సాక్షి, భూపాలపల్లి: కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులతో పాటు గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని.. డెడ్‌లైన్ మార్చి 31లోపు పూర్తి కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు.
మేడిగడ్డ నిర్మాణ పనులపై అసంతృప్తి..
కాగా మేడిగడ్డ బ్యారేజీ పనులపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన ముందుగా మేడిగడ్డ చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పనులను దగ్గర నుంచి పర్యవేక్షించారు. మార్చి 31లోగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎల్‌అండ్‌టీ అధికారులకు సీఎం సూచిం చారు. కొన్ని సమస్యలు నెలకొంటున్నం దున మరో 15 రోజులు గడువు పెంచాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ 15లోగా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి విన్నవించారు. మార్చి 15లోగా కరకట్ట పనులు పూర్తి చేస్తామని సీఎండీ తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రాజెక్ట్ ఉండాలని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు.
మార్చి 31 నాటికి పూర్తి చేయాలి...
తర్వాత కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. పంప్‌హౌస్ నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లో భాగంగా 11 మోటర్లకు గాను ప్రస్తుతం నాలుగు బిగించినట్లు వారు తెలిపారు. మార్చి 15 నాటికి మిగతా వాటిని బిగించి డ్రైరన్ నిర్వహిస్తామని వివరించారు. జూన్ నాటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని మోటార్లను బిగించి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే నదికి కాపర్ డ్యాం నిర్మించి వెట్‌రన్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి గ్రావిటీ కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. గ్రావిటీ కెనాల్ లైనింగ్, స్ట్రక్చర్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అప్రోచ్ కెనాల్‌లో గైడ్‌బండ్‌లు నిర్మించాలని, మట్టి పనులు పూర్తి చేయాలన్నారు. ఫ్లడ్‌బంకుల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.
పనులు సమాంతరంగా సాగాలి...
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజీ నిర్మాణంతో పాటు పంపుహౌస్, మోటార్ల ఏర్పాటు పనులన్నీ సమాంతరంగా పూర్తికావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదికి ఇరువైపులా ఉండే ఫ్లడ్ బ్యాంకుల పనులను పరిశీలించిన కేసీఆర్, మట్టిపని రివిట్‌మెంట్ పనులను జలాశయ మట్టందాకా పూర్తి చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కాంక్రీటు వర్క్ రోజుకు 10,000 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్‌బే, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించిన కేసీఆర్ హెడ్ రెగ్యులేటర్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను సవరించాలని సూచించారు. సముద్రమార్గం ద్వారా చెన్నై పోర్టుకు చేరుకున్న మోటార్లను తెప్పించి వెంటనే బిగించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను సీఎంఓ సెక్రటరీ ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని తెలిపారు.
సీఎంను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...
ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ నాయకులతో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబం«ధించిన వినతులు అందించారు. కాళేశ్వరం నీటిని మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలకు అందించాలని కోరారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, సీఎంఓ ప్రత్యేకాధికారిణి స్మితా సభర్వాల్, ప్రాజెక్ట్ సీఈఓ నల్లా వెంకటేశ్వర్లు, ఐజీ నాగిరెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు టూర్‌లో హరీశ్‌రావు మిస్..
సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు బాటలో భారీ నీటి పారుదల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2016, మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసినప్పటి నుంచి హరీశ్ ప్రాజెక్టులపైన తనదైన మార్క్ వేసుకున్నారు. సంవత్సర కాలంలో సుమారు తొమ్మిదిసార్లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు గ్రావిటీ కాల్వ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంప్‌హౌస్‌లను చుట్టేశారు. తనదైనశైలిలో ప్రాజెక్టులను రాత్రిపగలు తేడా లేకుండా పర్యటిస్తూ పనులను పరుగులు పెట్టించాడు. 2016, మే 2.. 2017, డిసెంబర్ 7న సీఎం రెండుసార్లు పర్యటించగా.. హరీశ్‌రావు ఆయనతో వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట హరీశ్‌రావు లేకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో తమ గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని.. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బ్యారేజీ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను అడ్డుకోవాలని యత్నించిన కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి వాసులను పోలీసులు అడ్డుకున్నారు.
కేసీఆర్ నేటి పర్యటన..
ముఖ్యమంత్రి బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కాల్వ, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించనున్నారు. ఉదయం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వసతి గృహం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 13.02 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణించి అన్నారం బ్యారేజీ చేరుకుంటారు. మంగళవారం రోజునే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీì కాల్వ, అన్నారం బ్యారేజీలు పరిశీలించాల్సి ఉండగా.. సమయాభావం కారణంగా బుధవారానికి వాయిదా పడినట్లు కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment