సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
భర్త వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
నందిగామ, న్యూస్‌లైన్ : కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూహ్య మృతి మరచిపోకముందే జిల్లాలోని నందిగామకు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు షేక్ ఖాజాబీ (24) మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేకే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి గుల్‌షాద్ పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల కథనం మేరకు.. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన ఖాజాబీ క్యాంపస్ ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. దూరపు బంధువైన షేక్ మునీబ్‌ను ప్రేమించి పెద్దలకు తెలియకుండానే మూడు సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. అతడికి పుణెలోని ఎల్‌అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం రావడంతో తాను కూడా అక్కడికి బదిలీ చేయించుకుంది. ఈ నేపథ్యంలో మునీబ్ కట్నం కోసం వేధించసాగాడు. వేధింపులు తట్టుకోలేని ఖాజాబీ తల్లిదండ్రులకు చెప్పటంతో రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు.
అయినా వేధింపులు ఆగకపోవడంతో తప్పించుకుని విజయవాడ రావడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి గుల్‌షాద్ ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు.. ఖాజాబీ భర్త, అత్త, ఇద్దరు మరుదులు, ఆడపడుచుపై కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి షేక్ లాల్‌సాహెబ్ విజయవాడలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహం ఆదివారం సాయంత్రానికి నందిగామ వచ్చే అవకాశాలున్నట్లు బంధువులు తెలిపారు.