macilipatnam
-
కష్టాలు తీరుస్తా...
ఆశ్రమంలోని వృద్ధులతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పింఛన్లు ఇక్కడే ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా వృద్ధులు, వికలాంగులతో మమేకమైన కలెక్టర్ అది మచిలీపట్నం ఈడేపల్లిలోని జెట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల శరణాలయం. అందులో కన్నబిడ్డలు లేనివారు కొందరైతే.. అయినవాళ్లు ఉండీ అనాథలుగా మిగిలినవారు మరికొందరు. రక్త సంబంధీకులు దూరంగా పెడితే అనాథలుగా మారి శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వీరిని శనివారం జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా మారి పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా ఉంటున్నారు.. ఇక్కడ సౌకర్యాలు సరిగా ఉన్నాయా.. లేదా.. భోజనం సక్రమంగా పెడుతున్నారా.. లేదా.. అంటూ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది వృద్ధులు తాము పింఛను కోసం దూరప్రాంతాలకు వెళ్తున్నామని, శరణాలయంలోనే పింఛను ఇప్పించేలా చూడాలని కోరగా.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనాథ వృద్ధులు, వికలాంగులను కలవడం, వారితో మాట్లాడటం, వారి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం రావడం తాను గౌరవంగా భావిస్తున్నానని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. శరణాలయంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, వృద్ధులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తానని హామీ ఇచ్చారు. -
‘లెక్క’ పనిచేయలేదేం?
అభ్యర్థుల్లో అంతర్మథనం ఓడినా.. గెలిచినా... తగినన్ని ఓట్లు రాలేదు లెక్కల చిక్కులు.. అప్పుల తిప్పలు సాక్షి, మచిలీపట్నం : ఓడిపోయి ఒకరు బాధపడుతుంటే.. గెలిచి మరోకరు మదనపడుతున్నారు.. ఇది సార్వత్రిక ఎన్నికల అనంతరం కన్పిస్తున్న చిత్రం. మునుపెన్నడూ లేని విధంగా హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో అభ్యర్థులు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసిన సంగతి తెల్సిందే. ఓటు కోసం కోట్లు ఖర్చుచేసిన అభ్యర్థులు ఇప్పుడు తీరుబడిగా లెక్కల చిక్కులు, అప్పుల తిప్పలు తలుచుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఓటమి భారంతో కుంగిపోతున్న అభ్యర్థులు.... ఇప్పుడు చేసిన అప్పుల భారాన్ని తలుచుకుని కంగారు పడుతున్నారు. అప్పులు చేసినా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పరువు దక్కేది, తీరా ఓడిపోవడంతో అప్పులు తిప్పలు మిగిలాయని మూగగ రోధిస్తున్నారు. ఓడిపోయిన వారే బాధపడుతున్నారనుకుంటే పొరపాటే... ప్రధానంగా గెలిచిన అభ్యర్థులు మద్యం, ఓట్లు కొనుగోలు, ప్రచారం కోసం అంచనాలకు మించి ఖర్చుచేసిన కోట్లాది రూపాయలను తలుచుకుని గుండెలు బాదుకుంటున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులు సైతం చేసిన ఖర్చులకు తగ్గట్టు ఓట్లు రాలేదన్న లెక్కలతో బిక్కమోహం వేస్తున్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకుగా గుర్తించి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము పంచినా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్న వేదన గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను పట్టిపీడిస్తోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో పంచిన డబ్బుకు సరిపడే ఓట్లు వచ్చాయా? అనే దానిపై పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అనునయులతో ఆరా తీస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఆశలుపెట్టుకుని ఆయన పెద్ద ఎత్తున ఖర్చుపెట్టారు. తీరా ఆయన అంచనాలు తల్లకిందులు చేస్తూ తగినన్ని ఓట్లు రాకపోవడంతో చివరి రౌండ్ వరకు బోటాబోటీగానే లాక్కొచ్చారు. ఆయన ఆశలుపెట్టుకున్న మైలవరం, జి.కొండూరు అంతగా కలిసి రాలేదని ఉమా అనుయాయులు లెక్కలు చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుద్ధప్రసాద్ ఘంటసాల, చల్లపల్లి మండలాలపై పెట్టుకున్న ఆశలు అంతగా వర్కవుట్ కాలేదని అంటున్నారు. చేసిన ఖర్చులకు వచ్చిన ఓట్లకు తేడా ఉందని ఆయన అనుచరులు వాపోతున్నారు. బందరు నియోజకవర్గంలో కొల్లు రవీంద్రకు అనుకూలం అనుకున్న రూరల్ గ్రామాల్లో అనుకున్న స్థాయిలో ఓట్లు రాలలేదని, పట్టణంలో కొంత కలిసి వచ్చిందని అంటున్నారు. మచిలీపట్నం రూరల్ కొన్ని గ్రామాలపై ఆశలుపెట్టుకుని ఖర్చుచేసినా అంత ప్రయోజనం కలగలేదని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, పెదపారుపూడి మండలాలపై ఆశ వదులుకున్న టీడీపీ నేతలు గుడివాడ పట్టణం, గుడ్లవల్లేరు మండలంపై ఆశలు పెట్టుకుని డబ్బులు వెదజల్లారు. అక్కడా అనుకున్న స్థాయి లో ఓట్లు రాలకపోవడంతో ఘోరంగా పరాజయం పాలుకావాల్సి వచ్చిందని మదనపడుతున్నారు. పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాలు అంతగా అనుకూలంగా లేవని ముందుగానే టీడీపీ నేతలు గుర్తించారు. దీంతో మొవ్వ, పామర్రు మండలాలపై ఆశలుపెట్టుకుని డబ్బులు కుమ్మరించారు. తీరా అక్కడా ఫలితం లేకపోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇలా గెలిచినా, ఓడినా చేసిన ఖర్చుకు తగినన్ని ఓట్లు రాలేదన్న వేదన మాత్రం అభ్యర్థుల మదిని తొలిచే స్తోంది. -
బందరు ఎంపీగా కొనకళ్ల
రెండో పర్యాయం గెలుపు కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్ 81వేల ఓట్లకు పైగా ఆధిక్యం సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొనకళ్ల నారాయణరావు విజయం సాధించారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై కొనకళ్ల సుమారు 81వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీకరణలు ఆయనకు లాభించడంతో రెండో పర్యాయం ఎంపీగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా జరిగిన క్రాస్ ఓంటింగ్ కొనకళ్లకు బాగా లాభించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నెగ్గిన గుడివాడలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అతి తక్కువ మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పామర్రులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకే మెజార్టీ ఓట్లు వచ్చాయి. అవనిగడ్డ, బందరు, పెడన, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోను భారీగా క్రాస్ ఓటింగ్ ఎంపీకి మెజార్టీని పెంచింది. మాజీ మంత్రిగా కొలుసు పార్థసారథి ప్రాతినిథ్యం వహించిన పెనమలూరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ ఫలించి ఆయనకు భారీ మెజార్టీ తెచ్చిపెట్టేలా దోహదం చేసింది. రౌండ్ రౌండ్‌కు కొనకళ్లకు ఆధిక్యత పెరిగింది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రెండు చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా ఐదు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అన్నింటా కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ అనుకూలించిన తీరు ఇలా ఉంది. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి బోడే ప్రసాద్‌కు 31,448ఓట్లు మెజార్టీ వచ్చింది. బోడే కంటే కొనకళ్లకు తక్కువ ఓట్లు పోలవడంతో మెజార్టీ సుమారు వెయ్యి తగ్గింది. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం అంత కలిసిరాలేదు. పెనమలూరు నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ కారణంగా సారథి కంటే కొనకళ్లకు మెజార్టీ తెచ్చిపెట్టింది. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనకళ్లకు మొత్తం 1,05,105ఓట్లు రాగా, సారథికి 74,398ఓట్లు వచ్చాయి. దీంతో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనకళ్లకు 30,707మెజార్టీ వచ్చింది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 5,959ఓట్ల మెజార్టీ సాధిస్తే క్రాస్ ఓటింగ్ కారణంగా ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు మాత్రం ఏకంగా 10,300 ఓట్లు మెజార్టీ దాటింది. బందరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రకు 15,806ఓట్ల మెజార్టీ రాగా, ఎంపీగా కొనకళ్లకు 16,712ఓట్లు మెజార్టీ వచ్చింది. పెడన నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత వెంకట్రావుకు 13,683ఓట్లు మెజార్టీ రాగా ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 16,345 ఓట్లు మెజార్టీ వచ్చింది. పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన 1,069 ఓట్లు మెజార్టీతో గెలుపొందగా ఆదే నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 426ఓట్లమెజార్టీ వచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి 11,529ఓట్లు మెజార్టీతో గెలుపొందగా అక్కడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి 3,222ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్ని చోట్ల కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ అనుకూలించడంతో గెలుపు దక్కించుకున్నారు. ఎంపీ ఓట్ల లెక్కింపులో గజిబిజి గందరగోళం... మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీరు గజిబిజి గందరగోళంగా మారింది. కానూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బందరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం, పెడన. గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిర్వహించారు. ఎప్పటికప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల వివరాలు ప్రతీ రౌండ్లోనూ కాస్త ఆలస్యంగా వెల్లడించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల బాధ్యుల్లో సమన్వయలోపం కారణంగా లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా ప్రకటించలేదు. మీడియాకు ఒక గది కేటాయించి వారిని అక్కడే కట్టుదిట్టం చేయడంతో వారికి సకాలంలో సమాచారం అందక అవస్థలు పడ్డారు. అధికారులు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సమాచారం సకాలంలో ఇవ్వగలిగినా లోక్‌సభ ఓట్ల వివరాలు ఇవ్వలేకపోయారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం మోరాయించడంతో బందరు లోక్‌సభ నియోజకవర్గ ఫలితాన్ని రాత్రి పది గంటల వరకు అధికారికంగా ప్రకటించలేదు. నమ్మకంతో గెలిపించారు : కొనకళ్ల తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు అన్నారు. శుక్రవారం కానూరు సిద్థార్థ ఇజినీరింగ్ కాలేజిలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నీతివంతమైన పాలన కోరుకున్న ప్రజలు దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను కోరుకున్నారని కొనకళ్ల అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పునర్ నిర్మించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని ప్రజలు నమ్మినట్టు తేలిందని కొనకళ్ల అన్నారు. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. -
పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం
సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగుతున్న రాజకీయం అభ్యర్థులందరిదీ అదే దారి సాక్షి, మచిలీపట్నం : ముందు జనం.. వెనుక జనం.. జెండాలు పట్టుకుని జైజైలు.. నడుమ అభ్యర్థి అందరికి నమస్కరిస్తూ తనకు ఓటేసి గెలిపించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తులు ఇదీ ఎన్నికల ప్రచారంలో మన కళ్లముందు కదలాడే దృశ్యం. సీన్ కట్ చేస్తే మనకు తెలియకుండా గంప గుత్తగా ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు తెరవెనుక ప్రయత్నాలు చాలానే చేస్తారు. గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, పార్టీల ప్రముఖులు ఇలా పది ఓట్లు రాలే అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థినీ కలిసి మంత్రాంగం నెరపే ట్రెండ్ పుంజుకుంది. గతంలో రాజకీయంగా అనుభవం, వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కొందరు నేతలు మాత్రమే ఈ తరహా పద్ధతిలో రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. గతంలో కొందరు సెట్ చేసిన ఈ తరహా ట్రెండ్‌ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థీ అనుసరిస్తున్నారు. పగలు ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ఎంత అలిసిపోయినా రాత్రి వేళ ఓపిక తెచ్చుకుని గుట్టుచప్పుడు కాకుండా పలు ప్రాంతాల్లో పర్యటించి పలువురిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను పలువురు అభ్యర్థుల గెలుపుకోసం పట్టుదలగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహిస్తునే మరోవైపు శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే తాపత్రయంతో ఎన్నికల ప్రచారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతకంటే ఎక్కువగా రాత్రివేళ సమీకరణలకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పార్టీల వారీగా ఓటర్లు, కార్యకర్తలు, అభిమానులు డిసైడ్ అయిపోవడంతో తటస్థుల ఓట్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఇందుకోసం కీలకమైన తటస్థ ఓటర్లను రాత్రివేళ కలిసి వారితో గంటల కొద్దీ గడిపి తమ గెలుపుకోసం వారు పాటుపడేలా మాట తీసుకుంటున్నారు. మరోవైపు ఎదుటి పార్టీల్లో అసంతృప్తులను, అసమ్మతిని ఎప్పటికప్పుడు డేగ కళ్లతో పసిగడుతూ వాటిని తమకు అనుకూలంగా తిప్పుకొనేలా అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీల్లో అసమ్మతి వాదులకు సొంత పార్టీ నేతలు రాత్రివేళ వెళ్లి బుజ్జగింపులు చేస్తుంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు సైతం రాత్రివేళే వారిని తమ దారికి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక వ్యక్తులు, ప్రముఖ నేతలను పగటిపూట కలిస్తే అనుమానాలకు అవకాశం ఉంటుందని, తద్వారా ఓటు బ్యాంక్ చెదిరిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అభ్యర్థులు రాత్రి మంత్రాంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నాకు మద్దతు ఇచ్చి నా గెలుపు కోసం మీ వంతు సాయం అందిస్తే ఎప్పుడూ మీకు అండగా ఉండి ఏ పని కావాలన్నా చేసిపెడతానంటూ అభ్యర్థులు వ్యక్తిగత హామీలు ఇస్తూ గెలుపు మంత్రం కోసం తపిస్తున్నారు. మొత్తానికి అభ్యర్థులు పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం ముమ్మరం చేయడంతో ఎవరి ధీమాలో వారు ఉండటం కొసమెరుపు. -
శివారు చేలు...నైస్తున్నాయ్
సాగునీరందక అన్నదాత కష్టాలు పది రోజులుగా విడుదల కాని నీరు దిగుబడి తగ్గిపోతుందంటున్న రైతులు శివారు ప్రాంతాల్లో చేలన్నీ నోళ్లు తెరుస్తున్నాయ్.. పదిరోజులుగా పొలాలకు నీరందక.. పంట దక్కే పరిస్థితి కానరాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడులు కూడా రాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : దాళ్వా సాగులో అన్నదాతకు అన్నీ కష్టాలే మిగులుతున్నాయి. సాగునీరు సక్రమంగా అందకపోవటంతో ఎన్నో ఆశలతో వరిసాగు చేసిన రైతులకు నిరాశే మిగిలే పరిస్థితి దాపురించింది. సాగునీటిని విడుదల చేయండి మహాప్రభో అంటూ రైతులు చేస్తున్న మొర నీటి పారుదల శాఖాధికారులకు పట్టడం లేదు. రేపు, మాపు అంటూ అధికారులు చెప్పటమే తప్ప కాలువల్లో నీటిమట్టం పెరిగిన దాఖలాలు లేవు. శివారు ప్రాంతాల్లోని పొలాల్లో పైరు ఎండిపోతున్నా చుక్కనీరు విడుదల చేసేందుకు అధికారులు చొరవ చూపకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో రబీలో వరిసాగు జరగాల్సి ఉంది. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా 2.65 లక్షల ఎకరాల్లోనే వరిసాగు జరిగింది. నాలుగు రోజుల పాటు నీరు ఇవ్వటం, పది రోజుల పాటు ఇవ్వకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సకాలంలో సాగునీరు విడుదల కాకుంటే ఈ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజులుగా విడుదల కాని నీరు... సముద్రతీరంలోని కోడూరు, నాగాయలంక, బందరు, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో దాళ్వా పంటను సాగు చేశారు. కోడూరు, నాగాయలంక మండలాలకు కేఈబీ కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. కోడూరు మండలంలోని ఊటగుండం, మందపాకల, పోటుమీద గ్రామాలకు కాలువల ద్వారా సక్రమంగా నీరు అందకపోవటంతో పొలాలు నెర్రెలిచ్చాయి. బుధవారం నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ గంగయ్య ఊటగుండం గ్రామానికి వచ్చారు. అక్కడున్న పరిస్థితులను చూసి.. పొలాలు నెర్రెలిచ్చి కనపడటంతో మారు మాట్లాడకుండా వెళ్లిపోయారని రైతులు చెబుతున్నారు. గురువారం కోడూరు ప్రధాన కాలువలో కొంతమేర నీటి మట్టం పెరిగినా శివారు ప్రాంతాలకు ఇంకా నీరు చేరలేదని ఊటగుండం, పోటుమీద గ్రామాల రైతులు చెబుతున్నారు. బందరు మండలంలోని పెదయాదర, తుమ్మలచెరువు, తుమ్మలపాలెం, వాడగొయ్యి, చిన్నాపురం తదితర ప్రాంతాలకు 9/8, 9/7, 9/6, 9/5, 9/3 కాలువల ద్వారా సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. ఈ కాలువలన్నింటికి తొమ్మిదో నంబరు ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల కావాల్సి ఉంది. గత పది రోజులుగా ప్రధాన కాలువలో నీటి మట్టం పడిపోవటంతో అన్ని గ్రామాల్లోని పొలాలూ నెర్రెలిచ్చి దర్శనమిస్తున్నాయి. అధికారులకు రైతులు ఫోన్ చేసి సాగునీరు విడుదల చేయాలని కోరితే సాయంత్రానికి కాలువ మట్టం పెరుగుతుందని చెప్పటమే తప్ప ఆచరణలో జరగటం లేదని రైతులు వాపోతున్నారు. పది రోజుల పాటు పొలానికి నీరు అందకుంటే ఈ ప్రభావం దిగుబడిపై పడి ఖర్చులు కూడా రావని రైతులు చెబుతున్నారు. బంటుమిల్లి మండలంలోని సాతులూరు, ముంజులూరు, పెదతుమ్మిడి గ్రామాల్లో సాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకుల వద్ద ఐదు అడుగుల నీటి మట్టం ఉంటే శివారు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకుల వద్ద కేవలం మూడడుగుల నీటి మట్టం ఉండటంతో చివరి భూములకు సాగునీరు అందటం లేదు. కృత్తివెన్ను మండలంలోని గరిసిపూడి, చందాల, దోమలగొంది, లక్ష్మీపురం, చినపాండ్రాక తదితర గ్రామాల్లో పొలాలు నెర్రెలిచ్చాయి. ప్రధాన కాలువల్లోనే నీటి మట్టం తగ్గిపోవటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజన్లను వాడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా మళ్లిస్తుండటంతో దిగువకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఎగువ ప్రాంతాల రైతులు నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బందిని తమ దారిలోకి తెచ్చుకుని ప్రధాన కాలువలకు అడ్డుకట్టలు వేసి నీటిని దిగువకు వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు చిరుపొట్ట, పొట్టదశలో ఉందని ఈ సమయంలో పైరుకు నీరు అందకుంటే కంకులు లోపలే అవిసిపోతాయని రైతులు చెబుతున్నారు. దాళ్వాకు ఎకరానికి ఇప్పటికే రూ.15 వేలకు పైగా ఖర్చు చేశామని నీరు విడుదల చేయకుంటే ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆవేదన చెందుతున్నారు. -
మున్సి‘పోల్స్’ రిజర్వేషన్లు ఖరారు
కేటాయింపులు ఇలా... మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట, గుడివాడ.. అన్ రిజర్వుడు నూజివీడు.. జనరల్ మహిళ ఉయ్యూరు, నందిగామ.. బీసీ జనరల్ తిరువూరు.. ఎస్సీ మహిళ మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని పురపాలక సంఘాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సమీర్‌శర్మ జీవో నంబరు 94ను శనివారం విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపటంతో పురపాలక సంఘాల్లో చైర్మన్ పదవికి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట, గుడివాడ పురపాలక సంఘాలను అన్ రిజర్వుడు చేశారు. నూజివీడు పురపాలక సంఘాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఉయ్యూరు నగర పంచాయతీని బీసీ జనరల్‌కు, తిరువూరు నగర పంచాయతీని ఎస్సీ మహిళకు, నందిగామ నగర పంచాయతీని బీసీ జనరల్‌కు కేటాయించారు. 2011 డిసెంబర్ 28న ఉయ్యూరు, తిరువూరు, నందిగామ మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడుచోట్ల పాలకవర్గాలను మొట్టమొదటి సారిగా ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంది. మూడున్నరేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే.. మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, పెడన, జగ్గయ్యపేట మునిసిపాలిటీలు మూడు సంవత్సరాల ఐదు నెలలు (41 నెలలు)గా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. వాటి పదవీ కాలం 2010 సెప్టెంబరు 29 నాటికి ముగిసింది. అప్పటి నుంచి పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉరుకులు పరుగులు... పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని తీర్పు -
నారీ భేరి
సీడీపీవోలకు సమ్మె నోటీసులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు పల్స్‌పోలియో విధులకు సైతం దూరం జిల్లాలో 7,400 మంది కార్యకర్తలు, సహాయకులు అంగన్వాడీలు మూతపడితే బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పస్తులే దాదాపు 1.35 లక్షల మందిపై ప్రభావం అమ్మలాంటి మనసు ఆక్రోశిస్తోంది.. అన్నం పెట్టిన చేయి పిడికిలెత్తింది.. చాలీచాలని జీతాలతో కడుపు రగిలి హక్కుల సాధన కోసం సమ్మె బాట పట్టింది.. అంగన్ వాడీల్లో మోగించిన నారీ భేరి ఆదివారం ్చనుంచి ఉధృతం కానుంది. వెరసి జిల్లాలోని 7,400 మంది కార్యకర్తలు, హెల్పర్లు నిరవధిక సమ్మెకు దిగడంతో 3,359 అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలో సుమారు 1.35 లక్షల మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పస్తులు తప్పని పరిస్థితి దాపురిస్తోంది. సాక్షి, మచిలీపట్నం : దాదాపు 37 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం)ని ప్రభుత్వం రెగ్యులర్ శాఖగా గుర్తించకుండా ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడంపై అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు, హెల్పర్లకు అరకొర జీతాలతో జీవనం కష్టంగా మారిందని, మరోవైపు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతహస్తం పథకంతో పని గంటల భారం పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ప్రైవేటీకరణ యత్నాలు నిలుపుదల చేయాలని, తమ జీతాలు పెంచాలని తదితర పది డిమాండ్లతో జిల్లాలో ఈ నెల 17 నుంచి 22 వరకు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆదివారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల (సీడీపీవో)కు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శనివారం సమ్మె నోటీసులతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు.. ఈ నెల 23 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న కార్యకర్తలు, హెల్పర్లు తాము పనిచేసే అంగన్వాడీ కేంద్రాలకు శనివారం నుంచి తాళాలు వేశారు. 7,400 మంది ఆందోళన బాట పట్టడంతో జిల్లాలోని 3,559 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోకపోతే వీటిపై ఆధారపడిన 32 వేల 119 మంది గర్భిణులు, 32 వేల 560 మంది బాలింతలు, 70 వేల మంది పిల్లలకు పస్తులు తప్పవు. మొత్తం లక్షా 34 వేల 679 మందికి పౌష్టికాహారం అందకుండా పోతోంది. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు తాళాలు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణకుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా గ్రామ సమాఖ్య సభ్యులతో గాని, తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో గాని అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పల్స్‌పోలియో విధులకు దూరం.. జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో విధులకు సైతం తాము హాజరయ్యేది లేదంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్స్‌పోలియో కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సహకారం లేకపోవడం ఇబ్బందికరమే. ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంఅండ్‌హెచ్‌వో) సరసిజాక్షిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆదివారం సెలవు రోజు కావడంతో ఉపాధ్యాయులను పల్స్‌పోలియో కార్యక్రమానికి ఉపయోగించుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)ని కోరినట్టు చెప్పారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా జిల్లాలోని నర్సింగ్ విద్యార్థినులు, ఐకేపీ మహిళల సేవలను ఉపయోగించుకుంటామని ఆమె వివరించారు. డిమాండ్లు ఇవీ.. అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు రూ.4,400 వేతనంగా ఇస్తున్నారు. దాన్ని రూ.12,500 కనీస వేతనంగా చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వాలి. పింఛను సౌకర్యం కల్పించాలి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఐటీసీ సంస్థలు జోక్యం చేసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి. ప్రైవేటీకరణ ఆపాలి. ఐకేపీ జోక్యాన్ని నివారించాలి అమృతహస్తం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. దీన్ని నిర్వహిస్తున్న వర్కర్లకు రూ.2 వేలు, హెల్పర్లకు వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇవ్వాలి ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేసి పటిష్టంగా అమలు చేయాలి. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలి బీఎల్ఓ విధుల నుంచి అంగన్వాడీలను మినహాయించాలి పెంచిన అంగన్వాడీ సెంటర్ల అద్దెలు ఎలాంటి షరతులూ లేకుండా అమలు చేయాలి ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి దరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు, కట్టెల బిల్లులను పెంచాలి వంటకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో సరఫరా చేయాలి -
‘అనూహ్య’ కేసులో వీడని మిస్టరీ
నెల రోజులైనా సా..గుతున్న దర్యాప్తు 14 పోలీస్ బృందాల గాలింపు నేటికీ నిందితులను గుర్తించని వైనం పాలకుల తీరుపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోతోంది.. కుమిలి కుమిలి గుండె అవిసిపోతోంది.. కంటికి నిద్ర రావటం లేదు.. గొంతులో ముద్ద దిగటం లేదు.. కన్న కూతుర్ని కర్కశంగా హత్య చేసిన కిరాతకుల కోసం నిరీక్షణ నిరాశగా మారుతోంది.. సత్తువ సన్నగిల్లుతున్నా మరుగుతున్న నెత్తురు మాత్రం కేంద్ర, మహారాష్ట్ర పాలకుల తీరుపై మండిపడితోంది.. ఇది బందరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎస్తేర్ అనూహ్యను కన్నవారి కడుపుకోత. సాక్షి, మచిలీపట్నం : శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23) కన్నవారికి, ఉన్న ఊరికి దూరమై బుధవారంతో నెల రోజులు గడిచింది. ఆమె హత్యోదంతం వెలుగు చూసి 16 రోజులు దాటింది. అయినా ఘనత వహించిన మహారాష్ట్ర పోలీసులు ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయారు. రోజుకో కథనం ప్రచారం జరుగుతున్నా వాటిని కొట్టిపారేస్తున్న ముంబై పోలీసులు ఈ కేసులో మిస్టరీని ఛేదించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ప్రభుత్వాల స్పందన నామమాత్రం... క్రిస్మస్ వేడుకల కోసం బందరు వచ్చిన అనూహ్య గత నెల 4న ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఆచూకీ కనిపించకపోవడం, తండ్రి ప్రసాద్, బంధువులు ముంబై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గత నెల 16న కంజుమార్గ్ ప్రాంతంలో అనూహ్య విగతజీవిగా కనిపించింది. ఆమెను అత్యంత దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత కూడా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల స్పందన నామమాత్రమే. పట్టించుకోని సీఎం, కేంద్ర హోం మంత్రి... ఈ కేసులో మిస్టరీని ఛేదించి నిందితులను పట్టుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర హోం మంత్రి షిండేలను అనూహ్య తండ్రి ప్రసాద్ కలిసినా ఫలితం లేకపోయింది. హోం మంత్రి షిండే సరిగా స్పందించలేదని ఆయన అప్పట్లో ఆవేదన వెలిబుచ్చారు. కొద్దిరోజుల క్రితం బిషప్ గోవాడ దైవాశీర్వాదం నేతృత్వంలోని క్రైస్తవ ప్రతినిధి బృందం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడతానని చెప్పిన సీఎం అటు తరువాత ఆ విషయాన్నే పట్టించుకోలేదు. దర్యాప్తులో 14 పోలీస్ బృందాలు.. నిందితులను పట్టుకోలేదు.. అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తు కొండను తవ్వుతున్నట్టు ఉంది. ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు 14 ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిలో ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో ఒక బృందం గత మూడు రోజులుగా బందరులో దర్యాప్తు చేస్తోంది. రెండు బృందాలు హైదరాబాద్‌లో దర్యాప్తు చేస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్లను, అనూహ్య స్నేహితులను, అనుమానితులను పోలీసులు విచారించారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌ను కూడా విచారణ చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను తేల్చిచెప్పాడు. మరోవైపు ముంబైలో క్యాబ్ డ్రైవర్లు, ఆఫీసులో పనిచేసేవారు.. తమకు విరోధం ఉన్నవారిని ఈ కేసులో ఇరికించేలా పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు కూడా చేసినట్టు సమాచారం. కేసులో ఎటువంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్ నుంచి సేకరించిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పుటేజ్‌లో అనూహ్యను అనుసరించిన ఆగంతకుడు బందరు, హైదరాబాద్‌లకు చెందినవాడా అనే కోణంలో అతని ఫొటోలను పలు ప్రాంతాలకు పంపించి ప్రత్యేక బృందాలతో ఆరా తీస్తున్నారు. ఆగంతకుడి ఫొటోను ఆధార్ కార్డు ద్వారా పోల్చి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి సమీపంలోను, ఆఫీసులోను ఎవరితోనైనా అనూహ్యకు విరోధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దృష్టి పెట్టారు. అనూహ్యకు సంబంధించిన స్నేహితులు, బంధువులు, ఆఫీసులోని వారు, ఇంటి చుట్టుపక్కల వారి వివరాలు, ఫోన్ నంబర్లను ముంబై పోలీసులు సేకరించారు. దీంతో అనూహ్య సెల్ కాల్ లిస్ట్‌లో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు అనూహ్య పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు ఈ కేసులో కీలకం కానున్నాయి. ‘అనూహ్య’ కేసులో మలుపులు... జనవరి 4న విజయవాడ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి పయనం 5న ముంబైలో రైలు దిగిన అనూహ్య అదృశ్యం అదేరోజు ఆమె తండ్రి ప్రసాద్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు వారి సూచన మేరకు బంధువుల సాయంతో ముంబై రైల్వే పోలీసులకు అదేరోజు ఫిర్యాదు మీరే వెతుక్కోండి.. అంటూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో అనూహ్య తండ్రి ప్రసాద్, బంధువుల సాయంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు 9న అనూహ్య సెల్ సిగ్నల్ కంజుమార్గ్ ప్రాంతంలో గుర్తింపు 16న అదే ప్రాంతంలో అనూహ్య మృతదేహం లభ్యం అదేరోజు కేసు నమోదు చేసిన ముంబైలోని కంజూర్ ప్రాంత పోలీసులు 17న అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆమె తండ్రి ప్రసాద్ నుంచి డీఎన్ఏ నమూనా సేకరించిన ముంబై వైద్యులు 18న బందరులో అనూహ్య అంత్యక్రియలు, హత్యకు నిరసనగా బంద్ నిర్వహించారు. 21న ఈ కేసులో న్యాయం కోసం ఉద్యమించేందుకు బందరులో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు 24న న్యాయం కోసం హోం మంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి ప్రసాద్ 27న అనూహ్య కేసులో న్యాయం కోసం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా మోహన్‌దాస్‌కు వైఎస్సార్సీపీ నాయకుల విజ్ఞప్తి 31న సీఎం కిరణ్‌ను కలిసిన బిషప్ గోవాడ దైవాశీర్వాదం నేతృత్వంలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఫిబ్రవరి 1న ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు అనూహ్యను ఒక ఆగంతకుడు వెంబడిస్తున్నట్టు ఉన్న అనుమానిత దృశ్యాల సేకరణ 3న ముంబైలోని కంజూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు బందరు వచ్చి దర్యాప్తు చేపట్టారు. 4న కూడా దర్యాప్తు కొనసాగింది. 5న అఖిలపక్షం ఆధ్వర్యంలో బందరులో మరోమారు బంద్ -
కస్సుబస్సు..
ఆర్టీఏ వర్సెస్ ప్రైవేటు ఆపరేటర్లు పట్టుబిగిస్తున్న రవాణా శాఖ అధికారులు సడలించకుంటే పర్మిట్లకు ససేమిరా అంటున్న ఆపరేటర్లు జిల్లాలో ఇప్పటికే 228 బస్సులపై కేసులు 65 బస్సులు తిప్పలేమంటూ ఆపరేటర్ల స్టాపేజీ నోటీసులు ప్రభుత్వ ఆదాయంపై నీలినీడలు నిబంధనలను గాలికొదిలి రోడ్లపై పరుగులు తీస్తున్న ప్రైవేటు బస్సులకు రవాణా శాఖ అధికారుల తనిఖీలు బ్రేకులు వేస్తున్నాయి. ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు పట్టు బిగిస్తుండటంతో ప్రైవేటు ఆపరేటర్లు కస్సుబుస్సులాడుతున్నారు. ఇలాగైతే ఆర్టీఏ అధికారులు దారికొచ్చేలా లేరని భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యూహరచన చేశారు. సాక్షి, మచిలీపట్నం : పాలెం వద్ద అక్టోబర్ 30న జరిగిన దుర్ఘటనలో ప్రైవేటు ఓల్వో బస్సు ప్రయాణికులు 45 మంది సజీవదహనమవడంతో చలనం వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ అప్పటినుంచి ప్రైవేటు బస్సులపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసం వసూలు చేస్తోంది. ఇదంతా ఆరంభశూరత్వమే అనుకున్నా రానురానూ అధికారులు పట్టు బిగించడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇబ్బందుల్లో పడ్డారు. రాష్ట్ర, జాతీయ పర్మిట్ ఉన్న బస్సులు జిల్లాలో 222 ఉండగా, వాటినే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీమళ్లీ తిప్పుతుండటంతో తనిఖీల్లో భాగంగా 228 కేసులు నమోదు చేశారు. నిబంధనలివీ... స్టేజి క్యారేజ్ (ఏ ప్రాంతంలోనైనా బస్సు ఎక్కించుకునే) అనుమతి ఆర్టీసీ బస్సులకు మాత్రమే ఉంది. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్ట్ క్యారేజ్ (ఒక చోట నుంచి మరొకచోటకి) మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేటు బస్సులో వెళ్లేవారంతా ఒకేచోట ఎక్కి మరోచోట మాత్రమే దిగాలి. ప్రయాణికుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్ల వివరాలతో పాటు, బస్సు పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవర్ డ్రైవింగ్ లెసైన్స్ తదితరాలన్నీ కచ్చితంగా ఉండాలి. ఈ నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ అడ్డరోడ్డు, గరికిపాడు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సుల తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. క్వార్టర్ పర్మిట్‌కు ఎసరు.. జిల్లాలో స్టేట్ పర్మిట్ ఉన్నవి 177, ఆలిండియా పర్మిట్ తీసుకున్నవి 45 బస్సులు ఉన్నాయి. ఆర్టీఏ అధికారుల దాడుల నేపథ్యంలో 65 బస్సులు తిప్పలేమని ప్రైవేటు ఆపరేటర్లు స్టాపేజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో క్వార్టర్ పర్మిట్ రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో పర్మిట్లు ఎందుకు చెల్లించలేదని మరో 25 బస్సులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 222 బస్సులకు ఈ నెలలో రావాల్సిన పర్మిట్ ఆదాయం మొత్తం సుమారు 2 కోట్ల 54 లక్షల రూపాయల్లో చాలావరకు గండిపడే అవకాశముంది. స్టేట్ పర్మిట్ బస్సులో ఒక్కో సీటుకు రూ.2,625, నేషనల్ బస్సులో ఒక్కో సీటుకు రూ.3,625 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో బస్సుకు స్టేట్ పర్మిట్‌కు రూ.1.05 లక్షలు, నేషనల్ పర్మిట్‌కు రూ.1.45 లక్షలు మూడు నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ వరకు మూడు నెలల కాలపరిమితి ముగియగా, జనవరి నెలాఖరులోగా తిరిగి పర్మిట్ మొత్తాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆదాయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రైవేటు బస్సులకు పర్మిట్ల చెల్లింపులో జాప్యం జరగడంతో వాటి వసూళ్లకు వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించాల్సిందే... ప్రైవేటు ఆపరేటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కేసులు నమోదు చేస్తాం. వాస్తవానికి ఆర్టీసీ బస్సులకు మాత్రమే స్టేజ్ క్యారేజ్‌గా అనుమతి ఉంది. ప్రైవేటు బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్‌లు మాత్రమే వెళ్లాలి. వ్యక్తులుగా టిక్కెట్టు తీసుకుని ప్రయాణించేవారు ఆర్టీసీలోనే రాకపోకలు సాగించాలి. కాంట్రాక్టుకు మాట్లాడుకుంటే ప్రైవేటు బస్సులు ఉపయోగించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజ్‌లుగా నడిపే ప్రైవేటు బస్సులపై కేసులు కడతాం. క్వార్టర్ పర్మిట్ తీసుకోని బస్సులకు నోటీసులు ఇస్తున్నాం. - శివలింగయ్య, డీటీసీ -
స్వధర్మ సంస్థాపనార్థాయ..!
రూ.1.59 కోట్ల అభివృద్ధి నిధుల పంపకానికి పందేరం పనుల కోసం వర్గపోరు కాంగ్రెస్, టీడీపీ అనుయాయులకే అవకాశం! నేడు ఖరారు కానున్న టెండర్లు సాక్షి, మచిలీపట్నం : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పనులు చేసి ప్రజలను బుట్టలో వేసుకుందామనుకున్న అధికార పార్టీ పాచిక పారడంలేదు. అభివృద్ధి పనుల మాటెలా ఉన్న టెండర్లు దక్కించుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు పంతాలకు పోతున్నారు. ఫలితంగా పెడన మున్సిపాలిటీలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నిధులు, పనుల పంపిణీ వివాదం కొలిక్కిరావడం లేదు. పనుల విషయంలో సాగుతున్న వివాదంపై ఇటీవల ‘పంచుకుందాం... రా’ అనే శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను కొంతకాలం సాగదీసి పార్టీలో వివాదాలను సద్దుమణిగేలా చేయాలన్న మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఎత్తుగడ ఫలించడం లేదు. రెండు పర్యాయాలుగా టెండర్లకు గడువుపెంచుతూ వచ్చిన అధికారు లు రూ.1.59కోట్ల అభివృద్ధి పనులకు మంగళవారం టెండర్లను ఖరారు చేయనున్నారు. లోపాయికారీ ఒప్పందాలు? పెడన మున్సిపాలిటీలో పనుల పంపకం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని పనులు దక్కించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు లోపాయికారీ ఒప్పందాలకు వచ్చినట్టు సమాచారం. పనుల్లో టీడీపీకి వాటా ఇవ్వడాన్ని పెడన కాంగ్రెస్‌లో మరో వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బందరుకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు వైఎస్సార్సీపీకి అనుకూలమనే సాకుతో వారికి ఈ టెండర్లు దక్కకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్ల వేస్తున్నట్టు సమాచారం. బందరుకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు పెడన మున్సిపాలిటీలో చేపట్టే పనులకు టెండర్లు వేశారు. వాటిని ఖరారు చేస్తే వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండేవారికి మేలు కలుగుతుందన్న దుగ్ధతో ఏకంగా అ పనులనే రద్దు చేసేందుకు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వైఎస్సార్సీపీకి అనుకూలురనే సాకుతో బందరుకు చెందిన కాంట్రాక్టర్లకు దక్కకుండా మంచినీటి పైపులైను పనులను టెండర్ల నుంచి తొలగించినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపాదించిన రియల్ ఎస్టేట్‌కు వెళ్లే రోడ్డు, గతంలో వేసిన రహదారిపైనే మరో రోడ్డు వేసేందుకు బంగ్లా స్కూల్ రోడ్డు, నాలుగో వార్డులో ఉన్న రోడ్డు వంటి ప్రతిపాదనలు టెండర్లలో అలానే ఉంచడం గమనార్హం. 5, 10 వార్డుల్లో వివాదంలో ఉన్న రోడ్లు కూడా ప్రతిపాదించారు. అవుట్లెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో సుమారు రూ.7 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు చేయడం శోచనీయం. చక్రం తిప్పుతున్న ముఖ్య అనుచరుడు... పెడన మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనుల రాజకీయంలో కీలకనేత ముఖ్య అనుచరుడు చక్రం తిప్పుతున్నారు. ఆయా కాంట్రాక్టర్ల నుంచి పలు పనులకు కేటాయించిన నిధుల్లో ఐదు శాతం వసూళ్లు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ పనులను కట్టబెట్టేందుకు.. బందరు, పెడన కాంట్రాక్టర్ల నడుమ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు ఆ ముఖ్య అనుచరుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సూచన మేరకు రెండు పర్యాయాలు వాయిదాలు వేస్తూ వచ్చారు. మున్సిపల్ అధికారులు సైతం టెండర్లు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నేతల ఒత్తిడిని పట్టించుకోకుండా తమ అనుభావాన్ని రంగరించి టెండర్ల ప్రక్రియను గడువు పొడిగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు టెండర్ల ఖరారు గడువు సమీపించడంతో అధికార పార్టీలో వివాదాలు రాజుకుంటున్నాయి. -
రికవరీ హుళక్కేనా?
‘ఐకేపీ’ బాధితుల గగ్గోలు లెక్క తేల్చింది రూ.51.15 లక్షలు స్వాహా సొమ్ము రూ. 90 లక్షలు? దర్జాగా తిరుగుతున్న స్వాహారాయుడు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : బందరు మండలంలో ఇందిరా క్రాంతి పథంలో చోటుచేసుకున్న సొమ్ముస్వాహాకు సంబంధించిన నిధుల రికవరీలో సంబంధిత ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తమ పని అయిపోయిందనిపించారు. నిధుల స్వాహాలో కీలకసూత్రధారి చుట్టం చూపుగా జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. లక్షలాది రూపాయల సొమ్ము స్వాహా జరుగుతున్నట్లు తెలిసినా పై అధికారులకు సమాచారం అందించలేదని బందరు మండల ఇందిరాక్రాంతిపథం ఏపీవో ఉద్దండి వీరరాఘవయ్యను, మరో మహిళా ఉద్యోగిని అధికారులు ఈనెల 10వ తేదీ ఉద్యోగం నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇందిరా క్రాంతి పథం సొమ్ము పక్కదారి పడుతున్న విషయంపై గత ఏడాది జనవరి నెలలో సాక్షి ‘‘అమ్ ఆద్మీ బీమా సొమ్ము స్వాహా’’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించడంతో అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి విచారణకు ఆదేశించారు. దాదాపు తొమ్మిది నెలల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో బందరు మండలంలో ఆమ్ఆద్మీ బీమా యోజన పథకంలో రూ. 51.15 లక్షల సొమ్ము స్వాహా జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే వాస్తవంగా స్వాహా జరిగిన సొమ్ము రూ. 90లక్షలకు పైగానే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్వాహా జరిగిన సొమ్ము మొత్తాన్ని లెక్కల్లో చూపారా లేదా అనే ప్రశ్నలు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది నుంచే వ్యక్తమవుతున్నాయి. నిధుల స్వాహాపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ వహీదున్నీసా గతేడాది నవంబరు 5వ తేదీన ఫిర్యాదు చేశారు. మండల సమాఖ్యకు వచ్చిన నగదును బందరు మండలంలో ఐకేపీ విభాగం లో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎం.జీవన్‌బాబు తన సొంత ఖాతాలోకి మార్చుకుని నిధులు స్వాహా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసిన పోలీసులు జీవన్‌బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్‌పై వచ్చాడు. ఎలా జరిగిందంటే.... బందరు మండలం ఇందిరా క్రాంతి పథంలో ఎకౌంటెంట్‌గా పనిచేసిన జీవన్‌బాబు మండల సమాఖ్యకు వచ్చిన నిధులను ఇండియన్ బ్యాంకులో తన పేరుతో ఉన్న ఖాతాకు మార్చుకున్నాడు. బతికి ఉన్న వారిని చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేయడమే కాకుండా...వాస్తవంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తెలియకుండా వేరే వ్యక్తులతో సంతకాలు చేయించి అమ్ ఆద్మీ బీమా సొమ్ము లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్నాడు. బందరు మండల ఇందిరా క్రాంతి పథంలో జరుగుతున్న అక్రమాలపై అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి విచారణాధికారిగా ఏపీడీ శ్రీధర్‌రెడ్డిని నియమించారు. దీంతో తీగలాగితే డొంక కదిలింది. మండల ఇందిరా క్రాంతి పథం ఎకౌంటెంట్ జీవన్‌బాబు 2012 సెప్టెంబరు 13వ తేదీన రూ. 6.30 లక్షలు, 2013 జనవరి 11వ తేదీన రూ. 6.25 లక్షలు, మార్చి 18వ తేదీ రూ. 8.60 లక్షలు, ఏప్రిల్ 13వ తేదీన రూ. 13.50 లక్షలు, మే 4వ తేదీన రూ. 4 లక్షలు, జూన్ 6వ తేదీన రూ. 3.50 లక్షలు, ఆగష్టు 7వ తేదీన రూ. 2 లక్షలు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఉన్నతాధికారుల విచారణలోనూ జీవన్‌బాబు తాను నిధులు దిగమింగినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇన్ని ఆధారాలు ఉన్నా, సొమ్ము స్వాహ జరిగినట్లు రుజువులున్నా అధికారులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి రికవరీ చేసే ప్రయత్నమే చేయలేదనే ఆరోపణలున్నాయి. మహిళా సమాఖ్య సభ్యులకు మంజూరైన దాదాపు లక్షలాది రూపాయలు స్వాహా జరిగి వందలాది మంది అన్యాయానికి గురైనా అధికారులు సొమ్ము రికవరీ కోసం ప్రయత్నాలు చేయడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.