అనూహ్య (ఫైల్ ఫొటో)
ముంబై: అనూహ్య కేసు విషయంలో ముంబై పోలీసులలో కదలిక వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో మహారాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య 16న ముంబైలోని కంజూర్ మార్గ్-భాండూప్ మధ్యలో ఈస్టరన్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన శవంగా కనిపించింది. అనూహ్య కనిపించడంలేదని ఫిర్యాదు ఇచ్చిన తరువాత గానీ, మృతదేహం కనిపించిన తరువాత గానీ మహారాష్ట్ర పోలీసులు సరిగా స్పందించలేదని అనూహ్య బంధువులు ఆరోపించారు. దర్యాప్తు కూడా సరిగా జరగడంలేదని వారు చెప్పారు.
ఈ కేసు విషయమై డీజీపీ బి. ప్రసాద రావు ముంబై పోలీసులతో మాట్లాడారు. దాంతో ముంబై పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. మృతదేహం లభించిన ప్రదేశం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో క్లూస్ ఏమైనా దొరుకుతాయోమోనని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో అనూహ్యకు చెందిన బ్లాంకెట్, చెప్పులు కనిపించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.