ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)అధికారుల స్వలాభం మహిళా శిశు
సంక్షేమశాఖకు భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లకు కాంట్రాక్టర్లు ఒక్కోగుడ్డుకు 10పైసలు తీసుకుంటుండగా.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా సరఫరా అవుతున్న ఒక్కోగుడ్డుకు 60 పైసలు అధికారులు చెల్లిస్తున్నారు.. దీంతో ప్రభుత్వ ఖజానాకు నెలకు దాదాపు రూ.29 లక్షల భారం పడుతోంది.. కాగా, ‘ఆరోగ్య లక్ష్మి’ నిబంధనలకు విరుద్ధంగా సరఫరా చేస్తున్నారు..
- కోడిగుడ్ల రవాణా పేరిట చార్జీల మోత
- ఐకేపీ సంఘాల ద్వారా అదనపు భారం
- ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.29 లక్షలు గండి
- ఇప్పటివరకు రూ.1.50 కోట్లు చెల్లింపు
సాక్షి, హన్మకొండ : జిల్లాలో 18 అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరిధిలో 4,196 అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నారుు. ఇందులో గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయసున్న పిల్లలు కలిపి 2,23,323 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలలో 26 రోజులపాటు కోడిగుడ్లు పౌష్టికాహారంగా అందిస్తారు. ఆ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 58,06,398 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇంత భారీసంఖ్యలో గుడ్లు కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు తక్కువగా ఉండాలి. కానీ, జిల్లాలో పది రెట్లు అదనంగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సరఫరా చేయాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది.
నెలకు రూ.29 లక్షలు అదనం
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్ల సంఖ్య ఒక నెలకు 58,06,398. లబ్ధిదారులు 2,23,323 ఉండగా ఒక్కొ గుడ్డుకు రవాణా చార్జీగా రూ.0.60 చెల్లిస్తున్నారు. దీనితో కోడిగుడ్లకు రవాణాకు నెలకు రూ.34,83,838 ఖర్చవుతోంది. కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర సంక్షేమ హస్టళ్లకు టెండర్ల విధానం ద్వారా కాంట్రాక్టర్లు కేవలం పది పైసలకే రవాణా చేస్తున్నారు. ఇదే పద్ధతి ఐసీడీఎస్‌లో అమలైతే నెలకు రూ.5,80,639లోపే రవాణా చేయవచ్చు. కానీ ఐకేపీ సంఘాల ద్వారా గుడ్ల సరఫరా బాధ్యత అప్పగించడం వల్ల ప్రతీ నెల దాదాపు రూ.29 లక్షలు అదనంగా రవాణా చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1.50 కోట్లు అదనపు భారం పడింది.
ఐకేపీతోనే తంటా..
కలెక్టర్‌గా జి.కిషన్ కొనసాగిన కాలంలో అమృతహస్తం పథకంలో భాగంగా అంగన్‌వాడీల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న గుడ్ల సరఫరా బాధ్యతను ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఐకేపీ సంఘాలు ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలకే గుడ్లు సరఫరా చేయాల్సి రావడంతో రవాణా చార్జీలు పెరిగాయి.
దీనికితోడు పెద్ద సంఖ్యలో గుడ్లను సరఫరా చేయడంలో మహిళా సంఘాల అనుభ వలేమి, మౌలిక సదుపాయల కొరతను ఆసరా చేసుకున్న కొందరు అధికారులు గుడ్ల సరఫరాలో తమ మార్క్ దందాను కొనసాగిస్తున్నారు. కాగితాల్లోనే మహిళా సంఘాల ద్వారా సరఫరా అని పేర్కొంటూ.. వాస్తవంలో పర్సంటేజీ స్వీకరించి కాంట్రాక్టర్ల ద్వారానే కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా చార్జీల రూపంలో భారీగా మిగులు ఉండటంతో ఇటూ కాంట్రాక్టర్లు, అటూ అధికారులకు కాసుల పంట పండుతోంది. దీనితో ఇదే పద్ధతిని కొనసాగించేందుకు సుముఖత చూపుతున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.
‘ఆరోగ్యలక్షి్ష్మ’తో రాని మార్పు
2015 జనవరి నుంచి అమృత హస్తం పథకం స్థానంలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ పథకం నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ద్వారానే కోడిగుడ్లను సరఫరా చేయాలి. అయితేటెండర్ల ద్వారా గుడ్లు అందివ్వాలనే నిబంధనలు అమలు చేసేందుకు ఐకేపీ అధికారులు విముఖత చూపుతున్నారు. ఐదు నెలలుగా టెండర్లను ఆహ్వానించకుండా ఐకేపీ మహిళా సంఘాల ద్వారానే గుడ్ల సరఫరాను కొనసాగిస్తున్నారు.