సాక్షి, కాళేశ్వరం: కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా మొదటగా వీరు కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలో ప్రతీ రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి ప్రాజెక్ట్‌లపై రాజకీయం చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్‌ను కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు కల్పతరువు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన ప్రాజెక్ట్‌ను నిర్మించలేదు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు.
గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు రెండో తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందిచకపోతే 50వేల మంది రైతులతో మేము పంపులు ఆన్ చేస్తాం. బీడు భూములకు నీళ్లు అందిస్తాం. రాజకీయపరమైన నిర్ణయం వల్లనే నీటిని ఎత్తిపోయడం లేదు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు కేవలం 25 టీఎంసీలే ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్‌ల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా కాళేశ్వరం నీటి కోసం చూస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు.
ఒక్క బటన్ నొక్కితే పైన ఉన్న ఎల్‌ఎండీ, మిడ్ మానేరు సహ ఎస్‌ఆర్‌ఎస్పీ కూడా నింపొచ్చు. ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం కొట్టుకుపోతే ఏళ్లు గడిచినా ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ, కాళేశ్వరం విషయంలో రోజుల్లోనే రిపోర్టులు ఇచ్చింది. కేవలం కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతోంది. ఎలాగూ మీరంతా అనుకున్నట్టుగానే కేసీఆర్‌ను ఓడించారు. ఇంకా రైతులపై ఎందుకింత పగ. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందిపెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment