kannepally
-
ఆగస్టు 2 డెడ్‌లైన్
సాక్షి ప్రతినిధి, వరంగల్/గోదావరిఖని: గోదావరి నిండుగా పారుతున్నా కన్నెపల్లి (మేడిగడ్డ (లక్ష్మీ)) పంపుహౌస్ నుంచి నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం (క్రిమినల్ నెగ్లిజెన్సీ) ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశం గర్వించే విధంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నామ్ చేయాలనే రాజకీయ దురుద్దేశంతో రైతులకు నష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.ఆగస్టు 2 వరకు కాళేశ్వరం బరాజ్‌ల్లో నీరు నింపాలని, లేదంటే 50 వేల మంది రైతులతో తరలివచ్చి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం బరాజ్‌ల సందర్శనకు బయలుదేరి గురువారం రాత్రి గోదావరిఖని ఎనీ్టపీసీ జ్యోతిభవన్‌లో బస చేసిన కేటీఆర్..శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, మేడిగడ్డ బరాజ్‌లను, పంపుహౌస్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదు.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. డిసెంబర్–జనవరిలలోనే నీరివ్వాలని ప్రభుత్వానికి సూచించినా భేషజాలకు వెళ్లి యాసంగి పంటలను ఎండబెట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, సింగూరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఎండిపోతున్నా కేవలం రాజకీయ దురుద్దేశంతో వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. వానాకాలంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితిని కలి్పస్తున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 70–80 టీఎంసీలు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా.. ‘తెలంగాణలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 70–80 టీఎంసీల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలేరు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, ఆదిలాబాద్, హుజూరాబాద్, హుస్నాబాద్, గజ్వేల్, భువనగిరి.. ఇలా తెలంగాణలోని మెట్ట ప్రాంతాల కు సాగునీరు అందించే అవకాశం ఉంది.ఇందుకోసం రోజు కు రెండు, మూడు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను గోదావరి నీటితో నింపొచ్చు. పైన ఉన్న సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలోనూ నీళ్లు లేవు, వీటికీ కాళేశ్వరమే ఆధారం. మరో ప్రత్యామ్నా యం లేదు. ఇవన్నీ తెలిసినా రాజకీయం కోసం రైతులు, ప్ర జలను వంచిస్తున్నారు..’అని మాజీమంత్రి ధ్వజమెత్తారు.ఎన్డీఎస్ఏ రిపోర్టు ఓ ఫార్స్‘నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్టు ఓ ఫార్సు. ఆ నివేదికను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఐదేళ్లు గడు స్తున్నా ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. కాళేశ్వరంపై మాత్రం కనీసం ప్రాజెక్టును పరిశీలించకుండా ఒక్కరోజులోనే నివేదిక ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఒకే విధంగా ఉంది. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పంప్‌హౌస్‌లు ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజనీర్లు చెప్పారు. నీటిని లిఫ్ట్ చేస్తే రెండు రోజుల్లో మిడ్ మానేరుకు చేరుకుంటాయి.దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉదయం గోదావరిఖని నుంచి చెన్నూరు మీదు గా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లిన కేటీఆర్ దారిలో గోదావరి బ్రిడ్జి వద్ద కొద్దిసేపు ఆగి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ వరద లేకపోవడంతో..ప్రస్తుత ప్రభుత్వ తీరుతో గోదావరి నదిలో చిల్లర నాణేలు సమరి్పంచేందుకు నీరు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వ ర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, గోరటి వెంకన్న, వాణిదేవి, ఎలగందుల రమణ, బాల్క సుమన్, దివాకర్‌రావు, చిన్నయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, ముఠా గోపాల్, కోవ లక్ష్మీ, విజయుడు ఉన్నారు. -
ఆగస్టు 2 డెడ్‌లైన్.. రైతులతో కలిసి పంపులు ఆన్ చేస్తాం: కేటీఆర్
సాక్షి, కాళేశ్వరం: కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా మొదటగా వీరు కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలో ప్రతీ రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి ప్రాజెక్ట్‌లపై రాజకీయం చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్‌ను కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు కల్పతరువు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన ప్రాజెక్ట్‌ను నిర్మించలేదు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు.గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు రెండో తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందిచకపోతే 50వేల మంది రైతులతో మేము పంపులు ఆన్ చేస్తాం. బీడు భూములకు నీళ్లు అందిస్తాం. రాజకీయపరమైన నిర్ణయం వల్లనే నీటిని ఎత్తిపోయడం లేదు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు కేవలం 25 టీఎంసీలే ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్‌ల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా కాళేశ్వరం నీటి కోసం చూస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు.ఒక్క బటన్ నొక్కితే పైన ఉన్న ఎల్ఎండీ, మిడ్ మానేరు సహ ఎస్ఆర్ఎస్పీ కూడా నింపొచ్చు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం కొట్టుకుపోతే ఏళ్లు గడిచినా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ, కాళేశ్వరం విషయంలో రోజుల్లోనే రిపోర్టులు ఇచ్చింది. కేవలం కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతోంది. ఎలాగూ మీరంతా అనుకున్నట్టుగానే కేసీఆర్‌ను ఓడించారు. ఇంకా రైతులపై ఎందుకింత పగ. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందిపెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. -
సందడే.. సందడి
సాక్షి, కాళేశ్వరం: ఆర్టీసీ బస్సు కూడా ఎరగని గ్రామాలవి... కానీ ఇప్పుడు అక్కడకు హెలీకాప్టర్లు రానున్నాయి.. అందుకోసం హెలీప్యాడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.. గోదావరి గలగలలు.. అక్కడక్కడా టీవీ శబ్దాలు వినిపించే మారుమూల పల్లెల్లో ఇప్పుడు భారీ మోటార్ల మోతలు నిత్యకృత్యమయ్యాయి. మూడేళ్ల కిందట మొదలైన కాళేశ్వరం మహాయజ్ఞానికి వేదికగా మారిన కన్నెపల్లి, కాళేశ్వరం గ్రామాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి.. ఎడ్ల బండ్లే దిక్కుగా ప్రయాణాలు సాగించే పల్లె వాసులు ప్రస్తుతం ఫార్చునర్ కార్లు, హెలీక్యాప్టర్లు, ఏసీ బస్సుల రాకతో ఓ పక్క ఉక్కిరిబిక్కిరవుతూనే మరో పక్క సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.. బయటి ప్రపంచానికి పట్టని కుగ్రామమైన కన్నెపల్లి వైపు ఇప్పుడు రాష్ట్రంతో పాటు యావత్ దేశం చూపు పడింది. కాళేశ్వరం కిటకిట ఐదు వేల జనాభా.. 800కు పైగా గడపలు ఉన్న కాళేశ్వరం గ్రామం మూడేళ్ల క్రితం ఆలయానికి వచ్చే భక్తులతో కళకళలాడేది. ఇప్పుడు ముగ్గురు సీఎంలు, గవర్నర్లు వస్తుండడంతో కాళేశ్వరం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇక్కడి సత్రాలు, గెస్ట్‌హౌస్‌లు, ప్రైవేట్ లాడ్జీలు వారం క్రితమే నిండిపోయా యి. దీంతో వసతి సమస్య ఎదురవుతోంది. ఈ అవస్థలు గమనించిన కాళేశ్వరం గ్రామస్తులు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. పోలీసులు, భద్రతా సిబ్బందిని అతిథులుగా భావించి తమ ఇళ్లలో ఆశ్రయం ఇస్తున్నారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాలను మించిన సందడి కనిపిస్తోంది. మినీ ఇండియా కన్నెపల్లి జనాభా కేవలం 800 ఉండగా ఇక్కడ పంపుహౌస్ నిర్మాణ పనుల్లో 3,500 మంది కార్మికులు 60 మందికి పైగా ఇంజనీర్లు ఇక్కడ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో కన్నెపల్లి ప్రాంతం మినీ ఇండియాను తలపించింది. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన కార్మికులు వందల సంఖ్యలో పంపుహౌస్ పనుల్లో పాలుపంచుకున్నారు. ఇక భారీ మోటార్లు బిగించేందుకు విదేశీయులు సైతం కన్నెపల్లిలో గడిపారు. మూడేళ్లుగా కన్నెపల్లిలో జరుగుతున్న పనులు ఒక ఎత్తయితే.. వారం రోజులుగా ఇక్కడ నెలకొన్న సందడి మరో ఎత్తుగా మారింది. ప్రారంభోత్సవ వేడుకలకు ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, దేశం గర్వించతగ్గ ప్రాజెక్టు కావడంతో అటు ఏర్పాట్లు.. ఇటు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. వేల సంఖ్యలో పోలీసులు కన్నెపల్లి, కాళేశ్వరం ప్రాంతంలో మొహరించారు. బస్సు ముఖం చూడని గ్రామంలో ఇప్పుడు ఏకంగా 9 హెలిప్యాడ్లు నిర్మించారు. భారీ హోమం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ పనుల్లో వందల మంది పాల్గొంటున్నారు. దీంతో గంటల వ్యవధిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కన్నెపల్లి కళకళ 840 మంది జనాభా .... 135 గడపలు ఉన్న కన్నెపల్లి గ్రామంలో ఓటర్లు 529 మందే. 541.5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న ఈ చిన్న గ్రామం బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. 1994లో కన్నెపల్లి పంచాయతీగా ఏర్పడగా తొలిసారి 2008లో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ నీటి సరఫరా కోసం ఇక్కడ ఇన్‌టెక్ వెల్ ఏర్పాటు చేశారు. అదే సంవత్సరంలో 2009లో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రూ. 499 కోట్ల వ్యయంతో కాళేశ్వరం మినీ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశా రు. ఆ తర్వాత పదేళ్లకు రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తోంది. రివర్స్ పంపింగ్‌లో గోదావరి ఇక్కడి నుంచి తొలిసారిగా వెనక్కి మళ్లనుంది. ఇక్కడ బ్యారేజీ నిర్మించేందుకు ఈ గ్రామానికి చెందిన 280 ఎకరాల భూమిని సేకరించారు. సమస్యలు లేకుండా త్వరగా భూసేకరణ జరిగింది ఇక్కడే. ప్రస్తుతం నిర్మితమైన పంపుహౌస్ ప్రదేశంలో మూడేళ్ల క్రితం కన్నెపల్లికి చెందిన కొన్ని ఇళ్లు, పెరడు, వాకిళ్లు ఉండేవి. ఇప్పుడక్కడ భారీ మోటార్లు, పైపులు, విద్యుత్ సబ్ స్టేషన్లు వెలిశాయి. మూడేళ్ల కిందటికి ఇప్పటికి గుర్తు పట్టలేనంతగా ఈ ఊరు పరిసరాల్లో రూపు రేఖలు మారిపోయాయి. నాకు గర్వంగా ఉంది నాకు ఎంతగానో గర్వంగా ఉంది. సర్పంచ్‌గా నా పేరు ముగ్గురు సీఎంలు, గవర్నర్లతో పాటు శిలాఫలకంపై ఉండడం సంతోషాన్ని ఇస్తోంది. కన్నెపల్లి మొత్తం సిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. సందడి సందడిగా పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సర్పంచ్‌గా నేను ఉండడం గర్వకారణంగా ఉంది. – ముల్కల్ల శోభ, సర్పంచి కన్నెపల్లి మా గ్రామ రూపురేఖలు మారిపోయాయి నేను 1970–1994 వరకు వరుసగా సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. అప్పడు కనీసం మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. 2008 నుంచి మా గ్రామ అభివృద్ధికి ఒక్కో అడుగు పడింది. జెన్కోతో కొంత మార్పు వచ్చింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామ రూపురేఖలు మారాయి. మేమంత భూములు ఇచ్చాం. గ్రామంలో సుమారు 280 ఎకరాల వరకు అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా మా గ్రామం గురించి మాట్టాడుతుండ్రు. టీవిల్లో రోజు మాగ్రామం, మేడిగడ్డ గురించే ఇస్తుండ్రు. - వెన్నపురెడ్డి చిన్నమల్లారెడ్డి, మాజీ సర్పంచ్, కాళేశ్వరం, కన్నెపల్లి -
6వ మోటార్ ట్రయల్ రన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో వేగం పెరిగింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో సీఎం ప్రారంభించనున్న 6వ మోటార్‌కు అధికారులు మంగళవారం అర్ధరాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు. మిగితా మూడు మోటార్లకు గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే.. మేడిగడ్డ వద్ద హోమశాల, అక్కడే వీఐపీలు కూర్చునేందుకు ప్రాంగణం ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ల నుంచి హోమశాలకు వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్లు నిర్మించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు కూర్చునే ప్రాంగణం పూర్తి కావచ్చింది. భోజనాలు చేసే స్థలంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వంటశాల నిర్మాణం పూర్తికావచ్చింది. వీవీఐపీల కోసం ఏసీ బస్సులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీవీఐపీలు హెలిప్యాడ్ల నుంచి బ్యారేజీ, పంపుహౌస్‌లకు చేరుకోవడానికి కన్నెపల్లిలో 6 క్యాంపరింగ్ వ్యాన్ బస్సు (కార్విన్)లను ఏర్పాటు చేశారు. వీటిలో ఏసీతోపాటు వీవీఐపీలు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉన్నాయి. బ్యారేజీ, పంపుహౌస్‌ల్లో శిలాఫలకం రెడీ! మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో ముఖ్య అతిథులు ఆవిష్కరించడానికి శిలాఫలకాల నిర్మాణం పూర్తి కావచ్చింది. ముగ్గురు సీఎంలతో పాటు గవర్నర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రొటోకాల్ సభ్యుల పేర్లు వాటిపై ఏర్పాటు చేయనున్నారు. రాత్రికి రాత్రే.. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో రాత్రికి రాత్రే అంతర్గత రోడ్లు వేస్తున్నారు. సీఎంలు, మంత్రుల కాన్వాయ్ వెళ్లే వీలుగా బీటీ రోడ్లు వేస్తున్నారు. ఈరోజు చూసింది.. మరునాడు కనిపించకుండా మారిపోతున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీల వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో హోమశాల, బ్యారేజీలు, ఆవలి వైపు భద్రత, కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు, వంటశాల, క్యాంపు కార్యాలయం, అప్రోచ్‌కెనాల్, ఫోర్‌బే తదితర స్థలాల్లో భద్రతను జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏఎస్పీ సాయిచైతన్యతో కలసి పరిశీలించారు. 16 హెలిప్యాడ్లు సిద్ధం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో మొత్తం 16 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ఇంతకు ముందు 12 మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. ప్రస్తుతం ఆ సంఖ్య 16కు చేరింది. తెలంగాణ వైపు మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో 7 నిర్మించగా, మరొకటి మహారాష్ట్ర వైపు పోచంపల్లి గ్రామంలో ఒకటి, కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 9 హెలిప్యాడ్ సిద్ధమయ్యాయి. మరిన్ని హెలిప్యాడ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
కన్నెపల్లిలో వెట్‌రన్‌కు సన్నాహాలు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లకు పరీక్షలు (వెట్‌రన్) నిర్వహించేందుకు ఇంజనీరింగ్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ నెల 8, ఆ తర్వాత 15, 25 తేదీల్లో వెట్‌రన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినా సాంకేతిక పరమైన కారణాల వల్ల వాయిదా పడింది. ఆదివారం కన్నెపల్లి సమీపంలోని గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని హెడ్ రెగ్యులేటరీలోని మూడు గేట్ల ద్వారా ఫోర్‌బేలోకి వదిలారు. అక్కడి నుంచి నీరు పంపుల కింద భాగంలోకి చేరుతుంది. ప్రస్తుతం పంపుహౌస్ వద్ద హడావుడి మొదలైంది. వెట్‌రన్ నిర్వహించే తేదీని మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. నీటి స్థాయిలను ఎప్పటికప్పుడు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, డీఈఈ సూర్యప్రకాశ్, మెఘా కంపెనీ ప్రతినిధులు సీజీఎం వేణుమాధవ్, పీఎం వినోద్ పర్యవేక్షిస్తున్నారు. -
25న కన్నెపల్లిలో వెట్‌రన్!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. వర్షాలు రాకముందే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్‌కు నీరందించాలంటే అత్యంత కీలకమైన మేడిగడ్డ(కన్నెపల్లి) పంపుహౌస్‌లో మోటార్ల బిగింపులో వేగం పెంచి ఈ నెల చివర, జూన్ మొదటి వారంలోగా వెట్‌రన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ప్రతినిధులు పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఈ నెల 24 లేదా 25న వెట్‌రన్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన 8 మోటార్లలో 5 మోటార్లకు దశల వారీగా వెట్‌రన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తరలింపు కన్నెపల్లి పంపుహౌస్ నిర్మాణానికి దిగువన 400 మీటర్ల దూరంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. వెట్‌రన్ చేయడానికి వేసవి కాలం కావడంతో నీటి లభ్యత తక్కువగా ఉంది. గోదావరికి అడ్డంగా తాత్కాలికంగా కాఫర్ డ్యాంను 20 రోజుల క్రితం నిర్మించారు. ఆదివారం సీఎం పర్యటన ముగిశాక కాఫర్ డ్యాం కట్టను తెంపడంతో నీటి ప్రవాహం ఫోర్‌బేకు చేరింది. సోమవారం వరకు కాఫర్ డ్యాంకు మళ్లీ అప్రోచ్‌కెనాల్ వద్ద కట్టను మూసీ వేసి వెట్‌రన్ కోసం నీటిని నిల్వ ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 2 టీఎంసీలు కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 11 మోటార్లు బిగించాలి. ఇప్పటికే 8 మోటార్లు బిగించగా, మరో 2 మోటార్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఖరీఫ్‌లో కనీసం 5 మోటార్లకు వెట్‌రన్ పరీక్షలు నిర్వహించి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఎగువకు తరలించడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఈఈ, డీఈఈ, జేఈఈలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పనుల ప్రగతిపై ఆరా తీస్తున్నారు. -
డెడ్‌లైన్ మార్చి 31
సాక్షి, భూపాలపల్లి: కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులతో పాటు గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని.. డెడ్‌లైన్ మార్చి 31లోపు పూర్తి కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. మేడిగడ్డ నిర్మాణ పనులపై అసంతృప్తి.. కాగా మేడిగడ్డ బ్యారేజీ పనులపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ముందుగా మేడిగడ్డ చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పనులను దగ్గర నుంచి పర్యవేక్షించారు. మార్చి 31లోగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎల్అండ్టీ అధికారులకు సీఎం సూచిం చారు. కొన్ని సమస్యలు నెలకొంటున్నం దున మరో 15 రోజులు గడువు పెంచాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ 15లోగా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి విన్నవించారు. మార్చి 15లోగా కరకట్ట పనులు పూర్తి చేస్తామని సీఎండీ తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రాజెక్ట్ ఉండాలని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాలి... తర్వాత కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. పంప్‌హౌస్ నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లో భాగంగా 11 మోటర్లకు గాను ప్రస్తుతం నాలుగు బిగించినట్లు వారు తెలిపారు. మార్చి 15 నాటికి మిగతా వాటిని బిగించి డ్రైరన్ నిర్వహిస్తామని వివరించారు. జూన్ నాటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని మోటార్లను బిగించి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే నదికి కాపర్ డ్యాం నిర్మించి వెట్‌రన్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి గ్రావిటీ కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. గ్రావిటీ కెనాల్ లైనింగ్, స్ట్రక్చర్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అప్రోచ్ కెనాల్లో గైడ్బండ్లు నిర్మించాలని, మట్టి పనులు పూర్తి చేయాలన్నారు. ఫ్లడ్బంకుల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. పనులు సమాంతరంగా సాగాలి... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజీ నిర్మాణంతో పాటు పంపుహౌస్, మోటార్ల ఏర్పాటు పనులన్నీ సమాంతరంగా పూర్తికావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదికి ఇరువైపులా ఉండే ఫ్లడ్ బ్యాంకుల పనులను పరిశీలించిన కేసీఆర్, మట్టిపని రివిట్మెంట్ పనులను జలాశయ మట్టందాకా పూర్తి చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కాంక్రీటు వర్క్ రోజుకు 10,000 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్‌బే, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించిన కేసీఆర్ హెడ్ రెగ్యులేటర్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను సవరించాలని సూచించారు. సముద్రమార్గం ద్వారా చెన్నై పోర్టుకు చేరుకున్న మోటార్లను తెప్పించి వెంటనే బిగించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను సీఎంఓ సెక్రటరీ ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని తెలిపారు. సీఎంను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ను టీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబం«ధించిన వినతులు అందించారు. కాళేశ్వరం నీటిని మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలకు అందించాలని కోరారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, సీఎంఓ ప్రత్యేకాధికారిణి స్మితా సభర్వాల్, ప్రాజెక్ట్ సీఈఓ నల్లా వెంకటేశ్వర్లు, ఐజీ నాగిరెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూర్లో హరీశ్‌రావు మిస్.. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు బాటలో భారీ నీటి పారుదల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2016, మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసినప్పటి నుంచి హరీశ్ ప్రాజెక్టులపైన తనదైన మార్క్ వేసుకున్నారు. సంవత్సర కాలంలో సుమారు తొమ్మిదిసార్లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు గ్రావిటీ కాల్వ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంప్‌హౌస్‌లను చుట్టేశారు. తనదైనశైలిలో ప్రాజెక్టులను రాత్రిపగలు తేడా లేకుండా పర్యటిస్తూ పనులను పరుగులు పెట్టించాడు. 2016, మే 2.. 2017, డిసెంబర్ 7న సీఎం రెండుసార్లు పర్యటించగా.. హరీశ్‌రావు ఆయనతో వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట హరీశ్‌రావు లేకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో తమ గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని.. ఈ మేరకు ఆర్అండ్ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బ్యారేజీ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను అడ్డుకోవాలని యత్నించిన కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి వాసులను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ నేటి పర్యటన.. ముఖ్యమంత్రి బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కాల్వ, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించనున్నారు. ఉదయం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వసతి గృహం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 13.02 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణించి అన్నారం బ్యారేజీ చేరుకుంటారు. మంగళవారం రోజునే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీì కాల్వ, అన్నారం బ్యారేజీలు పరిశీలించాల్సి ఉండగా.. సమయాభావం కారణంగా బుధవారానికి వాయిదా పడినట్లు కాళేశ్వరం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. -
రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం
స్పష్టం చేసిన కన్నేపల్లి రైతులు ఎకరాకు రూ.3.2 లక్షలు ఇస్తామన్న ఆర్డీవో రసాభాసగా గ్రామసభ పూర్తయిన 188 ఎకరాల సర్వే పంప్‌హౌస్ దారిలో ముల్ల కంచె వేసి నిర్వాసితులు కాళేశ్వరం : పంప్‌హౌస్ నిర్మాణానికి ఇచ్చే భూములకు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇందుకు ఒక్క రూపాయి తగ్గినా ఇంచు భూమి కూడా ఇవ్వమని కన్నేపల్లి రైతులు స్పష్టం చేశారు. పంప్‌హౌస్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 48 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 188 ఎకరాలకు సేకరణకు, పట్టా భూములు, కాస్తు, అసైన్డ్ వివరాల కోసం సర్వే చేశారు. ఈ సరే ముగియడంతో గురువారం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. మంథని ఆర్డీవో శ్రీనివాస్ భూసేకరణపై అభ్యంతరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్ కోసం ఎవరెవరి భూమి ఎంత సేకరిస్తున్నారో చదివి వినిపించారు. అనంతరం మహదేవపూర్ మండలంలో ప్రభుత్వం స్టాంప్‌ఫీజు ప్రకారం ఎకరం భూమి విలువ రూ.లక్ష ఉందని తెలిపారు. దీని ప్రకారం భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.3.2 లక్షలు ఇస్తుందని ప్రకటించారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. భూములకు ధర ప్రకటించకుండా సర్వేలు చేసి కన్నేపల్లి గ్రామాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట సేకరించిన 48 ఎకరాలకు డబ్బులు ఇచ్చి, తరువాత ధర ఎంత పెంచితే అంత ఇస్తామన్న అధికారులు, ఒక్కసారిగా ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తేనే పంప్‌హౌస్ నిర్మాణానికి సహకరిస్తామని తెగేసి చెప్పారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వారు శాంతించలేదు. దీంతో ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. సమావేశంలో సర్పంచ్ లోకుల పోశక్క, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, తహసీల్దార్ జయంత్, ఇరిగేషన్ ఈఈ ఓంకార్‌సింగ్, డీఈఈ సూర్యప్రకాశ్, ప్రకాశ్, ఏఈ వెంకట్, ఎసై ్స ఉదయ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు. పంప్‌హౌస్ దారిలో ముళ్లకంప వేసి నిరసన తగిన పరిహారం ఇవ్వడంలేదని నిర్వాసితులు పంప్‌హౌస్ రోడ్డుకు అడ్డుగా గొయ్య తవ్వి, ముళ్లకంప వేసి నిరసన తెలిపారు. ఏఎసై ్స ముకీద్ నిర్వాసితులకు నచ్చజెప్పినా వినలేదు. తమకు న్యాయం జరిగే వరకూ పనులు జరుగనివ్వమని స్పష్టం చేశారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తమకు ఇచ్చిన మాట వట్టిదేనా అని ప్రశ్నించారు. 20 రోజుల క్రితం ఎకరానికి రూ5.5 లక్షలకుపైగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కలెక్టర్‌కు నివేదిస్తా – శ్రీనివాస్, ఆర్డీవో కన్నేపల్లిలో 188 ఎకరాల సేకరణకు సర్వే పూర్తిచేశాం. భూములపై అభ్యంతరాలను నివృత్తి చేశాం. ప్రభుత్వం లావోణి, పట్టా భూములకు ఒకే రకమైన పరిహారం ఇవ్వదు. మహదేవపూర్ మండలంలో స్టాంప్‌ఫీజు ప్రకారం ఎకరానికి రూ.లక్ష ధర ఉంది. ఈవిధంగానే ఎకరానికి రూ.3.2 లక్షలు ఇవ్వనున్నాం. నిర్వాసితులుతు మాత్రం రూ.15లక్షలు కావాలని కోరుతున్నారు. కొంత మంది మేడిగడ్డ, సూరారం రైతులు ఏవిధంగా పరిహారం ఇస్తే అలాగే మాకు ఇవ్వలన్నరు. ఈవిషయాలన్నీ కలెక్టర్‌కు నివేదిస్తాం. -
పంప్‌హౌజ్ భూముల పరిశీలిలన
కాళేశ్వరం: కన్నేపల్లి వద్ద నిర్మించనున్న పంప్‌హౌజ్ కింద భూములు కోత్పోతున్న నిర్వాసితుల భూములను ఏజేసీ నాగేంద్ర, ఆర్డీవో బాల శ్రీనివాస్‌లు మంగళవారం పరిశీలించి రైతులతో చర్చించారు. రైతులు ఏజేసీతో భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన చేసేదేమీ లేక తిరిగి వెళ్ళారు. విలేకర్లతో ఏజేసీ మాట్లాడుతు రైతులను ఒప్పించిన తరువాతనే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెడుతామని తెలిపారు. అనంతరం బెగులూర్ గ్రామంలో విషజ్వరాలతో పలువురు అస్వస్థతకు గురికాగా గ్రామాన్ని సందర్శించి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ జయంత్, వీఆర్వోలు ఉన్నారు.