బందరులో ముంబై పోలీసుల విచారణ | investigation of the Mumbai police bandar | Sakshi
Sakshi News home page

బందరులో ముంబై పోలీసుల విచారణ

Published Tue, Feb 4 2014 1:12 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

బందరులో ముంబై పోలీసుల విచారణ - Sakshi

బందరులో ముంబై పోలీసుల విచారణ

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసుపై ముంబై పోలీసులు మచిలీపట్నంలో సోమవారం విచారణ నిర్వహించారు. ఈ కేసు విచారణ కోసం కంజూర్ పోలీస్‌స్టేషన్ సీఐ అశోక్, కోలీ, ఠాకూర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసులకు కూడా తెలియకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగి అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్‌లో నడిచి వెళ్లిన వ్యక్తి ఫొటో చూపి ‘ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడేనా’ అంటూ ఆరా తీశారు.

అనంతరం అనూహ్య తండ్రి ప్రసాద్ ఇంటికి వెళ్లి పోలీసులు రైల్వేస్టేషన్ సీసీ టీవీ నుంచి తీసుకున్న ఫుటేజీలను చూపి.. ‘అనూహ్యతో నడిచి వెళుతున్న వ్యక్తి మీకు తెలుసా లేదా, అనూహ్యతో పాటు నడిచి వెళ్లేది హేమంతేనా?’ అని ప్రశ్నించారు. అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్‌లో నడిచి వెళ్లే వ్యక్తి హేమంత్ కాదని అనూహ్య తండ్రి ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హేమంత్ తమ కుటుంబ సభ్యుల్లో ఒకడని, అసలు దోషులను వదిలేసి హేమంత్‌ను అనుమానించటం సరికాదని వారికి సూచించారు. అనూహ్య హత్య కేసులో పలువురిని అనుమానిస్తున్నామని, వారందరినీ విచారణ చేస్తామని, అందులో హేమంత్ కూడా ఒకరని చెప్పి వెళ్లిపోయారు.
 
ఐదు బృందాల గాలింపు...
 
అనూహ్య హత్య కేసులో నిందితుల ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కంజూర్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ విలేకరులకు తెలిపారు. అనూహ్య హత్య ఘటనపై కుంజూర్ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదైందన్నారు. మచిలీపట్నంలో ఒక బృందం, హైదరాబాదులో రెండు బృందాలు అనూహ్య హత్య కేసులో నిందితులను కనుగొనేందుకు పర్యటిస్తున్నాయని ఆయన చెప్పారు. కుంజుమార్గ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనూహ్యకు సమపంలో నడిచి వెళ్లే వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడా, ఎవరికైనా ఇక్కడి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయా అనే అంశంపై విచారణ చేసేందుకు వచ్చామన్నారు.
 
300 మందిని విచారించాం...
 
అనూహ్య హత్యకేసులో ఇప్పటికి 300 మందిని విచారించామని సీఐ చెప్పారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు. మరో రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి వివరాలు సేకరిస్తామన్నారు. బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ మురళీధర్, మచిలీపట్నం ఎస్సై శ్రీహరిలతో ముంబై నుంచి వచ్చిన పోలీసు బృందం సంప్రదింపులు జరుపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement