‘రైతుబంధు’లో రాబందులు | Scam In Rythu bandhu | Sakshi
Sakshi News home page

‘రైతుబంధు’లో రాబందులు

Published Thu, Jun 21 2018 11:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Scam In Rythu bandhu - Sakshi

రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, రైతులు  

ఇల్లెందురూరల్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘రైతుబంధు’ప«థకంలోకి రాబందులు చొరబడ్డాయి. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు మూడు నెలలు కుస్తీ పట్టి భూ రికార్డులను కొలిక్కి తెచ్చారు.

అయినా రికార్డులను తారుమారు చేసి, ఫొటోలను మార్ఫింగ్‌ చేసి దర్జాగా నిధులు స్వాహా చేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందకపోవటంతో వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా అసలు బండారం బయట పడింది.

కారేపల్లి మండలం మంగళతండాకు చెందిన రైతులు పిల్లలమర్రి మంగీకి రైతుబంధు పథకంలో రూ.24వేల చెక్కు మంజూరైంది. మంగీ ఆధార్‌కార్డును నెహ్రునగర్‌కు చెందిన బోడ పార్వతి(దళారీ బావమరిది భార్య) ఫొటోతో మార్ఫింగ్‌ చేసి చెక్కును తీసుకొని బ్యాంకుకు వెళి నగదు డ్రా చేసుకున్నారు.

ఇల్లెందు మండలం చల్లసముద్రం రెవెన్యూ గ్రామానికి చెందిన  జాటోత్‌ రమేశ్, తేజావత్‌ కృష్ణ, జాటోత్‌ సత్యం, బానోత్‌ చందర్, తేజావత్‌ వర్మ, తేజావత్‌ బరత్, భూక్య శ్రీను, మాలోత్‌ వస్ర తదితర రైతుల చెక్కులను మార్ఫింగ్‌ చేసి నగదు పొందారు.

ఇదే గ్రామానికి చెందిన మృతి చెందిన రైతులు బానోత్‌ బాలు నాలుగు ఎకరాలకు చెందిన రూ.16వేల చెక్కును, భూక్య మల్లుకు చెందిన నాలుగు ఎకరాలకు చెందిన రూ.16వేలు, బానోత్‌ భీముడుకు చెందిన రూ.27వేల చెక్కును కూడా తీసుకుని నగదు పొందారు.

మంగళతండాకు చెందిన నాయకుడు చెక్కుల గురించి రైతులకు సమాచారం ఇవ్వగా.. బుధవారం వారు మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి తమకు చెక్కులు రాలేదని ఏఓ నరసింహారావును ప్రశ్నించారు. అయితే చెక్కులన్నీ పంపిణీ పూర్తయిందని, మీకు కూడా అందజేశామని అన్నారు.

తమకు అందలేని రైతులు నిలదీయగా జాబితాను పరిశీలించగా చెక్కులు పొంది బ్యాంకులో డ్రా అయినట్లు తేలటంతో అధికారులు అవాక్కయ్యారు. క్షుణ్ణంగా పరిశీలన చేయగా ఆధార్‌కార్డులను మార్ఫింగ్‌ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇల్లెందు తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement