సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జిల్లాలో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల్లో ముగ్గురు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అయితే త్వరలో ఎన్నుకోనున్న మంత్రి మండలిలో జిల్లా నుంచి ఎవరికై నా చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో చాన్స్ రాదాయె..
తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మొదటిసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగా ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంకటరావు ఒక్కరే గెలుపొందారు. అయితే ఆయనకు మంత్రి మండలిలో చోటు దక్కలేదు. పార్లమెంటరీ కార్యదర్శి హోదాతో ప్రొటోకాల్ కల్పించినా అది ఎక్కువ కాలం నిలవలేదు. రెండోసారి ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మినహా మిగిలిన వారంతా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రభుత్వ విప్ హోదా లభించింది. నిన్నా మొన్నటి వరకు ప్రభుత్వం తరఫున జరిగిన అన్ని కార్యక్రమాలకూ ఆయనే ముఖ్య అతిథిగా వ్యవహరించారు.
మూడుసార్లు.. మూడు పార్టీలు
పినపాక ఎమ్మెల్యేగా ఎన్నికై న పాయం వెంకటేశ్వర్లు మొత్తం ఆరుసార్లు అసెంబ్లీకీ పోటీ చేసి మూడు సార్లు గెలుపొందారు. అయితే ప్రతిసారీ వేర్వేరు పార్టీల తరఫున ఆయన ఎన్నిక కావడం గమనార్హం. మొదటిసారి సీపీఐ నుంచి గెలుపొందారు. రెండోసారి వైఎస్సార్‌సీపీ నుంచి విజయం సాధించగా, తాజా ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఇలా సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే పాయం మిగిలిన ఇద్దరి కంటే ముందున్నారు.
పదవిలో ఉండి.. పార్టీని వీడి..
మొత్తం నాలుగు సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన కోరం కనకయ్య రెండోసారి ఇల్లెందు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు కూడా ఆయన కాంగ్రెస్ నుంచే గెలుపొందారు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ హవా ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఆ పార్టీని వీడారు. అప్పటికే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నా, ఆ పదవి పోయినా పర్వాలేదంటూ ‘కారు’ దిగి పొంగులేటి వెంట హస్తం గూటికి చేరారు. ఈ కోణంలో పరిశీలిస్తే కోరం కనకయ్యకు ‘ప్రొటోకాల్’ పదవి కట్టబెట్టే విషయంలో కాంగ్రెస్ పెద్దలు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. పైగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇల్లెందులో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, అందునా వామపక్ష పార్టీల వారే అధికంగా గెలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఐదుసార్లు.. ఇటీవల వరుసగా మూడుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన ఇల్లెందుకు పార్టీ పెద్దలు గిఫ్ట్ ఇస్తే కనకయ్యకు బుగ్గకారు ఖాయం.
మిత్రధర్మం పాటిస్తే..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, తెలంగాణ జనసమితి తదితర పార్టీలతో కలిసి ఎన్నికల పోరుకు వెళ్లింది. ఇందులో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. మిత్రధర్మం పాటిస్తే కేబినెట్‌లో కూనంనేనికి చోటుదక్కొచ్చు. కానీ ఇప్పటికే కాంగ్రెస్‌లో మంత్రి పదవులకు విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పొత్తుధర్మం ఎంత వరకు పాటిస్తారనేది ప్రశ్నార్థకమే. ఇక అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ తొలిసారిగా గెలిచారు. దీంతో తొలి విడత ఏర్పడే మంత్రి మండలిలో జారేకు అవకాశాలు కష్టమనే భావన నెలకొంది.
ఈసారి ముగ్గురు..
గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకే జిల్లా ప్రజలు పట్టం కట్టారు. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తరఫున పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో కొత్తగూడెం నుంచి గెలుపొందిన కూనంనేని సాంబశివరావు (సీపీఐ) వీరికి జతయ్యారు. గత రెండు ఎన్నికల్లో మంత్రి మండలిలో దక్కని ప్రాతినిధ్యం ఈసారైనా జిల్లా ప్రజాప్రతినిధులకు దక్కుతుందా అనే అంశంపై చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment