6వ మోటార్‌ ట్రయల్‌ రన్‌   | 6th Motor Trial Run | Sakshi
Sakshi News home page

6వ మోటార్‌ ట్రయల్‌ రన్‌  

Published Thu, Jun 20 2019 3:02 AM | Last Updated on Thu, Jun 20 2019 3:02 AM

6th Motor Trial Run - Sakshi

కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల నిర్మాణం

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో వేగం పెరిగింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో సీఎం ప్రారంభించనున్న 6వ మోటార్‌కు అధికారులు మంగళవారం అర్ధరాత్రి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మిగితా మూడు మోటార్లకు గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే.. మేడిగడ్డ వద్ద హోమశాల, అక్కడే వీఐపీలు కూర్చునేందుకు ప్రాంగణం ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ల నుంచి హోమశాలకు వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్లు నిర్మించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు కూర్చునే ప్రాంగణం పూర్తి కావచ్చింది. భోజనాలు చేసే స్థలంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వంటశాల నిర్మాణం పూర్తికావచ్చింది.  

వీవీఐపీల కోసం ఏసీ బస్సులు 
ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీవీఐపీలు హెలిప్యాడ్ల నుంచి బ్యారేజీ, పంపుహౌస్‌లకు చేరుకోవడానికి కన్నెపల్లిలో 6 క్యాంపరింగ్‌ వ్యాన్‌ బస్సు (కార్విన్‌)లను ఏర్పాటు చేశారు. వీటిలో ఏసీతోపాటు వీవీఐపీలు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సకల సౌకర్యాలు ఉన్నాయి.  

బ్యారేజీ, పంపుహౌస్‌ల్లో శిలాఫలకం రెడీ! 
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో ముఖ్య అతిథులు ఆవిష్కరించడానికి శిలాఫలకాల నిర్మాణం పూర్తి కావచ్చింది. ముగ్గురు సీఎంలతో పాటు గవర్నర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రొటోకాల్‌ సభ్యుల పేర్లు వాటిపై ఏర్పాటు చేయనున్నారు.  

రాత్రికి రాత్రే.. 
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో రాత్రికి రాత్రే అంతర్గత రోడ్లు వేస్తున్నారు. సీఎంలు, మంత్రుల కాన్వాయ్‌ వెళ్లే వీలుగా బీటీ రోడ్లు వేస్తున్నారు. ఈరోజు చూసింది.. మరునాడు కనిపించకుండా మారిపోతున్నాయి.  

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ 
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీల వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.  

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ 
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో హోమశాల, బ్యారేజీలు, ఆవలి వైపు భద్రత, కన్నెపల్లి పంపుహౌస్‌లో హోమశాల, వీవీఐపీలు, వంటశాల, క్యాంపు కార్యాలయం, అప్రోచ్‌కెనాల్, ఫోర్‌బే తదితర స్థలాల్లో భద్రతను జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్, ఏఎస్పీ సాయిచైతన్యతో కలసి పరిశీలించారు.

16 హెలిప్యాడ్‌లు సిద్ధం
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో మొత్తం 16 హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. ఇంతకు ముందు 12 మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. ప్రస్తుతం ఆ సంఖ్య 16కు చేరింది. తెలంగాణ వైపు మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో 7 నిర్మించగా, మరొకటి మహారాష్ట్ర వైపు పోచంపల్లి గ్రామంలో ఒకటి, కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 9 హెలిప్యాడ్‌ సిద్ధమయ్యాయి. మరిన్ని హెలిప్యాడ్‌లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement