‘అనూహ్య’ కథనాలు
- కలవరపెడుతున్న ముంబై పోలీసుల తీరు
- అత్యాచారం చేశారంటూ గత ప్రచారం
- ఇప్పుడు దొంగతనం కోసం హత్య చేసినట్టు కథనం
- ముంబై పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆరోపణలు
అనూహ్య కేసులో ముంబై పోలీసులు కట్టుకథలు వినిపిస్తున్నారా? దర్యాప్తు ఏదోరకంగా అయ్యిందనిపించి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారా? మొదట్నుంచీ విమర్శలకు తావిస్తున్న వారి తీరు తాజాగానూ అలాగే ఉంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇప్పుడు పాత నేరస్తుడిని అరెస్టు చూపించారన్న విమర్శలు రేగుతున్నాయి.
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో ముంబై పోలీసులు మొదట్నుంచీ అపవాదులనే మూటగట్టుకుంటున్నారు. మిస్టరీగా మారిన అనూహ్య హత్య కేసులో ఏదో ఒకరకంగా దర్యాప్తు అయ్యిందనిపించి చేతులు దులిపేసుకునే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలకు పోలీసులు చెబుతున్న కథనాలే ఊతమిస్తున్నాయి.
అనూహ్య సామూహిక అత్యాచారానికి గురైందంటూ గతంలో మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పెద్ద కలకలమే రేగింది. తాజాగా దొంగతనం కోసం ఆమెను హత్య చేశారంటూ కొత్త కథనం ప్రచారంలోకి తెచ్చారు. ఏదో సాకు చూపి అనూహ్య హత్య కేసును త్వరగా మూసివేయాలన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు చెబుతున్న కథనాలను ఆమె తండ్రి శింగవరపు జోనాథన్ ప్రసాద్ ఖండిస్తున్నారు.
ఒంటరిగా బైక్ పై వెళుతుందా..?
తాజాగా అనూహ్య హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ నాసిక్‌కు చెందిన చంద్రభాను సాసప్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరుపర్చడంతో అతనికి 15 రోజులు రిమాండ్ విధించారు. అతన్ని అరెస్టు చూపించిన పోలీసులు అనూహ్య కేసును మూసివేసేందుకు ఆతృత చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 5న రైల్వే స్టేషన్‌లో దిగిన అనూహ్యను మోటార్ బైక్‌పై తీసుకుని వెళ్లి దొంగతనం కోసం హత్య చేశాడని ముంబై పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు.
ఒంటరిగా వచ్చిన యువతి క్యాబ్ ఎక్కకుండా మోటార్ బైక్ ఎందుకు ఎక్కుతుందనే ప్రశ్నకు ముంబై పోలీసుల వద్ద సమాధానం లేదు. జనవరి 16న అనూహ్య మృతదేహం లభ్యంకావడంతో హత్యకేసుగా నమోదుచేసిన పోలీసులు దాదాపు 47 రోజులుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ముంబై పోలీసులు మూడు బృందాలు, క్రైం బ్రాంచి రెండు బృందాలు హైదరాబాద్, మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాల్లో దర్యాప్తు నిర్వహించాయి. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో అనూహ్య స్నేహితుడు హేమంత్ (హైదరాబాద్)ను ముంబై పిలిచి మరీ విచారణ చేశారు.
సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌లో ఉన్నవారిని, క్యాబ్ డ్రైవర్లను ఇలా రోజులతరబడి వందలాది మందిని విచారించారు. చివరకు ఏదో రకంగా ఈ కేసును మూసివేసేందుకు పాత నేరస్తుడిని అరెస్టు చూపించారన్న విమర్శలు రేగుతున్నాయి. తన కుమార్తె హత్య కేసును కట్టుకథలతో మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారని అనూహ్య తండ్రి ప్రసాద్ మరోమారు ముంబై పోలీసులపై విమర్శలు చేయడం గమనార్హం.