రికవరీ హుళక్కేనా? | Proud of the recovery? | Sakshi
Sakshi News home page

రికవరీ హుళక్కేనా?

Published Tue, Jan 14 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Proud of the recovery?

  •  ‘ఐకేపీ’ బాధితుల గగ్గోలు
  •   లెక్క తేల్చింది రూ.51.15 లక్షలు
  •  స్వాహా సొమ్ము రూ. 90 లక్షలు?
  •   దర్జాగా తిరుగుతున్న  స్వాహారాయుడు
  •  
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : బందరు మండలంలో ఇందిరా క్రాంతి పథంలో  చోటుచేసుకున్న సొమ్ముస్వాహాకు సంబంధించిన నిధుల రికవరీలో సంబంధిత ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తమ పని అయిపోయిందనిపించారు.

    నిధుల  స్వాహాలో కీలకసూత్రధారి  చుట్టం చూపుగా జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. లక్షలాది రూపాయల సొమ్ము స్వాహా జరుగుతున్నట్లు తెలిసినా పై అధికారులకు సమాచారం అందించలేదని బందరు మండల ఇందిరాక్రాంతిపథం ఏపీవో ఉద్దండి వీరరాఘవయ్యను, మరో మహిళా ఉద్యోగిని అధికారులు ఈనెల 10వ తేదీ ఉద్యోగం నుంచి  తొలగించి చేతులు దులుపుకున్నారు.

    ఇందిరా క్రాంతి పథం సొమ్ము పక్కదారి పడుతున్న విషయంపై గత ఏడాది జనవరి నెలలో సాక్షి ‘‘అమ్ ఆద్మీ బీమా సొమ్ము స్వాహా’’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించడంతో అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి విచారణకు ఆదేశించారు. దాదాపు తొమ్మిది నెలల పాటు విచారణ  జరిపారు. ఈ విచారణలో బందరు మండలంలో ఆమ్‌ఆద్మీ బీమా యోజన పథకంలో రూ. 51.15 లక్షల సొమ్ము స్వాహా జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.  అయితే  వాస్తవంగా స్వాహా జరిగిన సొమ్ము రూ. 90లక్షలకు పైగానే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
     
    స్వాహా జరిగిన సొమ్ము మొత్తాన్ని లెక్కల్లో చూపారా లేదా అనే ప్రశ్నలు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది నుంచే వ్యక్తమవుతున్నాయి. నిధుల స్వాహాపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ వహీదున్నీసా గతేడాది నవంబరు 5వ తేదీన ఫిర్యాదు చేశారు. మండల సమాఖ్యకు వచ్చిన నగదును బందరు మండలంలో  ఐకేపీ విభాగం లో  ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎం.జీవన్‌బాబు తన సొంత ఖాతాలోకి మార్చుకుని నిధులు స్వాహా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసిన పోలీసులు జీవన్‌బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్‌పై వచ్చాడు.
     
    ఎలా జరిగిందంటే....

     బందరు మండలం ఇందిరా క్రాంతి పథంలో ఎకౌంటెంట్‌గా పనిచేసిన జీవన్‌బాబు మండల సమాఖ్యకు వచ్చిన నిధులను ఇండియన్ బ్యాంకులో తన పేరుతో ఉన్న ఖాతాకు మార్చుకున్నాడు. బతికి ఉన్న వారిని చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేయడమే కాకుండా...వాస్తవంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తెలియకుండా వేరే వ్యక్తులతో సంతకాలు చేయించి అమ్ ఆద్మీ బీమా సొమ్ము లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్నాడు. బందరు మండల ఇందిరా క్రాంతి పథంలో జరుగుతున్న అక్రమాలపై అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి విచారణాధికారిగా ఏపీడీ శ్రీధర్‌రెడ్డిని నియమించారు.

    దీంతో తీగలాగితే డొంక కదిలింది. మండల ఇందిరా క్రాంతి పథం ఎకౌంటెంట్ జీవన్‌బాబు 2012 సెప్టెంబరు 13వ తేదీన రూ. 6.30 లక్షలు, 2013 జనవరి 11వ తేదీన రూ. 6.25 లక్షలు, మార్చి 18వ తేదీ రూ. 8.60 లక్షలు, ఏప్రిల్ 13వ తేదీన రూ. 13.50 లక్షలు, మే 4వ తేదీన రూ. 4 లక్షలు, జూన్ 6వ తేదీన రూ. 3.50 లక్షలు, ఆగష్టు 7వ తేదీన రూ. 2 లక్షలు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.  ఉన్నతాధికారుల విచారణలోనూ జీవన్‌బాబు తాను నిధులు దిగమింగినట్లు అంగీకరించినట్లు సమాచారం.

    ఇన్ని ఆధారాలు ఉన్నా, సొమ్ము  స్వాహ జరిగినట్లు రుజువులున్నా అధికారులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి  రికవరీ చేసే ప్రయత్నమే చేయలేదనే ఆరోపణలున్నాయి. మహిళా సమాఖ్య సభ్యులకు మంజూరైన దాదాపు లక్షలాది రూపాయలు స్వాహా జరిగి వందలాది మంది అన్యాయానికి గురైనా అధికారులు సొమ్ము రికవరీ కోసం ప్రయత్నాలు చేయడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని  పలువురు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement