
ఈసారి మామిడి తింటామా?
చేతికొచ్చే పంట చేజారుతోంది..
● ఏటా వెంటాడుతున్న తెగుళ్ల బెడద ● మాడిపోతున్న పూత, రాలుతున్న పిందెలు ● మామిడి దిగుబడిపై రైతుల్లో ఆందోళన
ఇల్లెందురూరల్: వరుసగా ఆరేళ్లుగా దిగుబడి తగ్గి కుదేలైన మామిడి రైతుకు ఈ ఏడాది కూడా కాలం కలిసిరావడం లేదు. పూత, పిందె దశలో ఆశిస్తున్న చీడపీడలు రైతును కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ సారైనా కోలుకుందామనుకుంటే ఆలస్యంగా పూత రావడం, వచ్చిన పూతకు మస్సి పట్టేయడం, చిగురుగా మారడం, పిందెలు రాలిపోవడం.. వంటి కారణాలతో చేతికొచ్చే పంట చేజారుతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 53 వేల ఎకరాల్లో
మామిడి సాగు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి 53 వేల ఎకరాల్లో సాగవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 42 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట మండలా ల్లో, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, కామేపల్లి మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతోంది. ఆయా తోటల్లో అత్యధికంగా బంగినపల్లి, దశేరీ, కేసరి, హిమాయత్, రాయల్ స్పెషల్, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు ప్రధానంగా కనిపిస్తాయి.
పూత దశలోనే చీడపీడలు
ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు పూత వచ్చి జనవరిలో అక్కడక్కడా కాయలు కాయడం మామిడి లక్షణం. ఈ ఏడాది మంచు ప్రభావంతో కొంత ఆలస్యంగా పూత వచ్చింది. వచ్చిన పూతకు తేనె మంచు పురుగు, బూడిద తెగులు ఆశించింది. ఇంతేకాకుండా ఆకుల నుంచి రసం కారడం ప్రారంభమైంది. దీనికితోడు పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. మొదట ఒక చెట్టుకు సోకిన తెగులు మరునాడు దాని పక్కనే ఉన్న చెట్లకు ఇలా తోటంతా సోకిందని రైతులు చెబుతున్నారు. కొందరైతే అధికంగా తెగుళ్లు సోకిన కొమ్మలను తొలగిస్తూ ఉన్న కాస్త పంటనైనా దక్కిచుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితానివ్వలేదు. తెగుళ్ల ప్రభావంతో ప్రస్తుతం చెట్లపై పూత మాడిపోయి ఒట్టి కాడలే కనిపిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన పూత చిగురుగా మారి రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
వెంటాడుతున్న నష్టాలు
వరుసగా ఆరేళ్లు మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. 2020లో భారీ వర్షాల కారణంగా పూత, పిందె పూర్తిగా రాలిపోయింది. 2021, 22లలో కాత కొంత ఆశాజనకంగా ఉన్నా కరోనా ప్రభావంతో విక్రయాలు సన్నగిల్లి ధరపై తీవ్ర ప్రభావం చూపింది. 2023లో పూత, కాత సంతృప్తిగా ఉండటంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు కాయ పక్వానికి వచ్చే సమయంలో నల్లి రూపంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గతేడాది పూత సంతృప్తికరంగా ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. మంచు ప్రభావంతో పూత క్రమంగా చిగురుగా మారి దిగుబడిపై ప్రారంభంలోనే నీళ్లు చల్లింది. ఈ ఏడాది పూత దశ నుంచే చీడపీడలు ఆశించడం, పిందెలు రాలిపోవడంతో దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, కరోనా తదితర కారణాలతో వరుసగా ఆరేళ్లుగా మామిడి రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆందోళనలో కౌలుదారులు
మామిడి రైతులు అత్యధికంగా పూత దశలోనే తోటలను కౌలుకు ఇస్తుంటారు. తోటలను పరిశీలించిన కౌలుదారులు ధర నిర్ణయించి రైతులకు ముందస్తుగా కొంత, పంట చేతికందని తరువాత మిగతా సొమ్ము చెల్లిస్తారు. ఈ ఏడాది కూడా రూ.లక్షలు కౌలు చెల్లించి మామిడి తోటలు తీసుకున్న కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కౌలు డబ్బు, ఎరువుల పెట్టుబడి, పురుగు మందుల పిచికారీ వారికి మరింత భారమవుతోంది. తోటల్లో చీడపీడల ప్రభావం అధికంగా ఉండటంతో నాలుగైదు సార్లు పురుగు మందు పిచికారీ చేసినా ఫలితం కనిపించక ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడి భారమవుతోంది
ఈ ఏడాది పూత దశలోనే చెట్లను తెనె మంచు, బూడిద, మస్సిరోగం ఆశించాయి. మంచు ప్రభావంతో చాలా చెట్లకు ఆలస్యంగా వచ్చిన పూత క్రమంగా చిగురుగా మారింది. పూతను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు తోటల్లో చీడపీడల నివారణకు పెట్టిన పెట్టుబడి భారంగా మారింది.
– మంచె కృష్ణయ్య, మామిడి రైతు,
కొమరారం, ఇల్లెందు మండలం
వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి
ఆరేళ్లుగా మామిడి కలిసిరావడం లేదు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు.. ఏదో ఒక రూపంలో వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి. నివారణకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా పిందెలు రాలిపోవడం, చీడపీల ఉధృతి వంటి కారణాలు దిగుబడిపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
–తోకల జానయ్య, మామిడి రైతు,
కొమరారం, ఇల్లెందు మండలం

ఈసారి మామిడి తింటామా?

ఈసారి మామిడి తింటామా?

ఈసారి మామిడి తింటామా?
Comments
Please login to add a commentAdd a comment