
నీటి కష్టాలు తీరుస్తా..
బెల్లంపల్లి : వర్షాధార పంటలు సాగు చేస్తున్న రైతులు ఏటేటా ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నారు. ఒక సీజన్‌లో వర్షాలు సంమృద్ధిగా కురిస్తే మరో సీజన్‌లో చినుకు జాడ లేని పరిస్థితి ఎదురవుతోంది. చెరువుల్లో జల సిరి బోసిపోతోంది. నీరందక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. నేల తల్లిని నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏటేటా దయనీయంగా మారుతోంది.
రైతుల సాగు నీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. బెల్లంపల్లి మధ్య తరహా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు(ఎస్‌ఈ) సిరివోరు సునీల్ వీఐపీ రిపోర్టర్‌గా మారి.. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామాన్ని సందర్శించారు. అన్నదాతలతో నేరుగా మాట్లాడి వారి కష్టాసుఖాలు తెలుసుకున్నారు. రైతులతో ఎస్‌ఈ సంభాషణ ఇలా సాగింది..
ఎస్‌ఈ సునీల్ : అందరికీ నమస్కారం.
రైతులు : నమస్కారం సార్...
ఎస్‌ఈ : బాగున్నారా?
రైతులు : ఏం బాగున్నం సారూ..! వానలు లేక, పంటలు పండకపాయే. పని లేకుండా ఖాళీగా ఉంటున్నం.
ఎస్‌ఈ : ఓ.. పెద్దాయన ఏం పేరు నీది?
రైతు : నా పేరు బామండ్లపల్లి రాజయ్య సారూ..
ఎస్‌ఈ: మీ ఊరిలో ఇరిగేషన్ చెరువు ఉందా?
రాజయ్య : మా ఊళ్లున్న రాళ్లవాగు చెరువు ఇరిగేషన్ శాఖదే సారూ.
ఎస్‌ఈ : ఓకే.. చెరువు కింద నీకు పొలం ఉందా?
రాజయ్య : ఉన్నది సారూ.
ఎస్‌ఈ : ఎన్ని ఎకరాల పొలం ఉంది? పంటలేమైనా సాగు చేస్తున్నావా?
రాజయ్య : ఐదెకరాల పొలం ఉన్నది సారూ. నీళ్లు లేక ఈయేడు బీడు పోయింది.
ఎస్‌ఈ : ఏటేటా ఏం పంట సాగు చేస్తున్నావు?
రాజయ్య : చెరువు కింద అందరం వరి పంట ఏత్తం సారూ.
ఎస్‌ఈ : నీ పేరేంది పెద్ద మనిషి?
రైతు : అయ్యా.. నా పేరు ముక్క భీమయ్య సారూ..
ఎస్‌ఈ : నీకెంత పొలం ఉంది ?
భీమయ్య : రెండెకరాలున్నది. నా పొలం సుత బీడుపోయింది సారూ.
ఎస్‌ఈ : రైతుల కోసం ప్రభుత్వం చెరువులను పునరుద్ధస్తున్నది. ఈ సంగతి మీకు తెలుసా?
భీమయ్య : మాకు తెల్వది. ఎవలు సుత చెప్పలేదు సార్.
ఎస్‌ఈ : చెరువుల పునరుద్ధరణకుప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పునరుద్ధరణ జరిగాక రైతులకు నీటి సమస్య ఉండదు. (భీమయ్యతో మాట్లాడుతుండగానే పక్కనున్న అక్కలకృష్ణ స్వామి అనే రైతు జోక్యం చేసుకుని మాట్లాడారు.)
అక్కలకృష్ణ స్వామి : చెరువుల పునరుద్ధరణ అంటే ఏం చేత్తరు సారూ?
ఎస్‌ఈ : మంచి ప్రశ్న వేశావు? ఏం పేరు నీది?
అక్కలకృష్ణ స్వామి : నా పేరు అక్కల స్వామి.
ఎస్‌ఈ : చెరువు కట్ట, అలుగును పునరుద్ధరిస్తారు. పంట పొలాలకు నీరు సరఫరా అయ్యే విధంగా కాలువల నిర్మాణం చేపడతారు. చెరువులో వరద నీరు వచ్చి చేరడానికి ఫీడర్ చానల్స్‌ల పనులు చేపడతారు. చెరువు భూగర్భంలో నిండుకొని ఉన్న పూడికను పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుతారు. ( మరో రైతు కల్పించుకుని మాట్లాడారు.)
గడిగొప్పుల బానేశ్ : పూడిక మట్టిని ఎక్కడ పారబోస్తరు, పంట పొలాలల్ల పోసుకోవడానికి రైతులకు ఇత్తరా సార్.
ఎస్‌ఈ : రైతుల భాగస్వామ్యంతోనే చెరువులను పునరుద్ధరిస్తారు. పూడిక తీసిన మట్టిని పంట పొలాల్లో పోసుకోవడానికి రైతులకే అవకాశం ఇస్తారు. పూడిక మట్టి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రాజయ్య : ఆ మట్టితోని ఏం ఫాయిదా ఉంటది సారూ?
ఎస్‌ఈ: చెరువులోని మట్టిని పంట పొలాల్లో పోసుకోవడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అధిక దిగుబడి సాధించడంతో పాటు ఎరువుల వినియోగం తగ్గుతుంది. తద్వారా రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది.
అక్కలకృష్ణ స్వామి : మా ఊరి చెరువు కట్ట గజం ఎత్తు, మత్తడి ఫీట్‌న్నర ఎత్తు పెంచి పూడిక తీయించాలే సారూ.
ఎస్‌ఈ: మీరు కోరుకున్నట్టుగానే చెరువు పునరుద్ధరణ జరుగుతుంది.
భీమయ్య : అది సరే సారూ. మత్తడి నుంచి ఒర్రె దాక నీళ్లు పోకుండా కట్ట ఏమైన కడ్తరా సారూ?
ఎస్‌ఈ : తప్పకుండా, చుక్క నీరు కూడా వృథా పోకుండా చర్యలు తీసుకుంటారు.
అక్కల కృష్ణ స్వామి : చెరువు శిఖం భూమి కబ్జా అయింది. ఆ భూమి మళ్ల చెరువుల కలుపుతరా సారూ?
ఎస్‌ఈ : శిఖం భూమి ఎంత కబ్జాకు గురైంది?
అక్కలకృష్ణ స్వామి : దాదాపు 50 ఎకరాల దాక కబ్జా చేసుకున్నరు.
ఎస్‌ఈ: కబ్జా అయిన శిఖం భూమి సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
అక్కలకృష్ణ స్వామి : గట్లైతే మంచిదే సారూ.
ఎస్‌ఈ: మొత్తం చెరువు ఆయకట్టు ఎంత, ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి సాగవుతున్నది? (అప్పటికే అక్కడ చేరుకున్న గోళ్ల బాలమల్లు అనే రైతు మాట్లాడుతూ)
బాలమల్లు : చెరువు కింద 360 ఎకరాల ఆయకట్టు మా తాతలప్పుడు సాగయ్యేది. ఇప్పుడది 60 ఎకరాల దాక నీరందిస్తంది సారూ.
ఎస్‌ఈ : అలాగా? మరి నీటి తీరువా(భూమి శిస్తు) కడుతున్నారా?
రాజయ్య : కడుతున్నం సార్.
ఎస్‌ఈ : ఎన్ని ఎకరాలకు శిస్తు కడుతున్నారు?
రాజయ్య : నేను నీటి సంఘం మాజీ చైర్మన్‌ను కూడా సారూ. ఇప్పుడు ఎంత భూమి సాగవుతందో గంతకే శిస్తు కడుతున్నం.
గడిగొప్పుల బానేశ్ : బెస్తోళ్లు చెరువుల చేపలేసి పంట పొలాలకు నీళ్లు రాకుండా జేత్తండ్లు సారూ.
ఎస్‌ఈ : అలా చేయకూడదు కదా. మీరేం అడగలేదా?
గడిగొప్పుల బానేశ్ : అడిగినం సార్. చేపలు పెంచుకోవడానికి సర్కారుకు పన్ను చెల్లించిండ్లట. గందుకని బెస్తోళ్లు ఆగుతలేరు సారూ.
ఎస్‌ఈ : చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం ఉంటే మత్స్యకారులు చేపలు పెంచుకోవడానికి వీలుంది. కాని పంట పొలాలకు నీటి సరఫరా జరగకుండా అడ్డుకునే హక్కు వారికి లేదు. ఓకే మరి... వెళ్లొస్తా.
రైతులు : మంచిది సారూ...