‘అనూహ్య’ కేసులో వీడని మిస్టరీ | Esther Anuhya murder case: Mumbai Police | Sakshi
Sakshi News home page

‘అనూహ్య’ కేసులో వీడని మిస్టరీ

Published Thu, Feb 6 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

‘అనూహ్య’ కేసులో వీడని మిస్టరీ

‘అనూహ్య’ కేసులో వీడని మిస్టరీ

  • నెల రోజులైనా సా..గుతున్న దర్యాప్తు
  •   14 పోలీస్ బృందాల గాలింపు
  •   నేటికీ నిందితులను గుర్తించని వైనం
  •   పాలకుల తీరుపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం
  •  ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోతోంది.. కుమిలి కుమిలి గుండె అవిసిపోతోంది.. కంటికి నిద్ర రావటం లేదు.. గొంతులో ముద్ద దిగటం లేదు.. కన్న కూతుర్ని కర్కశంగా హత్య చేసిన కిరాతకుల కోసం నిరీక్షణ నిరాశగా మారుతోంది.. సత్తువ సన్నగిల్లుతున్నా మరుగుతున్న నెత్తురు మాత్రం కేంద్ర, మహారాష్ట్ర పాలకుల తీరుపై మండిపడితోంది.. ఇది బందరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎస్తేర్ అనూహ్యను కన్నవారి కడుపుకోత.
     
    సాక్షి, మచిలీపట్నం : శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23) కన్నవారికి, ఉన్న ఊరికి దూరమై బుధవారంతో నెల రోజులు గడిచింది. ఆమె హత్యోదంతం వెలుగు చూసి 16 రోజులు దాటింది. అయినా ఘనత వహించిన మహారాష్ట్ర పోలీసులు ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయారు. రోజుకో కథనం ప్రచారం జరుగుతున్నా వాటిని కొట్టిపారేస్తున్న ముంబై పోలీసులు ఈ కేసులో మిస్టరీని ఛేదించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు.
     
    ప్రభుత్వాల స్పందన నామమాత్రం...
     
    క్రిస్మస్ వేడుకల కోసం బందరు వచ్చిన అనూహ్య గత నెల 4న ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఆచూకీ కనిపించకపోవడం, తండ్రి ప్రసాద్, బంధువులు ముంబై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గత నెల 16న కంజుమార్గ్ ప్రాంతంలో అనూహ్య విగతజీవిగా కనిపించింది. ఆమెను అత్యంత దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత కూడా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల స్పందన నామమాత్రమే.
     
    పట్టించుకోని సీఎం, కేంద్ర హోం మంత్రి...
     
    ఈ కేసులో మిస్టరీని ఛేదించి నిందితులను పట్టుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర హోం మంత్రి షిండేలను అనూహ్య తండ్రి ప్రసాద్ కలిసినా ఫలితం లేకపోయింది. హోం మంత్రి షిండే సరిగా స్పందించలేదని ఆయన అప్పట్లో ఆవేదన వెలిబుచ్చారు. కొద్దిరోజుల క్రితం బిషప్ గోవాడ దైవాశీర్వాదం నేతృత్వంలోని క్రైస్తవ ప్రతినిధి బృందం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడతానని చెప్పిన సీఎం అటు తరువాత ఆ విషయాన్నే పట్టించుకోలేదు.
     
    దర్యాప్తులో 14 పోలీస్ బృందాలు.. నిందితులను పట్టుకోలేదు..
     
    అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తు కొండను తవ్వుతున్నట్టు ఉంది. ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు 14 ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిలో ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో ఒక బృందం గత మూడు రోజులుగా బందరులో దర్యాప్తు చేస్తోంది. రెండు బృందాలు హైదరాబాద్‌లో దర్యాప్తు చేస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్లను, అనూహ్య స్నేహితులను, అనుమానితులను పోలీసులు విచారించారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌ను కూడా విచారణ చేశారు.

    ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను తేల్చిచెప్పాడు. మరోవైపు ముంబైలో క్యాబ్ డ్రైవర్లు, ఆఫీసులో పనిచేసేవారు.. తమకు విరోధం ఉన్నవారిని ఈ కేసులో ఇరికించేలా పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు కూడా చేసినట్టు సమాచారం. కేసులో ఎటువంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్ నుంచి సేకరించిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పుటేజ్‌లో అనూహ్యను అనుసరించిన ఆగంతకుడు బందరు, హైదరాబాద్‌లకు చెందినవాడా అనే కోణంలో అతని ఫొటోలను పలు ప్రాంతాలకు పంపించి ప్రత్యేక బృందాలతో ఆరా తీస్తున్నారు.

    ఆగంతకుడి ఫొటోను ఆధార్ కార్డు ద్వారా పోల్చి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి సమీపంలోను, ఆఫీసులోను ఎవరితోనైనా అనూహ్యకు విరోధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దృష్టి పెట్టారు. అనూహ్యకు సంబంధించిన స్నేహితులు, బంధువులు, ఆఫీసులోని వారు, ఇంటి చుట్టుపక్కల వారి వివరాలు, ఫోన్ నంబర్లను ముంబై పోలీసులు సేకరించారు. దీంతో అనూహ్య సెల్ కాల్ లిస్ట్‌లో ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు అనూహ్య పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు ఈ కేసులో కీలకం కానున్నాయి.
     
     ‘అనూహ్య’ కేసులో మలుపులు...
     జనవరి 4న విజయవాడ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి పయనం
     
     5న ముంబైలో రైలు దిగిన అనూహ్య అదృశ్యం
     
     అదేరోజు ఆమె తండ్రి ప్రసాద్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు
     
     వారి సూచన మేరకు బంధువుల సాయంతో ముంబై రైల్వే పోలీసులకు అదేరోజు ఫిర్యాదు
     
     మీరే వెతుక్కోండి.. అంటూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో అనూహ్య తండ్రి ప్రసాద్, బంధువుల సాయంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు
     
     9న అనూహ్య సెల్ సిగ్నల్ కంజుమార్గ్ ప్రాంతంలో గుర్తింపు
     
     16న అదే ప్రాంతంలో అనూహ్య మృతదేహం లభ్యం
     
     అదేరోజు కేసు నమోదు చేసిన ముంబైలోని కంజూర్ ప్రాంత పోలీసులు
     
     17న అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆమె తండ్రి ప్రసాద్ నుంచి డీఎన్‌ఏ నమూనా సేకరించిన ముంబై వైద్యులు
     
     18న బందరులో అనూహ్య అంత్యక్రియలు, హత్యకు నిరసనగా బంద్ నిర్వహించారు.
     
     21న ఈ కేసులో న్యాయం కోసం ఉద్యమించేందుకు బందరులో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు
     
     24న న్యాయం కోసం హోం మంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి ప్రసాద్
     
     27న అనూహ్య కేసులో న్యాయం కోసం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా మోహన్‌దాస్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల విజ్ఞప్తి
     
     31న సీఎం కిరణ్‌ను కలిసిన బిషప్ గోవాడ దైవాశీర్వాదం నేతృత్వంలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
     
     ఫిబ్రవరి 1న ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు అనూహ్యను ఒక ఆగంతకుడు వెంబడిస్తున్నట్టు ఉన్న అనుమానిత దృశ్యాల సేకరణ
     
    3న ముంబైలోని కంజూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు బందరు వచ్చి దర్యాప్తు చేపట్టారు. 4న కూడా దర్యాప్తు కొనసాగింది.
     
    5న అఖిలపక్షం ఆధ్వర్యంలో బందరులో మరోమారు బంద్
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement