కష్టాలు తీరుస్తా...
ఆశ్రమంలోని వృద్ధులతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు
పింఛన్లు ఇక్కడే ఇప్పించేందుకు
చర్యలు తీసుకుంటానని హామీ
సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా వృద్ధులు,
వికలాంగులతో మమేకమైన కలెక్టర్
అది మచిలీపట్నం ఈడేపల్లిలోని జెట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల శరణాలయం. అందులో కన్నబిడ్డలు లేనివారు కొందరైతే.. అయినవాళ్లు ఉండీ అనాథలుగా మిగిలినవారు మరికొందరు. రక్త సంబంధీకులు దూరంగా పెడితే అనాథలుగా మారి శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వీరిని శనివారం జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా మారి పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా ఉంటున్నారు.. ఇక్కడ సౌకర్యాలు సరిగా ఉన్నాయా.. లేదా.. భోజనం సక్రమంగా పెడుతున్నారా.. లేదా.. అంటూ అడిగి తెలుసుకున్నారు.
కొంతమంది వృద్ధులు తాము పింఛను కోసం దూరప్రాంతాలకు వెళ్తున్నామని, శరణాలయంలోనే పింఛను ఇప్పించేలా చూడాలని కోరగా.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనాథ వృద్ధులు, వికలాంగులను కలవడం, వారితో మాట్లాడటం, వారి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం రావడం తాను గౌరవంగా భావిస్తున్నానని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. శరణాలయంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, వృద్ధులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తానని హామీ ఇచ్చారు.