రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం | expents demand Compensation | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం

Published Thu, Sep 29 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం

రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం

  •  స్పష్టం చేసిన కన్నేపల్లి రైతులు 
  • ఎకరాకు రూ.3.2 లక్షలు ఇస్తామన్న ఆర్డీవో
  • రసాభాసగా గ్రామసభ
  • పూర్తయిన 188 ఎకరాల సర్వే 
  • పంప్‌హౌస్‌ దారిలో ముల్ల కంచె వేసి నిర్వాసితులు
  •  కాళేశ్వరం : పంప్‌హౌస్‌ నిర్మాణానికి ఇచ్చే భూములకు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇందుకు ఒక్క రూపాయి తగ్గినా ఇంచు భూమి కూడా ఇవ్వమని కన్నేపల్లి రైతులు స్పష్టం చేశారు. పంప్‌హౌస్‌ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 48 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 188 ఎకరాలకు సేకరణకు, పట్టా భూములు, కాస్తు, అసైన్డ్‌ వివరాల కోసం సర్వే చేశారు. ఈ సరే ముగియడంతో గురువారం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. మంథని ఆర్డీవో శ్రీనివాస్‌ భూసేకరణపై అభ్యంతరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌ కోసం ఎవరెవరి భూమి ఎంత సేకరిస్తున్నారో చదివి వినిపించారు. అనంతరం మహదేవపూర్‌ మండలంలో ప్రభుత్వం స్టాంప్‌ఫీజు ప్రకారం ఎకరం భూమి విలువ రూ.లక్ష ఉందని తెలిపారు. దీని ప్రకారం భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.3.2 లక్షలు ఇస్తుందని ప్రకటించారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. భూములకు ధర ప్రకటించకుండా సర్వేలు చేసి కన్నేపల్లి గ్రామాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట సేకరించిన 48 ఎకరాలకు డబ్బులు ఇచ్చి, తరువాత ధర ఎంత పెంచితే అంత ఇస్తామన్న అధికారులు, ఒక్కసారిగా ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తేనే పంప్‌హౌస్‌ నిర్మాణానికి సహకరిస్తామని తెగేసి చెప్పారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వారు శాంతించలేదు. దీంతో ఆర్డీవో, ఇరిగేషన్‌ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. సమావేశంలో సర్పంచ్‌ లోకుల పోశక్క, ఉపసర్పంచ్‌ మల్లారెడ్డి, తహసీల్దార్‌ జయంత్, ఇరిగేషన్‌ ఈఈ ఓంకార్‌సింగ్, డీఈఈ సూర్యప్రకాశ్, ప్రకాశ్, ఏఈ వెంకట్, ఎసై ్స ఉదయ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు. 
     
    పంప్‌హౌస్‌ దారిలో ముళ్లకంప వేసి నిరసన 
    తగిన పరిహారం ఇవ్వడంలేదని నిర్వాసితులు పంప్‌హౌస్‌ రోడ్డుకు అడ్డుగా గొయ్య తవ్వి, ముళ్లకంప వేసి నిరసన తెలిపారు. ఏఎసై ్స ముకీద్‌ నిర్వాసితులకు నచ్చజెప్పినా వినలేదు. తమకు న్యాయం జరిగే వరకూ పనులు జరుగనివ్వమని స్పష్టం చేశారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తమకు ఇచ్చిన మాట వట్టిదేనా అని ప్రశ్నించారు. 20 రోజుల క్రితం ఎకరానికి రూ5.5 లక్షలకుపైగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.  
      కలెక్టర్‌కు నివేదిస్తా 
    –  శ్రీనివాస్, ఆర్డీవో 
    కన్నేపల్లిలో 188 ఎకరాల సేకరణకు సర్వే పూర్తిచేశాం. భూములపై అభ్యంతరాలను నివృత్తి చేశాం. ప్రభుత్వం లావోణి, పట్టా భూములకు ఒకే రకమైన పరిహారం ఇవ్వదు. మహదేవపూర్‌ మండలంలో స్టాంప్‌ఫీజు ప్రకారం ఎకరానికి రూ.లక్ష ధర ఉంది. ఈవిధంగానే ఎకరానికి రూ.3.2 లక్షలు ఇవ్వనున్నాం. నిర్వాసితులుతు మాత్రం రూ.15లక్షలు కావాలని కోరుతున్నారు. కొంత మంది మేడిగడ్డ, సూరారం రైతులు ఏవిధంగా పరిహారం ఇస్తే అలాగే మాకు ఇవ్వలన్నరు. ఈవిషయాలన్నీ కలెక్టర్‌కు నివేదిస్తాం.  
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement