అనూహ్య కేసును సీబీఐకి అప్పగించాలి
- మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని డిమాండ్
- విద్యార్థుల మానవహారం
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ముంబైలో దారుణహత్యకు గురైన ఇంజినీరింగ్ విద్యార్థి సింగవరపు అనూహ్య కేసును ప్రభుత్వం వెంటనే సీబీఐకి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. కేసు విచారణను వేగవంతం చేసి.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు శుక్రవారం నవకళా సెంటర్‌లో భారీ మానవహారం నిర్మించారు. అనూహ్య మృతికి కారకులైనవారికి కఠినంగా శిక్షించాలి.. ముంబై పోలీసులు డౌన్‌డౌన్.. అంటూ విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
పేర్ని నాని మాట్లాడుతూ అనూహ్య కేసులో ముంబై పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కేంద్రం నిర్భయచట్టాన్ని అమల్లోకి తెచ్చినా ఇలాంటి ఘటనలు ఆగకపోవడం విచారకరమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము మాట్లాడుతూ కేసు విచారణను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఏపీ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.సుందరరామ్ మాట్లాడుతూ.. ఈ దారుణ సంఘటన సభ్యసమాజానికే సిగ్గుచేటని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సీపీఐ జిల్లా నాయకురాలు దేవభక్తుని నిర్మల, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకుడు యద్దనపూడి సోని, వైఎస్సార్ సీపీ నాయకులు గాడెల్లి డేవిడ్ శామ్యూల్, పరింకాయల శ్రీనివాసరావు, ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు చిత్తజల్లు రామకృష్ణ, ఐ.వి.వి.కుమార్‌బాబు, కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.