Animator movement
-
చలో హైదరాబాద్‌పై ఉక్కుపాదం
ఏలూరు (టూ టౌన్): గత 18 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్న ఇందిరాక్రాంతిపథం యానిమేటర్లు ఆదివారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు పక్కా ప్రణాళికతో భగ్నం చేశారు. జిల్లాలోని సుమారు 200 మంది ఐకేపీ యానిమేటర్లను అదుపులోని తీసుకుని హెచ్చరించారు. అంతేకాకుండా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కనుక అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారంటూ బెదిరించారు. జిల్లాలోని ప్రతి మండలంలోని ఐకేపీ యానిమేటర్ల ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు సేకరించిన పోలీసులు నేరుగా ఇళ్లకు వెళ్లి బయటకు వస్తే అరెస్ట్‌లు చేస్తామంటూ బెదిరించారు. కొందరు యానిమేటర్లు ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం తొమ్మిది గంటలకే అదుపులోకి తీసుకుని సాయంత్రం ఐదుగంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై పంపించారు. మమ్మల్ని కాదని మీరు బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వేస్టేషన్‌కు వెళ్లినా అరెస్ట్ చేసి తీరతామంటూ హెచ్చరించారు. కాగా నరసాపురం రూరల్ పోలీసుస్టేషన్లో అదుపులోకి తీసుకున్న యానిమేటర్లకు మద్దతుగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు నాని పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కాళ్ల మండలంలోని దొడ్డనపూడికి చెందిన కుమారి అనే యానిమేటర్ కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోయూరు. గర్భిణులను కూడా స్టేషన్ తరలించటంతో పోలీసులు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఐకేపీ యానిమేటర్లు 96 రోజులుగా తమ జీతాల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ వారికి న్యాయం చేయకపోగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయటంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు. ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఖరి ఎండగట్టారు. నిడదవోలు మండలంలో నలుగురిని, పెరవలి మండలంలో ఐదుగురిని, ఉండ్రాజవరం మండలంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలో 18 మందిని, ఉండిలో 13 మందిని, కాళ్లలో ఏడుగురిని, పాలకోడేరులో 10 మందిని, ఆకివీడులో ఐదుగురిని, దేవరపల్లిలో 27 మందిని, ద్వారకాతిరుమలలో ఐదుగురిని, ఆచంటలో ఎనిమిది మందిని, పెనుగొండలో 18 మందిని, పెనుమంట్రలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడిలో 10 మందిని జంగారెడ్డిగూడెంలో 12 మందిని, లింగపాలెంలో ముగ్గురిని, కామవరపుకోట మండలంలో తొమ్మిది మందిని, నరసాపురం మండలంలో 31 మందిని, పోడూరులో 11 మందిని, యలమంచిలిలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తణుకు, అత్తిలి మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం నుంచీ బెదిరించారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక నిఘా పెట్టి రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద పోలీసులు రాత్రి వరకు పహారా కాశారు. జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి, గౌతమి, నరసాపుర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. స్టేషన్‌కు వచ్చేవారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకునేలా అధికారులు డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు అదేశాలు జారీచేశారు. బస్టాండ్ల వద్ద కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం
* వెలుగు యానిమేటర్లకు పోలీసుల నిర్బంధం * ‘చలో హైదరాబాద్’కు వెళ్లకుండా నిరోధం కాకినాడ క్రైం : ఇందిరా క్రాంతి పథం (వెలుగు) యానిమేటర్ల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. యానిమేటర్లు తమ సమస్యల పరిష్కారానికి సోమవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం తలపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యానిమేటర్లు, నాయకులు ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లబోగా యఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నాయకులను వారి గృహాల్లో నిర్బంధించారు. వెలుగు యానిమేటర్లు తమ 15 నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మూడు నెలలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో తమ గళం అసెంబ్లీ ఎదుట వినిపించాలని యానిమేటర్ల నాయకులు తీర్మానించారు. సోమవారం అసెంబ్లీముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యానిమేటర్లు హైదరాబాద్ తరలి రాకుండా నిరోధించాలని ప్రభుత్వం పోలీసుల్ని ఆదేశించింది. ఉద్యమాన్ని అణిచి వేయాలని సూచించింది. దీంతో పోలీసులు జిల్లాలో పలువురు నాయకులను నిర్బంధించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక గస్తీ నిర్వహించి, యానిమేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లాలో సుమారు 500 మంది యానిమేటర్లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజోలులో యానిమేటర్లను వారి గృహాల్లో నిర్బంధించారు. అమలాపురంలో బస్టాండుకు వెళ్లిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆత్రేయపురంలో యూనియన్ నాయకురాలు మణిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో 20 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బొమ్మూరులో ఇళ్ల వద్ద ఉన్న యానిమేటర్లను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు : ఎస్పీ ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆ రెండు రోజుల్లో యానిమేటర్లు, నాయకులు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టులకు ఖండన కాకినాడ సిటీ : సమ్మె చేస్తున్న యానిమేటర్లు సమస్యలు పరిష్కరించకుండా చలో హైదరాబాద్‌కు వెళ్ళేవారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఐటీయూ ఖండించింది. కార్పొరే ట్ వర్గాలకు తొత్తుగా పనిచేస్తున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోరుతున్న కార్మికుల అరెస్టులకు, అణచివేతలకు పూనుకోవడం దారుణమని ఆ సంఘం నాయకులు జి.బేబిరాణి, డి.శేషబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. యానిమేటర్ల చలో హైదరాబాద్ నేపథ్యంలో పోలీసులను ఇళ్ళకు పంపి భయానక పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.