ఏలూరు (టూ టౌన్): గత 18 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్న ఇందిరాక్రాంతిపథం యానిమేటర్లు ఆదివారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు పక్కా ప్రణాళికతో భగ్నం చేశారు. జిల్లాలోని సుమారు 200 మంది ఐకేపీ యానిమేటర్లను అదుపులోని తీసుకుని హెచ్చరించారు. అంతేకాకుండా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కనుక అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారంటూ బెదిరించారు. జిల్లాలోని ప్రతి మండలంలోని ఐకేపీ యానిమేటర్ల ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు సేకరించిన పోలీసులు నేరుగా ఇళ్లకు వెళ్లి బయటకు వస్తే అరెస్ట్‌లు చేస్తామంటూ బెదిరించారు.
కొందరు యానిమేటర్లు ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం తొమ్మిది గంటలకే అదుపులోకి తీసుకుని సాయంత్రం ఐదుగంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై పంపించారు. మమ్మల్ని కాదని మీరు బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వేస్టేషన్‌కు వెళ్లినా అరెస్ట్ చేసి తీరతామంటూ హెచ్చరించారు. కాగా నరసాపురం రూరల్ పోలీసుస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న యానిమేటర్లకు మద్దతుగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు నాని పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కాళ్ల మండలంలోని దొడ్డనపూడికి చెందిన కుమారి అనే యానిమేటర్ కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోయూరు.
గర్భిణులను కూడా స్టేషన్ తరలించటంతో పోలీసులు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఐకేపీ యానిమేటర్లు 96 రోజులుగా తమ జీతాల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ వారికి న్యాయం చేయకపోగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయటంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు. ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఖరి ఎండగట్టారు. నిడదవోలు మండలంలో నలుగురిని, పెరవలి మండలంలో ఐదుగురిని, ఉండ్రాజవరం మండలంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భీమవరంలో 18 మందిని, ఉండిలో 13 మందిని, కాళ్లలో ఏడుగురిని, పాలకోడేరులో 10 మందిని, ఆకివీడులో ఐదుగురిని, దేవరపల్లిలో 27 మందిని, ద్వారకాతిరుమలలో ఐదుగురిని, ఆచంటలో ఎనిమిది మందిని, పెనుగొండలో 18 మందిని, పెనుమంట్రలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడిలో 10 మందిని జంగారెడ్డిగూడెంలో 12 మందిని, లింగపాలెంలో ముగ్గురిని, కామవరపుకోట మండలంలో తొమ్మిది మందిని, నరసాపురం మండలంలో 31 మందిని, పోడూరులో 11 మందిని, యలమంచిలిలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తణుకు, అత్తిలి మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం నుంచీ బెదిరించారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక నిఘా పెట్టి రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద పోలీసులు రాత్రి వరకు పహారా కాశారు. జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి, గౌతమి, నరసాపుర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. స్టేషన్‌కు వచ్చేవారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకునేలా అధికారులు డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు అదేశాలు జారీచేశారు. బస్టాండ్‌ల వద్ద కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
చలో హైదరాబాద్‌పై ఉక్కుపాదం
Published Mon, Dec 22 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement