* వెలుగు యానిమేటర్లకు పోలీసుల నిర్బంధం
* ‘చలో హైదరాబాద్’కు వెళ్లకుండా నిరోధం
కాకినాడ క్రైం : ఇందిరా క్రాంతి పథం (వెలుగు) యానిమేటర్ల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. యానిమేటర్లు తమ సమస్యల పరిష్కారానికి సోమవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం తలపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యానిమేటర్లు, నాయకులు ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లబోగా యఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నాయకులను వారి గృహాల్లో నిర్బంధించారు. వెలుగు యానిమేటర్లు తమ 15 నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మూడు నెలలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనకు దిగారు. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
దీంతో తమ గళం అసెంబ్లీ ఎదుట వినిపించాలని యానిమేటర్ల నాయకులు తీర్మానించారు. సోమవారం అసెంబ్లీముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యానిమేటర్లు హైదరాబాద్ తరలి రాకుండా నిరోధించాలని ప్రభుత్వం పోలీసుల్ని ఆదేశించింది. ఉద్యమాన్ని అణిచి వేయాలని సూచించింది. దీంతో పోలీసులు జిల్లాలో పలువురు నాయకులను నిర్బంధించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక గస్తీ నిర్వహించి, యానిమేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లాలో సుమారు 500 మంది యానిమేటర్లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజోలులో యానిమేటర్లను వారి గృహాల్లో నిర్బంధించారు. అమలాపురంలో బస్టాండుకు వెళ్లిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆత్రేయపురంలో యూనియన్ నాయకురాలు మణిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో 20 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బొమ్మూరులో ఇళ్ల వద్ద ఉన్న యానిమేటర్లను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు : ఎస్పీ
ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆ రెండు రోజుల్లో యానిమేటర్లు, నాయకులు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అరెస్టులకు ఖండన
కాకినాడ సిటీ : సమ్మె చేస్తున్న యానిమేటర్లు సమస్యలు పరిష్కరించకుండా చలో హైదరాబాద్‌కు వెళ్ళేవారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఐటీయూ ఖండించింది. కార్పొరే ట్ వర్గాలకు తొత్తుగా పనిచేస్తున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోరుతున్న కార్మికుల అరెస్టులకు, అణచివేతలకు పూనుకోవడం దారుణమని ఆ సంఘం నాయకులు జి.బేబిరాణి, డి.శేషబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. యానిమేటర్ల చలో హైదరాబాద్ నేపథ్యంలో పోలీసులను ఇళ్ళకు పంపి భయానక పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమంపై ఉక్కుపాదం
Published Mon, Dec 22 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement