Water irrigation project
-
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్‌తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్‌లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
డెడ్‌లైన్ మార్చి 31
సాక్షి, భూపాలపల్లి: కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులతో పాటు గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని.. డెడ్‌లైన్ మార్చి 31లోపు పూర్తి కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. మేడిగడ్డ నిర్మాణ పనులపై అసంతృప్తి.. కాగా మేడిగడ్డ బ్యారేజీ పనులపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ముందుగా మేడిగడ్డ చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పనులను దగ్గర నుంచి పర్యవేక్షించారు. మార్చి 31లోగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎల్అండ్టీ అధికారులకు సీఎం సూచిం చారు. కొన్ని సమస్యలు నెలకొంటున్నం దున మరో 15 రోజులు గడువు పెంచాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ 15లోగా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి విన్నవించారు. మార్చి 15లోగా కరకట్ట పనులు పూర్తి చేస్తామని సీఎండీ తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రాజెక్ట్ ఉండాలని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాలి... తర్వాత కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. పంప్‌హౌస్ నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లో భాగంగా 11 మోటర్లకు గాను ప్రస్తుతం నాలుగు బిగించినట్లు వారు తెలిపారు. మార్చి 15 నాటికి మిగతా వాటిని బిగించి డ్రైరన్ నిర్వహిస్తామని వివరించారు. జూన్ నాటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని మోటార్లను బిగించి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే నదికి కాపర్ డ్యాం నిర్మించి వెట్‌రన్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి గ్రావిటీ కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. గ్రావిటీ కెనాల్ లైనింగ్, స్ట్రక్చర్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అప్రోచ్ కెనాల్లో గైడ్బండ్లు నిర్మించాలని, మట్టి పనులు పూర్తి చేయాలన్నారు. ఫ్లడ్బంకుల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. పనులు సమాంతరంగా సాగాలి... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజీ నిర్మాణంతో పాటు పంపుహౌస్, మోటార్ల ఏర్పాటు పనులన్నీ సమాంతరంగా పూర్తికావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదికి ఇరువైపులా ఉండే ఫ్లడ్ బ్యాంకుల పనులను పరిశీలించిన కేసీఆర్, మట్టిపని రివిట్మెంట్ పనులను జలాశయ మట్టందాకా పూర్తి చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కాంక్రీటు వర్క్ రోజుకు 10,000 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్‌బే, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించిన కేసీఆర్ హెడ్ రెగ్యులేటర్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను సవరించాలని సూచించారు. సముద్రమార్గం ద్వారా చెన్నై పోర్టుకు చేరుకున్న మోటార్లను తెప్పించి వెంటనే బిగించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను సీఎంఓ సెక్రటరీ ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని తెలిపారు. సీఎంను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ను టీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబం«ధించిన వినతులు అందించారు. కాళేశ్వరం నీటిని మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలకు అందించాలని కోరారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, సీఎంఓ ప్రత్యేకాధికారిణి స్మితా సభర్వాల్, ప్రాజెక్ట్ సీఈఓ నల్లా వెంకటేశ్వర్లు, ఐజీ నాగిరెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూర్లో హరీశ్‌రావు మిస్.. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు బాటలో భారీ నీటి పారుదల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2016, మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసినప్పటి నుంచి హరీశ్ ప్రాజెక్టులపైన తనదైన మార్క్ వేసుకున్నారు. సంవత్సర కాలంలో సుమారు తొమ్మిదిసార్లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు గ్రావిటీ కాల్వ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంప్‌హౌస్‌లను చుట్టేశారు. తనదైనశైలిలో ప్రాజెక్టులను రాత్రిపగలు తేడా లేకుండా పర్యటిస్తూ పనులను పరుగులు పెట్టించాడు. 2016, మే 2.. 2017, డిసెంబర్ 7న సీఎం రెండుసార్లు పర్యటించగా.. హరీశ్‌రావు ఆయనతో వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట హరీశ్‌రావు లేకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో తమ గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని.. ఈ మేరకు ఆర్అండ్ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బ్యారేజీ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను అడ్డుకోవాలని యత్నించిన కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి వాసులను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ నేటి పర్యటన.. ముఖ్యమంత్రి బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కాల్వ, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించనున్నారు. ఉదయం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వసతి గృహం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 13.02 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణించి అన్నారం బ్యారేజీ చేరుకుంటారు. మంగళవారం రోజునే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీì కాల్వ, అన్నారం బ్యారేజీలు పరిశీలించాల్సి ఉండగా.. సమయాభావం కారణంగా బుధవారానికి వాయిదా పడినట్లు కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. -
సంక్షేమం కొత్త పుంతలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం. పెళ్లికి లక్షా నూట పదహార్లు.. అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు. అన్నదాతకు బీమా.. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. రైతు బంధు.. రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాకాలం సీజన్లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నీళ్లు పారాయి.. సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. కోటి కళ్ల కొత్త చూపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. కొత్తగా 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
కాలువలే ముందు పూర్తి చేయండి
- వచ్చే ఏడాదే కాళేశ్వరం నీటితో చెరువులు నింపాలి: కేసీఆర్ - నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష - 15 టీఎంసీలతో కొండపోచమ్మకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, రిజర్వాయర్ల కన్నా ముందే కాలువలను పూర్తి చేయాలని.. వచ్చే ఏడాది నుంచే ప్రాజెక్టు పరిధిలోని చెరువుల ద్వారా పంటలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గతేడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా చెరువులు నింపడంతో తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు పండాయని.. వాటి విలువ రూ.4,725 కోట్లు అని చెప్పారు. అదే స్ఫూర్తితో కాళేశ్వరం కాలువలను వేగంగా నిర్మించి, చెరువులు నింపాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంగళ వారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషీ, ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తరువాత చాలా నీటి లభ్యత ఉందని, రాష్ట్ర వాటా ప్రకారం వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరతే ఉండదని కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రాజెక్టుల ద్వారా నీరందించలేని ప్రాంతాల్లో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తంగా తెలంగాణలో ఏటా రూ.లక్షా 25 వేల కోట్ల విలువైన పంటలు పండుతాయని, ఇది వార్షిక బడ్జెట్‌కు సమానమని చెప్పారు. 15 టీఎంసీలతో కొండపోచమ్మ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కొండపో చమ్మ సాగర్ నిల్వ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచిన తరువాత రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించి ఆమోదించారు. దీనికి వెంటనే టెండర్లు పిలిచి 8 నుండి 10 నెలల సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరిచ్చేలా ఎత్తిపో తల పథకాల కోసం అవసరమైన విద్యుత్ అం దించడానికి ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసిందని తెలి పారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులను నీటి పారుదల శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లి స్తుందని చెప్పారు. వ్యవసాయానికి పెట్టే ఖర్చు ను రైతుల కోసం పెట్టే పెట్టుబడిగానే భావిస్తా మన్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు నిర్మించే పనిలో ఉన్న నీటి పారుదల శాఖ.. భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్వహణకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. ఈఎన్సీ, సీఈలు ఎంతమంది ఉండాలి.. వారెక్కడ పనిచేయాలనే అంశాల్లో స్పష్టత ఉండాలని చెప్పారు. అధికార యంత్రాంగమంతా హైదరాబాద్‌లోనే కేంద్రీ కృతం కాకుండా క్షేత్రస్థాయికి విస్తరించా లన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రాం తానికి అనుకూలంగా అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, 31 జిల్లాలకు అను గుణంగా నీటి పారుదల శాఖ అధికార వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. శ్రీశైలం నీటి వినియోగంపై అధ్యయనం చేయాలి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో శ్రీశైలం నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పాలమూరు ప్రజలు 20 లక్షల ఎకరాలు పండించుకోవాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక అవసరాలతో పాటు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు ప్రాజెక్టులో వాటర్ లెవల్స్ కచ్చితంగా మెయింటెయిన్ చేయాలన్నారు. ఇక లిఫ్టుల నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని, ఇరిగేషన్ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు.