సందడే.. సందడి | Kaleshwaram Project Located In Kannepally | Sakshi
Sakshi News home page

సందడే.. సందడి

Published Fri, Jun 21 2019 1:03 PM | Last Updated on Fri, Jun 21 2019 1:03 PM

Kaleshwaram Project Located In Kannepally - Sakshi

సాక్షి, కాళేశ్వరం: ఆర్టీసీ బస్సు కూడా ఎరగని గ్రామాలవి... కానీ ఇప్పుడు అక్కడకు హెలీకాప్టర్లు రానున్నాయి.. అందుకోసం హెలీప్యాడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.. గోదావరి గలగలలు.. అక్కడక్కడా టీవీ శబ్దాలు వినిపించే మారుమూల పల్లెల్లో ఇప్పుడు భారీ మోటార్ల మోతలు నిత్యకృత్యమయ్యాయి. మూడేళ్ల కిందట మొదలైన కాళేశ్వరం మహాయజ్ఞానికి వేదికగా మారిన కన్నెపల్లి, కాళేశ్వరం గ్రామాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి.. ఎడ్ల బండ్లే దిక్కుగా ప్రయాణాలు సాగించే పల్లె వాసులు ప్రస్తుతం ఫార్చునర్‌ కార్లు, హెలీక్యాప్టర్లు, ఏసీ బస్సుల రాకతో ఓ పక్క ఉక్కిరిబిక్కిరవుతూనే మరో పక్క సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.. బయటి ప్రపంచానికి పట్టని కుగ్రామమైన కన్నెపల్లి వైపు ఇప్పుడు రాష్ట్రంతో పాటు యావత్‌ దేశం చూపు పడింది.

కాళేశ్వరం కిటకిట
ఐదు వేల జనాభా.. 800కు పైగా గడపలు ఉన్న కాళేశ్వరం గ్రామం మూడేళ్ల క్రితం ఆలయానికి వచ్చే భక్తులతో కళకళలాడేది. ఇప్పుడు ముగ్గురు సీఎంలు, గవర్నర్లు వస్తుండడంతో కాళేశ్వరం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇక్కడి సత్రాలు, గెస్ట్‌హౌస్‌లు, ప్రైవేట్‌ లాడ్జీలు వారం క్రితమే నిండిపోయా యి. దీంతో వసతి సమస్య ఎదురవుతోంది. ఈ అవస్థలు గమనించిన కాళేశ్వరం గ్రామస్తులు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. పోలీసులు, భద్రతా సిబ్బందిని అతిథులుగా భావించి తమ ఇళ్లలో ఆశ్రయం ఇస్తున్నారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాలను మించిన సందడి కనిపిస్తోంది.

మినీ ఇండియా
కన్నెపల్లి జనాభా కేవలం 800 ఉండగా ఇక్కడ పంపుహౌస్‌ నిర్మాణ పనుల్లో 3,500 మంది కార్మికులు 60 మందికి పైగా ఇంజనీర్లు ఇక్కడ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో కన్నెపల్లి ప్రాంతం మినీ ఇండియాను తలపించింది. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన కార్మికులు వందల సంఖ్యలో పంపుహౌస్‌ పనుల్లో పాలుపంచుకున్నారు. ఇక భారీ మోటార్లు బిగించేందుకు విదేశీయులు సైతం కన్నెపల్లిలో గడిపారు. మూడేళ్లుగా కన్నెపల్లిలో జరుగుతున్న పనులు ఒక ఎత్తయితే.. వారం రోజులుగా ఇక్కడ నెలకొన్న సందడి మరో ఎత్తుగా మారింది.

ప్రారంభోత్సవ వేడుకలకు ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, దేశం గర్వించతగ్గ ప్రాజెక్టు కావడంతో అటు ఏర్పాట్లు.. ఇటు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. వేల సంఖ్యలో పోలీసులు కన్నెపల్లి, కాళేశ్వరం ప్రాంతంలో మొహరించారు. బస్సు ముఖం చూడని గ్రామంలో ఇప్పుడు ఏకంగా 9 హెలిప్యాడ్లు నిర్మించారు. భారీ హోమం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ పనుల్లో వందల మంది పాల్గొంటున్నారు. దీంతో గంటల వ్యవధిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కన్నెపల్లి కళకళ
840 మంది జనాభా .... 135 గడపలు ఉన్న కన్నెపల్లి గ్రామంలో ఓటర్లు 529 మందే. 541.5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న ఈ చిన్న గ్రామం బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. 1994లో కన్నెపల్లి పంచాయతీగా ఏర్పడగా తొలిసారి 2008లో కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నీటి సరఫరా కోసం ఇక్కడ ఇన్‌టెక్‌ వెల్‌ ఏర్పాటు చేశారు. అదే సంవత్సరంలో 2009లో డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి రూ. 499 కోట్ల వ్యయంతో కాళేశ్వరం మినీ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశా రు. ఆ తర్వాత పదేళ్లకు రాష్ట్రం మొత్తం  ఇటువైపు చూస్తోంది.

రివర్స్‌ పంపింగ్‌లో గోదావరి ఇక్కడి నుంచి తొలిసారిగా వెనక్కి మళ్లనుంది. ఇక్కడ బ్యారేజీ నిర్మించేందుకు ఈ గ్రామానికి చెందిన 280 ఎకరాల భూమిని సేకరించారు. సమస్యలు లేకుండా త్వరగా భూసేకరణ జరిగింది ఇక్కడే. ప్రస్తుతం నిర్మితమైన పంపుహౌస్‌ ప్రదేశంలో మూడేళ్ల క్రితం కన్నెపల్లికి చెందిన కొన్ని ఇళ్లు, పెరడు, వాకిళ్లు ఉండేవి. ఇప్పుడక్కడ భారీ మోటార్లు, పైపులు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు వెలిశాయి. మూడేళ్ల కిందటికి ఇప్పటికి గుర్తు పట్టలేనంతగా ఈ ఊరు పరిసరాల్లో రూపు రేఖలు మారిపోయాయి.

నాకు గర్వంగా ఉంది
నాకు ఎంతగానో గర్వంగా ఉంది. సర్పంచ్‌గా నా పేరు ముగ్గురు సీఎంలు, గవర్నర్లతో పాటు శిలాఫలకంపై ఉండడం సంతోషాన్ని ఇస్తోంది. కన్నెపల్లి మొత్తం సిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. సందడి సందడిగా పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సర్పంచ్‌గా నేను ఉండడం గర్వకారణంగా ఉంది.
– ముల్కల్ల శోభ, సర్పంచి కన్నెపల్లి

మా గ్రామ రూపురేఖలు మారిపోయాయి
నేను 1970–1994 వరకు వరుసగా సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. అప్పడు కనీసం మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. 2008 నుంచి మా గ్రామ అభివృద్ధికి ఒక్కో అడుగు పడింది. జెన్‌కోతో కొంత మార్పు వచ్చింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామ రూపురేఖలు మారాయి. మేమంత భూములు ఇచ్చాం. గ్రామంలో సుమారు 280 ఎకరాల వరకు అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా మా గ్రామం గురించి మాట్టాడుతుండ్రు. టీవిల్లో రోజు మాగ్రామం, మేడిగడ్డ గురించే ఇస్తుండ్రు.
- వెన్నపురెడ్డి చిన్నమల్లారెడ్డి, మాజీ సర్పంచ్, కాళేశ్వరం, కన్నెపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement