తెలంగాణలో నీళ్లున్నా బీళ్లాయె! ఆ భయాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందా? | Telangana State Reduced Crop Cultivation Million Acres Seem Vacant | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నీళ్లున్నా బీళ్లాయె! ఆ భయాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందా?

Jan 28 2022 2:40 AM | Updated on Jan 28 2022 11:29 AM

Telangana State Reduced Crop Cultivation Million Acres Seem Vacant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కావాల్సినన్ని నీళ్లున్నాయి. అయినా వ్యవసాయ భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వరి వేయొద్దని సర్కారు సూచించడంతో రైతులు ఆ పంట సాగు గణనీయంగా తగ్గించేశారు. రైతుబంధు రాదనే ప్రచారం వల్ల కూడా చాలామంది వెనక్కు తగ్గారు. మరోవైపు చెరువుల కింద ఉన్న భూములకు నీరు వదలక పోవడంతో ఆ ప్రాంతాల్లో వరి నాట్లు పడలేదు. అదే సమయంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలన్న వ్యవసాయ శాఖ పిలుపును రైతులు పెద్దగా పట్టించుకోలేదు.

వరి సాగు తగ్గడం, ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగక పోవడంతో లక్షలాది ఎకరాల్లో పంట భూములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులున్నా భూములు ఖాళీగా ఉండటం ప్రమాదకరమైన ధోరణి అని, మంచి పరిణామం కూడా కాదని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఆందోళనకరంగా సాగు
యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా గత ఏడాది  ఏకంగా 68.14 (187%) లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.  కానీ ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా నీళ్లున్నా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.  అలాగే గతేడాది యాసంగి సీజన్‌ మొత్తం తీసుకుంటే ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాంతో పోలిస్తే ఇప్పుడు నాలుగో వంతు కూడా నాట్లు పడలేదు. 

పొద్దుతిరుగుడు, మినుము మినహా
వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, పొద్దు తిరుగుడు, శనగ, వేరుశనగ, మినుము వంటి పంటలను సాగు చేయాలని, వాటి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. కొద్ది మొత్తంలో సాగయ్యే పొద్దుతిరుగుడు, మినుము మినహా మిగతా పంటల సాగు పెరగలేదు. పొద్దు తిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు కాగా, 23,881 ఎకరాల్లో సాగైంది. అలాగే మినుము సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 24,018 ఎకరాలు కాగా, 70,827 ఎకరాల్లో సాగైంది.

వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, 3.13 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగను కనీసం ఐదారు లక్షల ఎకరాలకు పెంచాలని అధికారులు భావించినా ఆ మేరకు సాగవలేదు. ఇక శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, కొద్దిగా పెరిగి 3.27 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ల„ý ల ఎకరాల్లో వరిని నిలిపివేస్తున్నప్పుడు ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా లక్షల ఎకరాల్లో అదనంగా పెరగాలన్నది సర్కారు ఆకాంక్ష. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. కేవలం వేల ఎకరాల్లో ఉన్న చిన్నపాటి పంటల విస్తీర్ణం మాత్రమే రెండు మూడింతలు పెరిగింది.  

అధికార యంత్రాంగం నిర్లక్ష్యం
వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రత్యామ్నాయ పంటల సాగు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు సకాలంలో రైతులకు చెప్పలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా అవసరమైన విత్తనాలను పూర్తిస్థాయిలో అందించలేదన్న విమర్శలున్నాయి. కొన్ని రకాల విత్తనాలను సరఫరా చేశారే కానీ, రైతులు కోరిన వెరైటీలను అందుబాటులోకి తీసుకురాలేక పోయారు.

ఇదిగో ఇలా బీడుగా వదిలేసిన ఈ భూమి మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపల్లికి చెందిన రాంరెడ్డిది. తొమ్మిదెకరాల ఈ పొలం పక్క నుంచే గూడెం ఎత్తిపోతల పథకం కాలువ ఉంది. గతంలోనే బోరుబావి కూడా తవ్వించాడు. ఏటా వరి సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం పుష్కలంగా నీరున్నా ఈ యాసంగిలో ఏ పంట వేయాలో తెలి యక ఆరెకరాలు బీడుగా వదిలేశాడు.

ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనబోమని, వరి సాగు చేయొ ద్దని సూచించడంతో వరి వేస్తే ధాన్యం అమ్ముకోవ డం ఇబ్బంది అవుతుందని రెండెకరాల్లోనే వరివేశాడు. కూరగాయలు, నువ్వులు అరెకరం చొప్పున సాగు చేస్తున్నాడు. మిగతా పంటలు ఏం వేయాలో తెలియక ఆరెకరాలు ఇలా బీడుగా వదిలేశాడు.    


–  మంచిర్యాల, అగ్రికల్చర్‌

మూడెకరాల వరి పొలం బీడే..
ఏటా ప్రాజెక్టు కాలువ కింద యాసంగి వరి పంట సాగు చేసుకునేది. ఈ ఏడాది వరి సాగు వద్దని ప్రభుత్వం చెప్పింది. పంట వేసుకుంటే నష్టపోవుడేనని, వేరే పంటలు వేసుకోవలన్నరు. గట్లని కంది, పెసలు, నువ్వులు వేసుకుంటే పొద్దంతా ఆవులు, రాత్రి అడవి పందులతో నష్టం ఉంటది. చుట్ట పక్కల పొలం రైతులూ వరి వేయలేదు. నా మూడెకరాల వరి పొలం కూడా ఈ ఏడాది బీడే ఉన్నది. 


– తోట బాపయ్య, నెన్నెల, మంచిర్యాల జిల్లా

మాకు తెలిసింది వరి పంటే..
బోరుకింద ఏటా యాసంగిలో దొడ్డు వరి సాగు చేసేది. వరి పంట వేయద్దని చెప్పడంతో పోయిన ఏడాది మూడెకరాల వరి సాగు చేసుకుంటే ఈ ఏడాది ఎకరంలోనే నాటు వేసుకున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా రెండు ఎకరాలు బీడు పోయింది. ఏళ్ల తరబడి వరి పంట తప్ప ఏ పంట వేయలే. మాకు తెలిసిందల్లా వరి పంటే.   


– ఇజ్జగిరి చంద్రయ్య, కుందారం, జైపూర్, మంచిర్యాల జిల్లా

పర్యవసానం తీవ్రంగా ఉంటుంది    
రైతుకు మార్కెట్లో ఎంతో కొంత మంచి ధర వచ్చేది వరితోనే. మిగతా పంటల్లో రాదు. ఇప్పుడు వరి వేయొద్దనడంతో దాన్ని నిలిపివేశారు. అలాగని మిగతా పంటలూ వేయడం లేదు. ఎవరికి వారు పంటల విరామం ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదో ఒక రకమైన నిరసన. వేరే పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడంపై కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లే లెక్క. దీన్ని సాధారణమైన పరిణామం, స్థితిగా  తీసుకోకూడదు. దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది.

వరి భారీగా పండుతున్న సమయంలోనే బియ్యం ధర కిలో రూ. 60కు పైగా పలుకుతోంది. ఆ మేరకు వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. పంట మంచిగా పండితేనే ఆహారం అందరికీ సరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఆహారం అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ప్రభుత్వం మీద భారం పడుతుంది. రేషన్‌ బియ్యానికి డిమాండ్‌ 70–80 శాతానికి పెరుగుతుంది. అంతేకాదు పడావు బడ్డాక భూమి ఆరు నెలలు అలాగే ఉంటే పూర్తిగా ఎండిపోతుంది. దాని భూసారం పడిపోతుంది. వరి పండించే భూమి పడావు పడితే ఉప్పు తేలిపోతుంది. 


–  డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement