, ఫైర్, డయల్ 100) సమాచారం ఇచ్చేందుకు దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు చెప్పేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డీఈ హర్షవర్దన్‌రెడ్డికి వివరణ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment