సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం.
పెళ్లికి లక్షా నూట పదహార్లు..
అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు.
అన్నదాతకు బీమా..
వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్‌ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్‌ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణకు ఎయిమ్స్..
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది.
రైతు బంధు..
రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది.
వర్షాకాలం సీజన్‌లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు.
నీళ్లు పారాయి..
సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది.
కోటి కళ్ల కొత్త చూపు..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.
వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి.
కొత్తగా 7 లక్షల ఎకరాలకు..
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment