ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన, నిష్టూరమైనా సైద్ధాంతిక ఆలోచనా విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా ఉండేది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. వామపక్ష ఉద్యమమే గీటురాయిగా పనిచేసిన సీపీఐ (ఎంఎల్) పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నర్సయ్యే. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం.
ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నాటి నుంచి ఇప్పటివరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయిందని.. పదునైన ఓటు ఆయుధం పచ్చనోట్ల మధ్య మొద్దుబారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అపహాస్యం చేస్తోందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. మారిన ఎన్నికల తీరుపై గుమ్మడి నర్సయ్య ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
దోచుకున్నా గుర్తించరేం?
దోపిడీ విధానాలపై ఉక్కు పిడికిలితో ఉద్యమించిన ప్రజల్లో మార్పు వచ్చింది. దీన్ని ఆకర్షణ పేరుతో పాలకులు అణచివేస్తున్నారు. తాయిలాలు, సంక్షేమానికి ఆకర్షితులవుతున్న జనం.. వాటి కోసం తమ జేబుకే చిల్లు పెడుతున్నారని గుర్తించడం లేదు. మద్యం పేరుతో సర్వం హరిస్తున్నా తెలుసుకోకపోవడం దారుణం. అభివృద్ధి, సంక్షేమానికి చాలా తేడా ఉంటుంది. అభివృద్ధి వల్ల శాశ్వత ఉపాధి అవకాశం లభిస్తుంది. అప్పుడు ఏ సంక్షేమ పథకాలకూ ప్రజలు ఆకర్షితులుకారు.
మారిన లెఫ్ట్ పంథా..
వామపక్ష ఉద్యమ పంథాలో మార్పు వచ్చిందనేది నిజమే. సామాజిక మార్పులను గుర్తించకపోవడం నష్టమే. ఉద్యమ నేపథ్యం ఉన్న పక్షాలు ఐక్యంగా ముందుకెళ్లలేని స్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు పోరాడే విధానానికి దూర మయ్యారు. ఒకప్పుడు పోడు భూముల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన చరిత్ర ఉంది. ఇప్పుడు నేతలు పోటీపడి ఇస్తా మంటే ఆకర్షితులవుతున్నారు. తేలి కగా వచ్చే దానికి ఆకర్షితులవుతున్నారు. పోరాటానికి వెనకాడుతు న్నారు. ఈ ముసుగులోనే సోకాల్డ్ నేతలు ప్రజలను వంచిస్తున్నారు.
రాజకీయమా.. వ్యాపారమా..?
‘‘1983 నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అప్పట్లో ప్రజల్లో మమేకమైతేనే పార్టీలు సీట్లు ఇచ్చేవి అప్పట్లో. పోటీచేసే వ్యక్తిని జనం అదే రీతిలో సొంతం చేసుకునే వాళ్లు. పోస్టర్లు, గోడమీద రాతలు అవే ఆ కాలంలో అతిపెద్ద ఎన్నికల ఖర్చు. ప్రచారం కోసం వచ్చే వాళ్లకు ప్రజలే అన్నంపెట్టే వారు. ఆశ్రయం కల్పించేవారు. అంతా కలిపి రూ.లక్షన్నర వరకూ ఎన్నికల ఖర్చు ఉండేది.
ప్రజలు పైసలు ఆశించేవాళ్లు కాదు. 1994 నుంచి రాజకీయాలు మారిపోయాయి. కోట్లు గుమ్మరిస్తేనే గెలుస్తామని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రజలకు, నాయకులకు మధ్య ధన సంబంధం ఏర్పడింది. రాజకీయాలు కలుíÙతమయ్యాయి. రూ.కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత తమకు ఏది లాభమో దాన్నే అనుసరిస్తున్నారు. అవసరమైతే పార్టీలు మారుతున్నారు.
మౌనం ఉరుముతున్న వేళ..
ఎన్నికల మహాభారతంలో ప్రజలే నిర్ణేతలు. ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్లకే ఓట్లేసే ఆలోచన విధానం కొన్నేళ్లుగా పెరిగింది. కానీ ఒక తరం ఇలా చేయడం వల్ల దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడింది. అందుకే యువతలో ఇప్పుడు నిర్వేదం, నైరాశ్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి.
ఉపాధి లేని జీవితం.. సర్కారీ ఉద్యోగం ఎండమావేనని భావించే యువతలో ఆగ్రహం క్రమంగా కట్టలు తెంచుకుంటోంది. ఇది రానురాను రాజకీయ సమీకరణాలను మారుస్తుంది. ఒక తరం కోల్పోయిన పోరాట పంథాకు ఊపిరిపోస్తోంది. వామపక్ష ఉద్యమ నేపథ్యాన్ని తిరిగి తెలుసుకుంటోంది. పోరాటమే అంతిమ లక్ష్యమన్న ధోరణిలోంచే ఎన్నికల విధానంలోనూ మార్పు వస్తుందనేది వాస్తవం..’’అని గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు.
4 సార్లు ఎమ్మెల్యే.. 3 నియోజకవర్గాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ సిట్టింగ్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ ఘనత సాధించడం గమనార్హం. 1981లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. 1986లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తొలిప్రయత్నంలోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఇండిపెండెంట్ ప్యానల్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో భీంగల్ ఎంపీపీ, సిరికొండ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో తన అనుచరులను గెలిపించుకున్నారు. 1999లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున ఏలేటి అన్నపూర్ణమ్మ(టీడీపీ)పై గెలుపొందారు.
2004లో బాన్సువాడ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(టీడీపీ)పై గెలుపొందారు. 2009లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఓడిపోయారు. తర్వాత 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ తరఫున గోవర్ధన్ పోటీ చేసి ధర్మపురి శ్రీనివాస్(కాంగ్రెస్)పై, 2018లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు.
- వనం దుర్గాప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment