అనూహ్య కేసులో.. ఎవరినీ అరెస్టు చేయలేదు! | Esther anuhya 'trapped' by person known to her, feel cops | Sakshi
Sakshi News home page

అనూహ్య కేసులో.. ఎవరినీ అరెస్టు చేయలేదు!

Published Wed, Jan 22 2014 6:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

అనూహ్య కేసులో.. ఎవరినీ అరెస్టు చేయలేదు!

అనూహ్య కేసులో.. ఎవరినీ అరెస్టు చేయలేదు!

అనూహ్య కేసులో ముంబై పోలీసుల వెల్లడి
చానళ్లలో వచ్చిన వార్తలకు ఖండన
ముంబైలో ప్రవాసాంధ్రుల నిరసన ర్యాలీ
హ ంతకులను వెంటనే పట్టుకోవాలని హోంమంత్రికి వినతి

 
 సాక్షి, ముంబై/మచిలీపట్నం:
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్యను హత్య చేసిన దుండగులను పట్టుకున్నట్లు వచ్చిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టుచేయలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హంతకులను పట్టుకున్నట్లు మంగళవారం పలు టీవీ చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ‘సాక్షి’ వీటిని కంజూర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నిశికాంత్ తుంగారే, కుర్లా రైల్వే పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ శిందే దృష్టికి తీసుకువెళ్లగా వారు అవన్నీ అవాస్తవమన్నారు. కాగా, అనూహ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదానంలో స్థానిక తెలుగు ప్రజలు ర్యాలీ నిర్వహించారు.
 
 తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్‌తోపాటు వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనూహ్యను హత్య చేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, తొందర్లోనే నిందితులను పోలీసులు పట్టుకుంటారని హోంమంత్రి వారికి హామీనిచ్చారు.
 
 కట్టుకథలు అల్లకండి: తన కూతురును హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారంటూ టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తలను అనూహ్య తండ్రి ప్రసాద్ ఖండించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన స్థలానికి సమీపంలో ఒక బెడ్‌షీట్ దొరికినట్టు ముంబై పోలీసులు తనకు మెయిల్ చేశారని, అది తమ కుమార్తెది కాదని తిరిగి తాను మెయిల్‌లో సమాధానం ఇచ్చినట్టు చెప్పారు. తన కుమార్తె మృతిపై పోస్టుమార్టం నివేదిక వచ్చాకే నిజానిజాలు వెళ్లడవుతాయని, అంతవరకూ కట్టుకథలు అల్లకూడదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అనూహ్య హత్యను నిరసిస్తూ విజయవాడలో మేరీస్ స్టెల్లా కాలేజీ విద్యార్థినులు మంగళవారం భారీ ర్యాలీ, మావహారం నిర్వహించి నిరసన తెలిపారు.
 
 అనూహ్య తండ్రికి మైసూరారెడ్డి ఫోన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు పార్టీ పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మంగళవారం అనూహ్య తండ్రి ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఉదంతాన్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తారని చెప్పారు. కాగా, అనూహ్యకు జరిగిన దారుణాన్ని వివరించేందుకు ఆమె తండ్రిని ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర హోంమంత్రి షిండేల వద్ద తీసుకుని వెళ్తామని వైఎస్సార్‌సీపీ బందరు పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కేవీఆర్ విద్యాసాగర్ తెలిపారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement