మొలకెత్తని మొక్కజొన్న విత్తనాలు
విక్రయించిన సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌పై కేసు నమోదు
టేకులపల్లి: మొక్కజొన్న విత్తన విక్రేతలపై టేకులపల్లి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్ కథనం ప్రకారం.. టేకులపల్లికి చెందిన, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, చంద్రుతండాకు చెందిన భూక్య రాజా తదితరులు పలు మొక్కజొన్న కంపెనీల విత్తనాలను చంద్రుతండా, గోప్యాతండా, సూర్యాతండా గ్రామాల్లో పలువురు రైతులకు అందజేశారు. సాగు ఖర్చులు ఇస్తామని, పంట వచ్చినా, రాకపోయినా ఎకరాకు రూ.60 వేలు ఇస్తామని నమ్మబలికారు. దీంతో రైతులు సాగు చేయగా మొలకలు రాలేదు. కొన్ని మొలకెత్తినా మొక్కలు చనిపోయాయి. ముందుగా చెప్పినట్లు రూ.60 వేలు ఇవ్వాలని రైతులు అడిగితే విత్తనాలు అందించిన లక్కినేని సురేందర్‌రావు స్పందించలేదు. దీంతో రైతులు ఫిర్యాదు చేయగా, సీఐ సురేష్, ఎస్‌ఐ శ్రీకాంత్, ఏఓ అన్నపూర్ణ మొక్కజొన్న చేన్లను పరిశీలించారు. లేబుళ్లు, కంపెనీ పేర్లు, లైసెన్సు వివరాలు లేకపోవడంతో విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా లక్కినేని సురేందర్‌రావు, భూక్య రాజాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ లేకుండా సాగు చేస్తే నష్టం జరుగుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏఓ అన్నపూర్ణ సూచించారు. ఈ ఘటనపై లక్కినేని సురేందర్‌రావును వివరణ కోరగా.. కొన్ని గ్రామాల్లో చేలు మంచిగానే ఉన్నాయని, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment