జేసీతో తన బాధను చెబుతూ రోదిస్తున్న రైతు
అనంతగిరి : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, భూ ప్రక్షాళనలో చాలా తప్పులు దొర్లడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలంగాణ జన సమితి జిల్లా ఇన్‌చార్జి శ్రీశైల్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. టీజెఎస్ ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. నాయకులు, రైతులతో కలిసి దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు.
కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న రైతులు తాము కలెక్టర్‌తో మాట్లాడుతామని, వెంటనే బయటకు రావాలని నినాదాలు చేశారు. ఓ దశలో రైతులు కలెక్టర్ కార్యాలయంలోకి Ðవెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ వెంకట్రామయ్య, డీఎస్పీ శిరీష నచ్చజెప్పి శాంతింపజేశారు.
పోలీసులు అక్కడికి మరింత మంది సిబ్బందిని రప్పించారు. కాగా జేసీ అరుణకుమారి రైతుల ధర్నా వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో కంకల్ గ్రామానికి చెందిన రైతులు తన సమస్యలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తాము కలెక్టర్‌కు కూడా కలిసి తమ సమస్యలు చెబుతామని అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు.
లోపలికి వెళ్లేందుకు సిద్ధపడగా పోలీసులు వారికి నచ్చజెప్పారు. చివరకు కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వికారాబాద్ విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోందన్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా పట్టా పాసుపుస్తకాలు, చెక్కులు రాలేవడంలేదని రైతులు ఆయనతో తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ టీజేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తమ బృంధం పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందని అన్నారు. రైతులతో మాట్లాడితే వారు కన్నీటి పర్యంతమవుతున్నారని వాపోయారు. భూ ప్రక్షాళన పేరిట రైతులు ఏళ్ల తరబడి ఉన్న భూముల పట్టా పాసుపుస్తకాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.
ఏళ్ల తరబడి తాము సాగుచేస్తున్న భూమిపై పలుచోట్ల వేరే వారి పేర్లు వచ్చాయన్నారు. ఇలాంటి తప్పిదాలతో రైతులు భయందోళనలకు గురవుతున్నారన్నారు. అధికారులకు తక్కువ సమయం ఇచ్చి వారిపై పనిఒత్తిడి పెంచి ఎన్నికల స్టంట్‌గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని ఆయన ఆరోపించారు. జైదుపల్లి, కంకల్ గ్రామాల్లో రైతులు ఏళ్లతరబడి సాగుచేస్తున్న భూముల్లో ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి ఈ భూములు తమవి అంటున్నారని, దున్నుకోవడానికి అనుమతించడం లేదని వాపోయారు.
పట్టా ఒకరిపై ఉంటే కొత్తపాసు పుస్తకాలు మరొకరి పేరిట వచ్చాయని, అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాలు ఉన్న రైతులకేమో రైతుబంధు చెక్కులు లక్షల్లో వస్తున్నాయని, పంట పండించే రైతులకు మాత్రం చిన్నపాటి సమస్యలు అడ్డుపెట్టుకుని చెక్కులు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు.
అనంతరం జిల్లా నాయకులు గడ్డం రాంచందర్, కల్కోడ నర్సింలు మాట్లాడుతూ భూ రికార్డులు, పాసు పుస్తకాల్లో జరిగిన అవకతవకల వల్ల రైతుల బతుకులు వీధిన పడుతున్నాయన్నారు. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే కల్పించుకుని వారి రికార్డులను సరిచేసి కొత్త పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం నాయకులు వినతిపత్రం అందజేసి అక్కడి నుంచి డీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు జగదీష్, మాణిక్‌రెడ్డి, లక్ష్మణ్, గోపాల్, అజయ్, విక్రం, సుధీర్, మురళి, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment